విశ్వక్ బిగ్ స్కెచ్.. వర్కౌట్ అయ్యేనా?
నవంబర్ 19న 'ENE రిపీట్' విడుదల కానుంది. 'ఈ నగరానికి ఏమైంది' సినిమాకు యూత్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
వరుసగా సినిమాలు నిరాశపరిస్తున్నప్పుడు ఒక మంచి హిట్ కోసం ఎదురుచూడటం హీరోలకు మామూలే. కానీ విశ్వక్ సేన్ మాత్రం ఒకేసారి మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది కూడా కేవలం 36 రోజుల వ్యవధిలోనే. మూడింటి కథలు వేరు, వాటిపై ఉన్న అంచనాలు కూడా వేరు. ఇంత తక్కువ గ్యాప్‌లో మూడు సినిమాలు రావడం విశ్వక్‌కు ఎంతవరకు కలిసొస్తుంది.. అసలు ఈ మూడింటిలో ఆయనకు కావాల్సిన హిట్ దక్కుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
'దాస్ కా ధమ్కీ' తర్వాత విశ్వక్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ, లైలా, ఫంకీ వంటి సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో ఆయన సినిమాల బిజినెస్‌పై కూడా ప్రభావం పడే పరిస్థితి వచ్చింది. విశ్వక్‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. మాస్ పాత్రలు చేస్తూనే కొత్త కథలను ప్రయత్నిస్తుంటారు. అయితే కథలో కొత్తదనం ఉన్నంత మాత్రాన సినిమా ఆడదు కదా. ప్రేక్షకులకు నచ్చేలా తీయడం కూడా ముఖ్యం. ఇప్పుడు విశ్వక్‌కు ఒక హిట్ వస్తే మళ్లీ మంచి ఓపెనింగ్స్ రావొచ్చు. కానీ మార్కెట్ పూర్తిగా పుంజుకోవాలంటే ఆ తర్వాతి సినిమాలు కూడా బాగా ఆడాల్సిందే.
ముందుగా అక్టోబర్ 30న 'కల్ట్' రాబోతోంది. ఈ సినిమాకు విశ్వక్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్నారు. గతంలో 'ఫలక్‌నుమా దాస్'తో దర్శకుడిగా మారిన విశ్వక్ ఇప్పుడు స్లాషర్ థ్రిల్లర్ కథను ఎంచుకున్నారు. ఇలాంటి సినిమాల్లో హింస, యాక్షన్ సన్నివేశాలతో పాటు ఉత్కంఠ కూడా బాగా ఉండాలి. లేకపోతే ప్రేక్షకులు త్వరగానే బోర్ ఫీలయ్యే ప్రమాదముంది. పైగా హీరోగా నటిస్తూ దర్శకత్వ బాధ్యతలు చూసుకోవడం కూడా సవాలే. ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందించగా, రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. 'కల్ట్' హిట్ అయితే విశ్వక్‌కు హీరోగా ఉపయోగపడటమే కాకుండా దర్శకుడిగా మరో సినిమా చేసే అవకాశాలు కూడా పెరుగుతాయి.
నవంబర్ 19న 'ENE రిపీట్' విడుదల కానుంది. 'ఈ నగరానికి ఏమైంది' సినిమాకు యూత్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదలైన చాలా కాలం తర్వాత కూడా ఆ సినిమాలోని కామెడీ సీన్స్, డైలాగ్స్ సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా స్నేహితుల మధ్య సరదా డైలాగ్స్, వాళ్ల కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ వస్తుండటంతో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మొదటి భాగంలోని కామెడీని మళ్లీ గుర్తుచేయడం కంటే కొత్తగా నవ్వించడం తరుణ్ భాస్కర్‌కు పెద్ద పరీక్ష. మొదటి భాగాన్ని ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదనే ప్రేక్షకులు, రెండో భాగం విషయంలో చిన్న తేడా వచ్చినా పోల్చి చూస్తారు. అదే ఈ సినిమాకు ఉన్న పెద్ద రిస్క్.
ఇక డిసెంబర్ 4న 'లెగసీ'తో విశ్వక్ మరో డిఫరెంట్ కథతో రానున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో కేకే మీనన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు విశ్వక్ ఎక్కువగా యూత్‌కు కనెక్ట్ అయ్యే పాత్రలు, మాస్ క్యారెక్టర్లు చేశారు. రాజకీయ కథలో మాత్రం పాత్రకు తగ్గ నటనతో పాటు బలమైన సన్నివేశాలు కూడా అవసరం. ముఖ్యంగా కేకే మీనన్‌తో విశ్వక్‌కు మధ్య వచ్చే సంఘర్షణను ఎలా చూపిస్తారన్నది ఆసక్తికరం. ఈ కథలో రాజకీయ ఎత్తుగడలు, పాత్రల మధ్య పోటీ బాగా కుదిరితే విశ్వక్‌కు కొత్త తరహా సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. యూత్‌తో పాటు ఇతర వర్గాల ప్రేక్షకులను కూడా చేరుకోవడానికి 'లెగసీ' ఉపయోగపడొచ్చు.
అయితే 36 రోజుల్లో మూడు సినిమాలు విడుదల చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. 'కల్ట్' విడుదలైన మూడు వారాలకే 'ENE రిపీట్' వస్తుంది. ఆ తర్వాత 15 రోజులకే 'లెగసీ' థియేటర్లలోకి వస్తుంది. దీంతో ఒక సినిమా ప్రమోషన్లు పూర్తికాకముందే మరో సినిమా ప్రచారం మొదలుపెట్టాల్సి ఉంటుంది. నిర్మాతలు కూడా తమ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. మరోవైపు 'కల్ట్' మంచి హిట్ అయితే ఆ క్రేజ్ 'ENE 2' ఓపెనింగ్స్‌కు ఉపయోగపడొచ్చు. అదే మొదటి సినిమా ఫ్లాప్ అయితే తర్వాతి సినిమాపై ఒత్తిడి పెరుగుతుంది. మరి ఈ మూడింటిలో విశ్వక్‌కు బలమైన హిట్ ఇచ్చేది ఏ సినిమా అవుతుందో చూడాలి.