శ్రేయా ఘోషల్ ప్లేస్‌లో చిన్మయి మ్యాజిక్!
అయితే ఈ అంశంపై చిన్మయి అసలు విషయాన్ని వెల్లడించారు. ఈ పాట ఒరిజినల్ వెర్షన్‌ను దిగ్గజ గాయని శ్రేయా ఘోషల్ ఆలపించారని..
నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్- సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న `రామాయణం` చిత్రం చుట్టూ అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల చెన్నైలో అత్యంత వైభవంగా నిర్వహించిన ఆల్బమ్ లాంచ్ ఈవెంట్లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన స్వరాలు మంత్రముగ్ధులను చేశాయి. ముఖ్యంగా ఈ వేడుకలో ప్రదర్శించిన `జోడి జోడి` వివాహ గీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ పాట వెనుక ఉన్న అసలు కథ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఈ వేదికపై `జోడి జోడి` పాటను గాయని చిన్మయి శ్రీపాద తన అద్భుతమైన గాత్రంతో లైవ్‌లో ఆలపించి శ్రోతలను కట్టిపడేశారు. ఈ పాటను తొలిసారిగా చిన్మయి గొంతులోనే విన్న అభిమానులు ఆమె ప్రదర్శనకు బ్రహ్మరథం పట్టారు. చాలామంది ఈ పాటను తమిళ వెర్షన్లో చిన్మయే ఒరిజినల్‌గా పాడిందని పొరపడ్డారు. ఆమె పాడిన తీరు అంత సహజంగా.. మధురంగా ఉండటంతో సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది.
అయితే ఈ అంశంపై చిన్మయి అసలు విషయాన్ని వెల్లడించారు. ఈ పాట ఒరిజినల్ వెర్షన్‌ను దిగ్గజ గాయని శ్రేయా ఘోషల్ ఆలపించారని.. తాను కేవలం ఒక స్టాండ్-ఇన్ గా మాత్రమే ఈవెంట్ కోసం పాడినట్లు స్పష్టం చేశారు. శ్రేయా ఘోషల్ ఈ పాటకు అద్భుతమైన ప్రాణం పోశారని కొనియాడిన చిన్మయి.. తాను ఆ సమయంలో శ్రేయా ఘోషల్ స్థానంలో నిలబడి పాటను ప్రదర్శించాల్సి వచ్చిందని తెలిపారు.
అలాగే ఈ పాటను ముందుగా నేర్చుకుని ప్రాక్టీస్ చేయలేదని చిన్మయి వెల్లడించారు. ఈవెంట్‌కు సరిగ్గా చివరి నిమిషంలో పాటను నేర్చుకుని నేరుగా స్టేజ్ ఎక్కి ఆలపించానని తెలిపారు. అంత తక్కువ సమయంలో అద్భుతమైన పాటను నేర్చుకుని వేదికపై ఏమాత్రం తడబాటు లేకుండా పాడటం ఆమె ప్రతిభకు అద్దం పడుతోంది. చివరి నిమిషంలో తనకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు గురువు ఏఆర్ రెహమాన్‌కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఏఆర్ రెహమాన్ ఇలాంటి సందర్భాలలో ఇతర గాయకులు పాడిన పాటలను స్టేజ్‌పై పాడేందుకు చిన్మయిని ఎంచుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో `థగ్ లైఫ్` సినిమా ఈవెంట్లోనూ పాడిన `ముత్త మజై పాటను చిన్మయినే స్టాండ్-ఇన్‌గా స్టేజ్‌పై అద్భుతంగా ఆలపించి మెప్పించారు. ఆ పాట ఎలా ప్రేక్షకులను అలరించిందో? `రామాయణం` పెళ్లి పాట కూడా అదే స్థాయిలో మ్యాజిక్ క్రియేట్ చేసి ప్రశంసలు అందుకుంటోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణం మొదటి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిన్మయి పాడిన లైవ్ పెర్ఫార్మెన్స్ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రేయా ఘోషల్ మధుర గాత్రం.. చిన్మయి లైవ్ మ్యాజిక్.. ఏఆర్ రెహమాన్ ఆధ్యాత్మిక స్వరాలు కల గలిసిన వివాహ గీతం రామాయణం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.