ప్యారడైజ్ లో యాక్షన్ కంటే ఎమోషనే ఎక్కువ.. జడల కథ ఇదే: శ్రీకాంత్

సెప్టెంబర్ 24న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మీడియాతో సినిమా విశేషాలను షేర్ చేసుకున్నారు.

Update: 2026-09-19 18:06 GMT

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ది ప్యారడైజ్’ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సెప్టెంబర్ 24న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మీడియాతో సినిమా విశేషాలను షేర్ చేసుకున్నారు. ప్యారడైజ్ కథలో నిజ జీవిత సంఘటనలు, కొన్ని రోల్స్, క్రియేట్ చేసిన ఎలిమెంట్స్ ఉంటాయని తెలిపారు.

నాని పోషిస్తున్న జడల్ రోల్ వెనుక తన చిన్ననాటి జ్ఞాపకాలు కూడా ఉన్నాయని చెప్పారు. తన తల్లి ఆడపిల్ల పుడితే బాగుంటుందని అనుకున్నారని, కానీ తాను పుట్టడంతో చిన్నతనంలో తనకు జడలు వేసి, గౌన్ వేసి పెంచారని తెలిపారు. రెండో తరగతి వరకు తనకు జడలు ఉండేవని, ఆ అనుభవం నుంచే సినిమాలోని జడల ఆలోచన వచ్చిందని వివరించారు.

తాను పుట్టి పెరిగిన గోదావరిఖని ప్రాంతంలోని సంఘటనలు, అక్కడి మనుషుల నుంచి కూడా సినిమాకు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నానని చెప్పారు. ఆదిలాబాద్, గోదావరిఖని ప్రాంతాల మధ్య జరిగిన కొన్ని ఘటనలను స్టోరీలో యూజ్ చేసినట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్‌ లో ఉన్న సమయంలో పక్కనే ఉన్న బస్తీల్లో చూసిన జీవితాన్ని కూడా సినిమాలోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

'దసరా విషయంలో ప్రేక్షకులు ప్రమోషనల్ కంటెంట్ చూసి భారీ మాస్ సినిమా వస్తుందని ఊహించారు. కానీ థియేటర్‌ లో డ్రామా ఎక్కువగా ఉండటంతో మొదట కొంత నిరాశకు గురయ్యారని తనకు ఫీడ్‌ బ్యాక్ వచ్చింది. అయితే రెండు రోజుల తర్వాత ప్రేక్షకులు సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారని, చివరకు అది బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచింది. ఈసారి ప్రేక్షకులు కోరుకునే మాస్, యాక్షన్ అంశాలతోపాటు స్ట్రాంగ్ ఎమోషన్‌ ను కలిపి ప్యారడైజ్ రూపొందించా' అని చెప్పారు.

సినిమాలో యాక్షన్ కంటే ఎమోషన్ ఎక్కువగా ఉంటుందని శ్రీకాంత్ అన్నారు. ముఖ్యంగా మదర్ అండ్ సన్ ఎమోషన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పిన ఆయన, నాని జడల్ పాత్ర మాస్, యాక్షన్ ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని తెలిపారు. చిన్నప్పుడు ఎలాంటి సమాచారం లేకుండా థియేటర్‌ కు వెళ్లి ప్రతి సీన్ కు సర్ప్రైజ్ అయ్యేవాళ్లమని, తనకు కూడా అలాంటి అనుభవమే ఇష్టమని తెలిపారు.

సినిమా షూటింగ్ మొత్తం 170 రోజుల్లో పూర్తయిందని చెప్పారు. మొదట 160 రోజుల్లో పూర్తి చేయాలని అనుకున్నామని, షూటింగ్ ఫ్లోలో మరో పది రోజులు పెరిగాయని వివరించారు. రీషూట్‌ల వల్ల ఆలస్యం కాలేదని, బౌండ్ స్క్రిప్ట్ ప్రకారమే సినిమా పూర్తి చేశామని స్పష్టం చేశారు. 'నానితో నాకు అన్నదమ్ముల అనుబంధం ఉంది. దర్శకుడిగా తనకు జీవితం ఇచ్చిన వ్యక్తిగా నానిపై ఎప్పుడూ కృతజ్ఞత ఉంటుంది' అని చెప్పారు.

ఏష నాగుల పాటను సెవెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు రోజూ ఆటోలో విన్నానని, అదే పాటను సినిమాలో ఉపయోగించాలని అనిపించిందని చెప్పారు. ప్యారడైజ్ కు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ఉండదని, ఇది సింగిల్ మూవీ అని స్పష్టం చేసిన శ్రీకాంత్ ఓదెల, సినిమా విడుదలైన తర్వాత మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. చిరంజీవితో సినిమా మాత్రం కచ్చితంగా ఉంటుందని వెల్లడించారు.

Tags:    

Similar News