నాగ్ 100 కోట్లు కొట్టాలంటే..

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ కింగ్ నాగార్జున.;

Update: 2026-01-16 15:30 GMT

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ కింగ్ నాగార్జున. కెరీర్‌ స్టార్టింగ్ నుంచే ప్రయోగాత్మక సినిమాలు, విభిన్న పాత్రలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్‌ ను పూర్తిగా యూజ్ చేసుకోకపోవడమే అందుకు ప్రధాన కారణమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే నాగార్జున ప్రస్తుతం తన కెరీర్‌ లో 100వ సినిమాను చేస్తున్నారు. కింగ్‌ 100 అనే వర్కింగ్‌ టైటిల్‌ తో తెరకెక్కుతున్న ఆ చిత్రానికి తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఆ మూవీ.. యాక్షన్ ప్రధానంగా సాగుతుందని తెలుస్తోంది. సినిమాలో నాగార్జున లుక్, క్యారెక్టర్ పూర్తిగా కొత్తగా ఉంటుందని సమాచారం. కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ప్రాజెక్ట్‌ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

అదే సమయంలో నాగ్ కు రూ.100 కోట్ల హిట్ ఎప్పుడు సొంతమవుతుందోనని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించినా.. ఆ మార్క్ అందుకోకపోవడం గమనార్హం. ఆయనతో పాటు సీనియర్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ మాత్రం ఇప్పటికే పలు రూ.100 కోట్ల సినిమాలను తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో నాగార్జున అభిమానుల్లో ఈ అంశం మరింత ఆసక్తిగా మారింది.

అయితే ఇప్పుడు నాగార్జునకు రూ.100 కోట్ల హిట్ రావాలంటే అనిల్ రావిపూడితో సినిమా చేయాలని అనేక మంది సినీ ప్రియులు, నెటిజన్లు, కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచాయి. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో ఆయన చేసిన సినిమాలు పండగల సీజన్‌ లో భారీ వసూళ్లను సాధించాయి.

ఇప్పటివరకు అనిల్ రావిపూడితో పని చేయని సీనియర్ హీరోల్లో నాగార్జున ఒకరే మిగిలారు. అందుకే ఆ కాంబినేషన్ వస్తే నాగ్ కెరీర్‌ కు ఇది సరైన టర్నింగ్ పాయింట్ అవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఫుల్ ఎంటర్టైనర్ అయినా, కొత్తదనం ఉన్న కథ అయినా అనిల్ రావిపూడి హ్యాండిల్ చేయగలరనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. అంతేకాదు సీరియస్ టోన్‌ ను కూడా సక్సెస్ ఫుల్ గా చూపించగలరు. ఇప్పటికే భగవంత్ కేసరి మూవీతో అది నిరూపించారు.

అదే సమయంలో అనిల్ సినిమాలు తక్కువ బడ్జెట్‌ లో వేగంగా పూర్తవుతాయి. దీంతో నాగార్జున నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా.. నాగార్జున, అనిల్ కాంబినేషన్‌ లో సినిమా వస్తే, అది నాగ్ కు ఫస్ట్ రూ.100 కోట్ల హిట్‌ గా నిలిచే అవకాశం ఉందని ఆయన అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరేం జరుగుతుందో.. ఆ కాంబోలో ఎప్పుడు మూవీ వస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News