కయాదు ప్రమోషన్ల వివాదం.. అసలు కారణం ఇదేనా?
దీంతో కయాదు లోహార్ పై సినిమాలను ఎంపిక చేసుకుని ప్రమోట్ చేస్తున్నారా? అనే ప్రశ్నలు కూడా వచ్చాయి.
సినిమా విడుదలకు ముందు ప్రమోషన్లు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న హీరోయిన్లు తమ సినిమాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ ఈవెంట్స్ లో చురుగ్గా పాల్గొనాల్సి ఉంటుంది. అయితే హీరోయిన్ కయాదు లోహార్ విషయంలో మాత్రం ప్రమోషన్ల అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో కయాదు లోహార్ కు తొలి చిత్రంగా వచ్చిన అల్లూరి ప్రమోషన్లకు ఆమె పెద్దగా హాజరు కాలేదనే టాక్ అప్పట్లో వినిపించింది.
తాజాగా ఆమె తొలి తమిళ మూవీ ఇమ్మోర్టల్ విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురైందనే ప్రచారం మొదలైంది. అయితే అదే సమయంలో దుల్కర్ సల్మాన్ నటించిన ఐ యామ్ గేమ్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో కయాదు కనిపించడంతో ఆ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఒకే సమయంలో తన సినిమాల విషయంలో భిన్నంగా వ్యవహరించడం ఎందుకంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ముఖ్యంగా తన తొలి తమిళ సినిమాకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మరో సినిమాను ప్రమోట్ చేస్తున్నారంటూ కొందరు నెటిజన్లు విమర్శలు చేశారు.
దీంతో కయాదు లోహార్ పై సినిమాలను ఎంపిక చేసుకుని ప్రమోట్ చేస్తున్నారా? అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. అయితే ఆ ప్రచారానికి కయాదు తాజాగా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను ఏ సినిమాను తక్కువగా చూడలేదని, ప్రమోషన్లకు హాజరు కాకపోవడానికి ప్రధాన కారణం డేట్స్ సమస్యేనని ఆమె స్పష్టం చేశారు. ప్రమోషన్ల కోసం తనకు ఒక రోజు మాత్రమే ఖాళీగా ఉండగా, అదే రోజున ఐ యామ్ గేమ్ టీమ్ కార్యక్రమాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. దీంతో ఆ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి వచ్చిందని వివరించారు.
మరోవైపు ఇమ్మోర్టల్ టీమ్ అదే రోజున ఎలాంటి ఈవెంట్స్ ప్లాన్ చేయలేదని ఆమె చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత తాను మరో భారీ సినిమా షూటింగ్ లో బిజీ కావడంతో తమిళ మూవీ ప్రమోషన్లకు సమయం కేటాయించలేకపోయానని కయాదు లోహార్ పేర్కొన్నారు. షూటింగ్ షెడ్యూల్స్ ఒక్కసారి ప్రారంభమైతే వాటి మధ్యలో సమయం కేటాయించడం అంత ఈజీ కాదని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.
అంతేకాదు, ఐ యామ్ గేమ్ కు సంబంధించిన తర్వాత ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ తాను అన్ని చోట్లా పాల్గొనలేకపోయానని కయాదు వెల్లడించారు. అంటే ఒక సినిమాకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చి, మరో సినిమాను కావాలనే పక్కన పెట్టినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నది ఆమె క్లారిటీ. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై కూడా కయాదు స్పందించినట్లు తెలుస్తోంది. అభిమానులు, నెటిజన్లు తమకు కనిపించిన విషయాల ఆధారంగా అంచనాలు వేస్తారని, కానీ ఒక నటికి ఉన్న షూటింగ్ కమిట్మెంట్స్, డేట్స్ సమస్యలు బయటివారికి పూర్తిగా తెలియకపోవచ్చని ఆమె అభిప్రాయపడుతున్నారు.
కయాదు లోహార్ క్లారిటీతో వివాదానికి కొంత క్లారిటీ వచ్చినప్పటికీ, డెబ్యూ సినిమాల ప్రమోషన్ల విషయంలో నటీనటులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే చర్చ మాత్రం కొనసాగుతోంది. ముఖ్యంగా ఒకే సమయంలో పలు సినిమాలు చేతిలో ఉన్నప్పుడు ప్రమోషన్ డేట్స్ ను ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఇలాంటి అపోహలకు అవకాశం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.