ప్రభాస్, తారక్ సినిమాలు.. ఫెస్టివల్ విండో అవసరమే లేదా?
సినిమా బాగుంటే ఆడియన్స్ ఎప్పుడైనా థియేటర్లకు వస్తారు. అందులోనూ ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల మూవీలంటే ఫ్యాన్స్ లో ఉండే ఇంట్రెస్ట్ వేరు.
సినిమా బాగుంటే ఆడియన్స్ ఎప్పుడైనా థియేటర్లకు వస్తారు. అందులోనూ ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల మూవీలంటే ఫ్యాన్స్ లో ఉండే ఇంట్రెస్ట్ వేరు. అలాంటి సినిమాలకు పండుగలతో సంబంధం లేదని, ఎప్పుడు విడుదల చేసినా ప్రేక్షకులు వస్తారనే అభిప్రాయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన లేటెస్ట్ మూవీ సమ్మర్ హాలీడేస్ ప్రెస్ మీట్ లో నిర్మాత ధీరజ్ మొగిలినేని ఆ విషయాన్ని ప్రస్తావించారు.
ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాలకు సంక్రాంతి అవసరం లేదని, వాళ్ల సినిమాలు విడుదలైనప్పుడే పండుగ అని అన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అలాంటి సినిమాలను చూడటానికి థియేటర్లకు వస్తారని చెప్పారు. అందుకే చిన్న సినిమాలకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఇక్కడ ధీరజ్ కామెంట్స్ లో ఆలోచించాల్సిన విషయేమిటంటే.. పెద్ద హీరోల సినిమాలకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే పవర్ ఉంటుంది.
వారి సినిమాలపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉంటాయి. టీజర్, ట్రైలర్ నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ వరకు ప్రతీ స్టేజ్ లో ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సినిమా మీద మంచి అంచనాలు ఉంటే సాధారణ రోజుల్లోనూ భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పండుగల కోసం మాత్రమే ఎదురుచూడాల్సిన అవసరం లేదనేది ఆయన అభిప్రాయం. అయితే స్టార్ హీరోల సినిమాలకు పండుగల వల్ల వచ్చే బెనిఫిట్ ను కూడ పక్కన పెట్టలేం.
ఫెస్టివల్స్ టైమ్ లో సెలవులు ఉంటాయి. కుటుంబ సభ్యులంతా కలిసి సినిమాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో పెద్ద మూవీలకు మరింత ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చే పరిస్థితి ఉంటుంది. భారీ బడ్జెట్ తో రూపొందించే సినిమాలకు ఆ సమయంలో వచ్చే వసూళ్లు ఇంపార్టెంటే. అందుకే స్టార్ హీరోలు, నిర్మాతలు కూడా ఫెస్టివల్ విండోలపై ఇంట్రెస్ట్ చూపిస్తారు.
మరోవైపు చిన్న సినిమాల పరిస్థితి వేరు. వాటికి భారీ ప్రమోషన్స్ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదలైతే థియేటర్ల విషయంలో పోటీ పెరుగుతుంది. మంచి కథతో వచ్చిన చిన్న మూవీ కూడా థియేటర్లు దొరకకపోతే ఇబ్బందులు పడొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పండుగల సమయంలో చిన్న సినిమాలకు కొంత అవకాశం ఇవ్వాలనే నిర్మాతల వాదనలోనూ అర్థం ఉంది.
కానీ స్టార్ హీరోల సినిమాలను పండుగలకు దూరంగా ఉంచితేనే చిన్న సినిమాలకు ప్లస్ అవుతుందని ఎప్పుడూ చెప్పలేం. చిన్న సినిమాలకు మంచి కంటెంట్, సరైన ప్రమోషన్స్, రిలీజ్ ప్లాన్ కూడా అవసరం. అదే సమయంలో ఏ మూవీ అయినా పండుగ సమయంలో విడుదలైనంత మాత్రాన విజయం సాధించదు. అదే విధంగా మామూలు రోజుల్లో వచ్చిన మూవీ కూడా మంచి రెస్పాన్స్ అందుకోవచ్చు.
అందుకే స్టార్ హీరోల సినిమాలకు పండుగలు అవసరమా, లేదా అనే దానికంటే విడుదల తేదీలను ఎలా నిర్ణయించాలనేది అసలు మ్యాటర్. పెద్ద సినిమాలకు ఉన్న మార్కెట్ నఉ దృష్టిలో పెట్టుకుంటూనే చిన్న సినిమాలకు తగిన అవకాశం దక్కేలా చూడాలి. కానీ చివరకు ఏ సినిమా ఎప్పుడు విడుదలైందన్నది కాదు.. ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందన్నదే సక్సెస్ ను డిసైడ్ చేస్తుందని చెప్పాలి.