ప్యారడైజ్ మార్పులు పని చేశాయా?

కొన్ని సినిమాలు థియేటర్లలో ఎలాాంటి ఫలితాన్ని అందుకున్నా సరే.. ఓటీటీలోకి అవి ఎప్పుడెప్పుడు వస్తాయా అని చూస్తారు జనం.

Update: 2026-10-22 10:19 GMT

కొన్ని సినిమాలు థియేటర్లలో ఎలాాంటి ఫలితాన్ని అందుకున్నా సరే.. ఓటీటీలోకి అవి ఎప్పుడెప్పుడు వస్తాయా అని చూస్తారు జనం. ‘ది ప్యారడైజ్’ ఆ కోవకు చెందిన సినిమానే. గత నెల రిలీజైన ఈ సినిమా మీద పెద్ద డిస్కషనే జరిగింది సోషల్ మీడియాలో. కొందరు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకించారు. కొందరు దీన్ని నెత్తిన పెట్టుకున్నారు. థియేటర్లకు వెళ్లి సినిమా చూడలేకపోయిన వాళ్లేమో.. ఇంత కాంట్రాస్ట్ రియాక్షన్లు ఎందుకు వచ్చాయో చూడాలని వెయిట్ చేశారు.

నిన్న రాత్రి నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. కాసేపటికే సోషల్ మీడియాలో ‘ది ప్యారడైజ్’ ట్రెండ్ అవడం మొదలుపెట్టింది. ఉదయం వరకు ఉన్న స్పందన చూస్తే.. జనాలు మరోసారి నాని, శ్రీకాంత్ ఓదెల ఇద్దరినీ గట్టిగానే టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమాలో కొన్ని సీన్ల మీద ఒక రేంజిలో ట్రోలింగ్ జరుగుతోంది. శ్రీకాంత్ ఓదెల మీద తీవ్రమైన కామెంట్లే చేస్తున్నారు నెటిజన్లు.

ఇక ‘ది ప్యారడైజ్’ థియేట్రికల్ వెర్షన్‌తో పోలిస్తే డిజిటల్ వెర్షన్‌లో జరిగిన మార్పుల గురించి కూడా పెద్ద చర్చ జరుగుతోంది. సినిమాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురైన ధూమావతి ఫైట్‌లో టీం కోత విధించింది. సిల్లీగా అనిపించిన షాట్స్‌ను తీసేశారు. వెటకారంగా అనిపించిన హీరో తల్లి డ్యాన్స్‌ సీక్వెన్స్ మొత్తం తీసేశారు. హింసాత్మక సన్నివేశాల డోస్ కూడా తగ్గించారు. అలాగే గ్రాఫిక్స్ మీద చాలా విమర్శలు వచ్చిన నేపథ్యంలో వాటిని మెరుగు పరిచే ప్రయత్నం జరిగింది.

సినిమా కోసం ఎంతోమంది కష్టపడి పని చేస్తే.. ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్‌లో రోలింగ్ టైటిల్స్ స్క్రోల్ చేసి ఎవ్వరూ తమ పేరును గుర్తించే అవకాశం లేకుండా చేయడంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో అక్కడ స్పీడు తగ్గించారు. ఇంతకుమించి పెద్దగా మార్పులేమీ లేవు. సినిమా నిడివిని 25 నిమిషాల దాాకా తగ్గించేసినట్లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు ముందు వచ్చిన వార్తలైతే నిజం కాదు. డిజిటల్ వెర్షన్ కూడా థియేట్రికల్ వెర్షన్‌తో సమానంగా 2 గంటల 50 నిమిషాల నిడివితోనే రిలీజైంది.

Tags:    

Similar News