అబ్బవరం డెబ్యూ సిరీస్.. ఇదేదో గట్టి ప్లానే..
టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెడుతున్నారు.;
టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెడుతున్నారు. ఇటీవల ఆయన నటించిన క, కె-ర్యాంప్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఆ రెండు సినిమాలు భారీగా గ్రాస్ కలెక్షన్లు సాధించి, కిరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. దీంతో తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆయన మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈసారి సినిమా కాదు, వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఆయన ఓ రూరల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తోపాటు రాజకీయ అంశాలతో రూపొందుతున్న ఆ సిరీస్ పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఆ వెబ్ సిరీస్ ను భరత్ కమ్మా దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన రూపొందించిన డియర్ కామ్రేడ్ మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత దాదాపు ఏడేళ్ల విరామం తీసుకున్న భరత్ కమ్మ, ఇప్పుడు కిరణ్ అబ్బవరం డెబ్యూ సిరీస్ తో మళ్లీ మెగా ఫోన్ పట్టడం విశేషం. దీంతో ఆ ప్రాజెక్టుపై సినీ వర్గాల్లో మంచి బజ్ నెలకొంది. గువ్వల చెరువు గట్టు అనే ప్రత్యేకమైన టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం.
టైటిల్ ను చూస్తే కథలో గ్రామీణ వాతావరణం, లోకల్ రాజకీయాలు ప్రధానంగా ఉండబోతున్నాయని అర్థమవుతోంది. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం సిరీస్ లో పోషిస్తున్న పాత్ర ఇప్పటివరకు ఆయన చేసిన రోల్స్ కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఆ సిరీస్, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.
స్టోరీ, ప్రొడక్షన్ వాల్యూస్, క్యాస్టింగ్ అన్నీ కలిసి ఇది అమెజాన్ నుంచి రాబోతున్న బడా ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా సిరీస్ లో క్యాస్టింగ్ ఎంపిక కూడా ప్రత్యేకంగా ఉండబోతోందని, ఇప్పటికే మంచి ఫేమ్ ఉన్న నటీనటులు ఇందులో భాగమవుతున్నారని సమాచారం. ప్రేక్షకులకు సర్ప్రైజ్ లు ఉండనున్నాయని వినికిడి. దీంతో పెద్ద ప్లానేే వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఉగాది సందర్భంగా ఆ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం. దీంతో అభిమానుల్లో ఇంట్రెస్ట్ ఫుల్ గా పెరుగుతోంది. మొత్తానికి ఇప్పటివరకు సినిమాలతో అలరించిన కిరణ్ అబ్బవరం, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ పై ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అనేది చూడాలి. గువ్వల చెరువు గట్టు వెబ్ సిరీస్ ఆయన కెరీర్ లో మరో మైల్ స్టోన్ గా నిలుస్తుందా లేదా అన్నది విడుదల తర్వాతే తెలియనుంది.