గంగూలీకి చుక్కెదురు.. సినిమా క్రియేటివిటీని కోర్టు అణచివేయదు!
అయితే ఇది గంగూలీ బయోపిక్ కాదని, అతడి నుంచి స్ఫూర్తి పొందిన ఒక కల్పిత కథ అని.. బీసీసీఐ నుండి ఫుటేజ్ లైసెన్స్ తీసుకున్నామని నిర్మాతలు వాదించడంతో న్యాయస్థానం సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఇటీవల ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. `దూస్రా` సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ గంగూలీ - లవ్ ఫిల్మ్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. తన పర్సనాలిటీ రైట్స్ (వ్యక్తిగత హక్కులు) ఉల్లంఘనకు గురవుతున్నాయని.. 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పి చేసిన సెలబ్రేషన్‌తో పాటు తన అరుదైన ఘట్టానికి సంబంధించిన సీన్ కోసం అనుమతి లేకుండా వాణిజ్యపరంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఇది గంగూలీ బయోపిక్ కాదని, అతడి నుంచి స్ఫూర్తి పొందిన ఒక కల్పిత కథ అని.. బీసీసీఐ నుండి ఫుటేజ్ లైసెన్స్ తీసుకున్నామని నిర్మాతలు వాదించడంతో న్యాయస్థానం సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక్కడ ప్రాథమికంగా ఉత్పన్నమయ్యే అతి ముఖ్యమైన ప్రశ్న... ఒక సెలబ్రిటీ ఇమేజ్‌ని లేదా ఐకానిక్ మూమెంట్స్‌ని కమర్షియల్ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఎప్పుడు `ఉల్లంఘన` అవుతుంది? ఎప్పుడు అది కేవలం సృజనాత్మక లేదా కళాత్మక స్వేచ్ఛ కిందకు వస్తుంది? అనేదానిపై మరింత అవగాహన ముఖ్యం.
ఒక ప్రముఖుడి పేరు లేదా రూపం ప్రత్యక్షంగా మోసం చేసేలా లేదా వారు ఆ బ్రాండ్‌కు ఎండార్స్ చేస్తున్నారనే తప్పుడు భ్రమను కలిగించేలా వాణిజ్య ఉత్పత్తుల్లో వాడితే అది ఖచ్చితంగా పర్సనాలిటీ రైట్స్ ఉల్లంఘన క్రిందికి వస్తుంది. కానీ ఒక చారిత్రక లేదా క్రీడా మైలురాయిని (ఉదాహరణకు నాట్‌వెస్ట్ విజయం) ఆధారంగా చేసుకుని.. దాని ద్వారా ఒక సామాన్య వ్యక్తి పొందిన స్ఫూర్తిని సినిమా రూపంలో చూపించడం అనేది రాజ్యాంగం కల్పించిన భావప్రకటన, కళాత్మక స్వేచ్ఛ పరిధిలోకి వస్తుంది.
రెండవదిగా.. సినిమా విడుదల కావడానికి ముందే ప్రముఖులు ముందస్తు స్టే కోరినప్పుడు.. నిర్మాతల స్వేచ్ఛను - పెట్టుబడులను కోర్టులు ఎందుకు రక్షిస్తాయి? అనే కోణంలోనూ పరిశీలించాలి. ఒక సృజనాత్మక ప్రాజెక్ట్ వెనుక నిర్మాతల భారీగా డబ్బు పెట్టుబడులు, శ్రమ దాగి ఉంటాయి. కేవలం ఊహాగానాల ఆధారంగా లేదా ముందస్తుగా ఆ ప్రాజెక్టులపై సంపూర్ణ నిషేధం విధిస్తే.. అది సృజనాత్మక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే కోర్టులు `బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్` సూత్రాన్ని పాటిస్తూ.. ప్రైమరీ స్టేజ్‌లో కేవలం అనుమానాల మీద చిత్రాల విడుదలను నిలిపివేయడానికి సుముఖత చూపవు.
గతంలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బయోపిక్ (న్యాయ్: ది జస్టిస్) విషయంలోనూ ఇలాంటి పరిణామమే ఎదురైంది. సుశాంత్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్లో ఢిల్లీ హైకోర్టు `గోప్యత- పబ్లిసిటీ హక్కులు వంశపారంపర్యంగా రావు` అని స్పష్టం చేస్తూ విడుదలను ఆపేందుకు నిరాకరించింది. అలాగే పబ్లిక్ ఫిగర్స్‌కు సంబంధించి వ్యంగ్య చిత్రాలు, పేరడీలు లేదా చారిత్రక ఘట్టాల ఆధారంగా వచ్చే ఫిక్షనల్ వర్క్స్ విషయంలో కోర్టులు ఎప్పుడూ కొంత వెసులుబాటు కల్పిస్తాయి. ప్రత్యక్ష వాణిజ్య(కమర్షియల్ గా వాడుకోవడం) మోసం లేదా చట్టవిరుద్ధమైన దుర్వినియోగం స్పష్టంగా రుజువు కానంతవరకు కళాత్మక స్వేచ్ఛను అణచివేయడానికి న్యాయస్థానాలు ఇష్టపడవు.
సెబ్రిటీల వ్యక్తిగత గౌరవం, పబ్లిసిటీ రైట్స్ ఎంత ముఖ్యమైనవో.. సమాజంలో భావప్రకటన స్వేచ్ఛ .. సృజనాత్మకత కూడా అంతే కీలకం. సౌరవ్ గంగూలీ కేసు.. గతంలోని అనేక ఉదాహరణలు స్పష్టం చేస్తున్నట్లుగా.. తగినంత బలమైన ఆధారాలు, ప్రత్యక్ష వాణిజ్య దుర్వినియోగం నిరూపించలేనప్పుడు... కేవలం అనుమానాల ప్రాతిపదికన కోర్టులు స్టే ఇచ్చేందుకు ముందుకు రావు. హక్కుల పరిరక్షణకు, కళాత్మక స్వేచ్ఛకు మధ్య సరైన సమతుల్యతను కాపాడటమే న్యాయస్థానాల ప్రధాన ఉద్దేశంగా అర్థం చేసుకోవాలి.