మ‌హేష్ ఇంకో 17 రోజులే.. ఆ త‌ర్వాత జ‌క్క‌న్న నుంచి విముక్తి!

మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజా అప్‌డేట్స్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేస్తున్నాయి.

Update: 2026-09-19 18:06 GMT

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ చిత్రం 'వార‌ణాసి' పై ప్రస్తుతం సర్వత్రా ప్ర‌జ‌ల్లో ఆసక్తి నెలకొంది. మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజా అప్‌డేట్స్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన వారణాసి షెడ్యూల్ అక్టోబర్ మొదటి వారానికల్లా పూర్తిగా ముగియనుందని సమాచారం.

ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించిన కీలకమైన పోర్షన్స్ అన్నీ కేవలం వారంలోనే పూర్తికానున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ గ్రాండ్ స్కేల్ ఎంటర్‌టైనర్‌ను 7 ఏప్రిల్ 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. చెప్పిన తేదీ ప్ర‌కారం రావాలంటే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్ని వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక‌పై ఎలాంటి ఆల‌స్యం లేకుండా జ‌క్క‌న్న నిర్మాణానంత‌ర ప‌నులపై దృష్టి సారిస్తార‌ని కూడా తెలుస్తోంది.

సినిమా కంటెంట్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఈ చిత్రంలో వారణాసి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అత్యంత కీలకం కానున్నాయి. పురాతన నగర వాతావరణం, ఆధ్యాత్మికతతో పాటు రాజమౌళి మార్క్ విజువల్స్ ఈ షెడ్యూల్‌లో ప్రధాన ఆకర్షణగా చిత్రీక‌రిస్తున్నారు. కేవలం రియల్ లోకేషన్స్ మాత్రమే కాకుండా.. సినిమాలోని అత్యున్నత విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీ సెట్లను సైతం చిత్ర యూనిట్ ఉపయోగించినట్లు సమాచారం.

ఇక 'వారణాసి' షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేయాల్సిన‌ తదుపరి చిత్రంపై కూడా ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు ఎవరి దర్శకత్వంలో నటిస్తారనే దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం పలువురు టాప్ డైరెక్టర్లు మహేష్ కోసం కథలతో సిద్ధంగా ఉన్నారు.

మరోవైపు 'వార‌ణాసి' సినిమాకు సంబంధించిన బిజినెస్ డీలింగ్స్ కూడా ఇప్పటికే పీక్స్‌కు చేరాయి. రాజమౌళి బ్రాండ్ ఇమేజ్, మహేష్ బాబు గ్లోబల్ మార్కెట్ కారణంగా ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్, ఓవర్సీస్ హక్కులు , శాటిలైట్ డీల్స్ అన్నీ కూడా రికార్డు స్థాయి ధరలకు అమ్ముడవుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో భారీ చర్చ నడుస్తోంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ బిజినెస్ జరిగే ప్రాజెక్ట్‌లలో ఒకటిగా ఇది నిలవనుంది. తాజా స‌మాచారం మేర‌కు మ‌హేష్ బాబు ఇంకో 17 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తే.. ఆ త‌ర్వాత జ‌క్క‌న్న నుంచి విముక్తి ల‌భించిన‌ట్టేన‌న్న చ‌ర్చ సాగుతోంది!

Tags:    

Similar News