ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు కేసరి సాబ్..!
కేసరి చాప్టర్ 2 సినిమా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.100 కోట్లకు మించి వసూళ్లు చేసిన విషయం తెల్సిందే.;
ఈ మధ్య కాలంలో డబ్బింగ్ సినిమాలు అని చిన్న చూపు చూడకుండా భారీ ఆధరణ లభిస్తున్న విషయం తెల్సిందే. పుష్ప సినిమా సౌత్ ఇండియా నుంచి వెళ్లినా నార్త్ ఇండియాలో ఏకంగా వెయ్యి కోట్లకు మించి వసూళ్లు రాబట్టింది. అంతకు ముందు కూడా చాలా సినిమాలు తెలుగులో రూపొంది ఇతర భాషల్లో విడుదల అయ్యి మంచి వసూళ్లు రాబట్టాయి. ఇక ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యి మంచి వసూళ్లు నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి. కనుక ఎక్కువ శాతం పెద్ద హీరోల సినిమాలు, క్రేజీ సినిమాలను ఒరిజినల్‌తో పాటు డబ్ వర్షన్‌ను విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు, అలా రెండు వర్షన్‌లు ఒకే సారి విడుదల అయితేనే మంచి ఫలితం ఉంటుంది.
కేసరి చాప్టర్ 2 సినిమా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.100 కోట్లకు మించి వసూళ్లు చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం నేపథ్యంలో తెలుగులోనూ డబ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మే 23న కేసరి 2 సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నారు. హిందీలో విడుదల అయిన సమయంలోనే తెలుగులో విడుదల చేస్తే కచ్చితంగా మంచి ఫలితం ఉండేది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒకే సారి అన్ని భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అలా జరగక పోవడం చాలా పెద్ద నష్టంను మిగిల్చింది.
ఛావా సినిమా హిందీలో సూపర్ హిట్ కావడంతో తెలుగులో దాదాపు నాలుగు వారాల ఆలస్యంగా తెలుగులో రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. హిందీలో విడుదల అయిన సమయంలోనే తెలుగు డబ్బింగ్ వర్షన్ విడుదల అయ్యి ఉంటే కచ్చితంగా వసూళ్లు రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉండేవి అనేది బాక్సాఫీస్ వర్గాల మాట. ఛావా సినిమాకు అయినట్లుగానే కేసరి 2 సినిమా తెలుగు వర్షన్‌కి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ సినీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం సినిమా గురించి ఎక్కువగా పబ్లిసిటీ చేయడం లేదు. తెలుగు మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని విభిన్నంగా ప్రచారం చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఊచకోత కేసు ఎలా కోర్ట్‌లో సాగింది, దాని తీరు తెన్నుల గురించి ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో లాయర్ సి శంకర్ నాయర్ జీవిత చరిత్రను చూపించారు. శంకర్ నాయర్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించారు. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను ఇతర భాషల్లో విడుదల చేయాలని అని అనుకోవడం మంచి విషయం. కానీ చాలా ఆలస్యం అయిందని, అంతా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో థియేట్రికల్ స్క్రీనింగ్ అనేది చాలా తప్పుడు నిర్ణయం అనేది కొందరి అభిప్రాయం. కేసరి కనీసం రెండు మూడు వారాల క్రితం వచ్చినా ఫలితం బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.