DCAA కి జాన్వీ కపూర్ గుడ్‌బై.. బాలీవుడ్‌లో గాడ్‌ఫాదర్ కల్చర్‌పై మళ్లీ చర్చ
గత రెండేళ్లుగా జాన్వీ కపూర్ డీసీఏఏ ఆధ్వర్యంలో తన ప్రొఫెషనల్ వ్యవహారాలను నిర్వహించుకుంది.;
బాలీవుడ్‌లో తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు చెందిన టాలెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ ధర్మ కార్నర్‌స్టోన్ ఆర్టిస్ట్ ఏజెన్సీ(డీసీఏఏ)ను వీడి, ఇప్పుడు కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్‌వర్క్ లో చేరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ మార్పు బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కొత్త మేనేజ్‌మెంట్ సంస్థకు మారిన జాన్వీ
గత రెండేళ్లుగా జాన్వీ కపూర్ డీసీఏఏ ఆధ్వర్యంలో తన ప్రొఫెషనల్ వ్యవహారాలను నిర్వహించుకుంది. ఆమె కెరీర్‌లో కీలక దశలో ఈ సంస్థ మార్గదర్శకత్వం అందించింది. అయితే తాజాగా ఆమె కొత్త మేనేజ్‌మెంట్ సంస్థకు మారడం ఇండస్ట్రీలో వివిధ కోణాల్లో విశ్లేషణకు దారి తీసింది. ముఖ్యంగా దీర్ఘకాల అనుబంధాలు, విశ్వాసం, వ్యూహాత్మక నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తబడుతున్నాయి.
టాలెంట్ ఏజెన్సీ నడపడం కృతజ్ఞత లేని పని
రీసెంట్ గా కరణ్ జోహర్ నటులు తరచూ తమ మేనేజ్‌మెంట్ సంస్థలను మార్చడంపై వ్యాఖ్యలు చేశారు. టాలెంట్ ఏజెన్సీ నడపడం చాలా సందర్భాల్లో కృతజ్ఞత లేని పని అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు జాన్వీ నిష్క్రమణ నేపథ్యంలోనే వచ్చాయని బాలీవుడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అధికారికంగా ఈ రెండింటి మధ్య సంబంధంపై ఎలాంటి క్లారిటీ లేదు.
జాన్వీ కపూర్ తన సినీ జర్నీని కరణ్ జోహర్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ తోనే ప్రారంభించింది. ఆమె డెబ్యూ దశలో ఆయన మద్దతు కీలక పాత్ర పోషించింది. ఈ కారణంగా ఇలా విడిపోవడం ఇండస్ట్రీలో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గురు-శిష్య సంబంధాలపై, బాలీవుడ్‌లో ఉండే గాడ్‌ఫాదర్ కల్చర్ పై కూడా మరోసారి చర్చ మొదలైంది.
ఇక ఈ విషయంలో ఫ్యాన్స్ రెస్పాన్స్ కూడా విభిన్నంగా కనిపిస్తోంది. కొందరు కొత్త మేనేజ్‌మెంట్‌తో జాన్వీ కెరీర్‌కు కొత్త దిశ లభిస్తుందని భావిస్తున్నారు. విభిన్న ప్రాజెక్టులు, భిన్నమైన నెట్‌వర్క్‌లు, అంతర్జాతీయ అవకాశాలు పొందే అవకాశముందని అంటున్నారు. మరికొందరు మాత్రం కరణ్ జోహర్ మద్దతు ఆమె ఎదుగుదలకు కీలకమైందని, ఆ అనుబంధం కొనసాగి ఉంటే మరింత ప్రయోజనం కలిగేదని అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి సినీ రంగంలో నటీనటులు తమ కెరీర్ వ్యూహాలను కాలానుగుణంగా మార్చడం అసాధారణం కాదు. కొత్త మేనేజ్‌మెంట్ సంస్థలో చేరడం ద్వారా విభిన్న దిశల్లో అవకాశాలు అన్వేషించడం సాధారణ ప్రక్రియగానే భావించవచ్చు. జాన్వీ కపూర్ ఈ నిర్ణయం కూడా అలాంటి వ్యూహాత్మక అడుగుగా చూడవచ్చు. ఈ మార్పు ఆమె భవిష్యత్ చిత్రాల ఎంపికపై, కెరీర్ దిశపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ప్రస్తుతానికి బాలీవుడ్ దృష్టి మొత్తం ఈ పరిణామంపైనే కేంద్రీకృతమై ఉంది.