అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ'.. ఫస్ట్ డే లెక్క ఎంతంటే?
ప్రీమియర్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.12.3 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ ప్రకటించింది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్ లో మరో మైల్ స్టోన్ గా నిలిచేలా చెన్నై లవ్ స్టోరీ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రేమకథలంటే యువతలో ఎప్పుడూ స్పెషల్ రెస్పాన్స్ ఉంటుంది. అదే ఎమోషన్స్, మ్యూజిక్, నేచురల్ రోల్స్ తో తెరకెక్కిన ఆ చిత్రం విడుదలైన తొలి రోజే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్రీమియర్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.12.3 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. దీంతో కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ గా తెలుస్తోంది.
రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ లీడ్ రోల్స్ లో నటించారు. త్రిగుణ్, సిరి హనుమంత్, మౌనిక రెడ్డి, నవీన్ నేని, కార్తీక్, మహేందర్, నరేష్, పూజ ఇతర పాత్రల్లో యాక్ట్ చేశారు. సాయి రాజేష్ కథ అందించగా, ఎస్కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మించారు. ప్రేమ, బాధ, జీవితంపై ఆశలు అనే మూడు ఎమోషన్స్ కలిపి రూపొందించిన ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
కథ విషయానికి వస్తే.. నివేదిత అలియాస్ నివి (శ్రీ గౌరీప్రియ) ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుంది. కానీ పెళ్లి మండపం వరకూ వచ్చిన వరుడు అజయ్ (త్రిగుణ్) చివరి క్షణంలో వెనక్కి తగ్గడంతో ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. ఆ బాధలోనే చెన్నైలో ఒంటరిగా జీవితం గడుపుతుండగా, స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) ఆమె జీవితంలోకి వస్తాడు. అతని అమాయకత్వం, మానవత్వం నివిలో మళ్లీ కొత్త ఆశలను నింపుతాయి. అయితే వారి జీవితాల్లో చోటు చేసుకునే అనూహ్య పరిణామాలు కథకు కీలకంగా మారుతాయి.
ఇక సినిమాలో కిరణ్ అబ్బవరం తన గత చిత్రాలకు భిన్నంగా కనిపించారు. సాధారణంగా కొంత యాటిట్యూడ్ ఉన్న పాత్రల్లో కనిపించే ఆయన, ఇందులో అమాయక యువకుడిగా నటించి ప్రశంసలు అందుకుంటున్నారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆయన యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఆ చిత్రానికి అసలు బలంగా నిలిచిందని పలువురు చెబుతున్న పేరు శ్రీ గౌరీప్రియ.
నివి పాత్రలో ఆమె నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ లో ఆమె యాక్టింగ్ ప్రేక్షకులను కదిలిస్తోందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్రిగుణ్ తన రోల్ తగ్గట్లు మెప్పించగా, ప్రమోదిని, దేవీప్రసాద్, సిరి హనుమంతు, కరుణ్ కుమార్ తదితరులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ గా కూడా చెన్నై లవ్ స్టోరీకి మంచి మార్కులే వస్తున్నాయి.
మణిశర్మ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తొలి ప్రేమేం, జిగితార, కొయిల కొయిల పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. డేనియల్ విశ్వాస్ అందించిన సినిమాటోగ్రఫీ మరింత అందాన్ని తీసుకొచ్చింది. అలా కిరణ్ అబ్బవరం అభిమానులతో పాటు ప్రేమకథలను ఇష్టపడే ప్రేక్షకులను చెన్నై లవ్ స్టోరీ ఆకట్టుకుంటోంది. తొలి రోజే రూ.12.3 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ ఓపెనింగ్స్ అందుకున్న ఆ మూవీ.. రానున్న రోజుల్లో ఎంతటి కలెక్షన్లు నమోదు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.