కథల ఎంపికపై నేచురల్ స్టార్ నాని ఓపెన్ టాక్!

ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త దర్శకులతో పనిచేయడంపైనా స్పందించారు. నూతన డైరెక్టర్లలో అనుభవం కంటే వారిలో సినిమాపై ఉండే ప్యాషన్‌నే తాను ఎక్కువగా గమనిస్తానని తెలిపారు.

Update: 2026-10-22 13:16 GMT

టాలీవుడ్‌లో సహజ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని సినిమాల ఎంపిక విషయంలో తాను అనుసరించే విధానంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాక్సాఫీస్ లెక్కల కంటే తన సొంత ఇన్‌స్టింక్ట్ చెప్పినదానికే ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. కలెక్షన్ల కోసం కాకుండా తాను చేసే ప్రయాణాన్ని మనసారా ఆస్వాదించడమే ప్రధాన లక్ష్యమన్నారు.

ఏ సినిమానైనా ఎంచుకునేటప్పుడు దాని ఫలితం గురించి ముందుగానే లెక్కలు వేయడం ఇష్టం ఉండదని నాని . ఒక సినిమాను ఒప్పుకున్న తర్వాత ఆరు నుంచి తొమ్మిది నెలలు.. కొన్నిసార్లు ఏడాది పాటు అదే ప్రాజెక్ట్‌పై పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆ సమయం అంతా ఆనందంగా గడపాలంటే ముందుగా ఆ కథపై తనకు పూర్తి ఉత్సాహం ఉండాలని.. ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తే ఫలితం దానంతట అదే వస్తుందని బలంగా నమ్ముతాన‌న్నారు.

ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త దర్శకులతో పనిచేయడంపైనా స్పందించారు. నూతన డైరెక్టర్లలో అనుభవం కంటే వారిలో సినిమాపై ఉండే ప్యాషన్‌నే తాను ఎక్కువగా గమనిస్తానని తెలిపారు. కేవలం ట్రెండ్‌కోసమో లేదా డైరెక్టర్ కావడం కూల్‌గా ఉంటుందనో కాకుండా నిజంగా ఒక కథను చెప్పాలనే తపన వారిలో ఉందా లేదా అనేది చూస్తానని చెప్పారు. అలాంటి నిజాయితీ గల దర్శకులకు అనుభవం లేకపోయినా? వారి అభిరుచిని గౌరవించి పక్కన నిలబడతానని తెలిపారు.

నాని చిన్ననాటి కలల గురించి చెబుతూ.. హాలీవుడ్ క్లాసిక్ మూవీ `గ్లాడియేటర్` చిత్రంలో నటించాలని చిన్నప్పుడు ఎంతో ఆశపడ్డానని వెల్లడించారు. అలాగే `ది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్` సినిమా కూడా తనపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిందన్నారు. అయితే తెలుగులో తాను నటించిన `జెర్సీ` సినిమా తనకెంతో తృప్తినిచ్చిందని.. ఆ చిత్రంతో తనకంటూ ఓ అద్భుతమైన గుర్తింపు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.

దర్శకత్వం వైపు అడుగులు వేసే ఆలోచన ఉందా అనే ప్రశ్నకు .. ప్రస్తుతానికి నటుడిగా తాను కెరీర్‌ను ఆస్వాదిస్తున్నానని తెలిపారు. నటనలోని మజాను పూర్తిగా కోల్పోనంత వరకు దర్శకత్వం వైపు వెళ్లే ఆలోచన లేదని.. అయితే భవిష్యత్తులో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. తాను చేస్తున్న ప్రతి పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి శ్రమిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నాని హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `బ్లడీ రోమియో` లో న‌టిస్తున్నారు. ఇందులో నాని వైవిథ్య‌మైన‌ పాత్ర‌లో అల‌రించ‌నున్నారు.

Tags:    

Similar News