కల్యాణ్ రామ్.. పాత ప్రాజెక్టుల సంగతేంటి?

ఒక సినిమా పూర్తికాకముందే మరో రెండు మూడు ప్రాజెక్టులు లైన్‌లో పెట్టడం హీరోలకు మామూలే.

Update: 2026-10-22 15:30 GMT

ఒక సినిమా పూర్తికాకముందే మరో రెండు మూడు ప్రాజెక్టులు లైన్‌లో పెట్టడం హీరోలకు మామూలే. కానీ ఆ సినిమాలు ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తాయనేది కూడా అంతే ముఖ్యం. నందమూరి కల్యాణ్ రామ్ విషయంలో ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టుల పేర్లు వినిపిస్తుండగా, లేటెస్ట్ గా మరో మీడియం రేంజ్ దర్శకుడితో సినిమా లాక్ చేశారనే టాక్ బయటకొచ్చింది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రకటన ఉండొచ్చని అంటున్నారు.

నిజానికి 'బింబిసార' తర్వాత కల్యాణ్ రామ్ కెరీర్ అనుకున్నంత స్పీడ్ అందుకోలేదు. 'అమిగోస్', 'డెవిల్', 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ప్రయోగాలు చేస్తున్నా బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్ పడటం లేదు. దీంతో తర్వాతి సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సోలో హీరోగా తన మార్కెట్‌ను మళ్లీ నిలబెట్టుకునే ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.

మరోవైపు 'బింబిసార 2' వ్యవహారం ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉంది. మొదటి భాగం మంచి విజయం సాధించడంతో సీక్వెల్‌పై అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది. కానీ దర్శకుడి మార్పు, ప్రీ ప్రొడక్షన్ పనుల కారణంగా ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం ఆలస్యమైంది. అనిల్ పాదూరి దర్శకత్వంలో రెండో భాగం రూపొందుతుందనే వార్తలు వచ్చినా షూటింగ్‌కు సంబంధించిన స్పష్టమైన అప్‌డేట్ మాత్రం లేదు.

ఇక 'పుష్ప' రచయిత శ్రీకాంత్ విస్సతో కూడా కల్యాణ్ రామ్ సినిమా చేయనున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఆ ప్రాజెక్ట్‌తో శ్రీకాంత్ దర్శకుడిగా పరిచయం కానున్నారని ప్రచారం జరిగింది. ప్రీ ప్రొడక్షన్ కూడా జరుగుతోందని అప్పట్లో చెప్పారు. ఇప్పుడు మరో దర్శకుడితో సినిమా లాక్ అయిందనే వార్త రావడంతో అసలు ముందుగా ఏది పట్టాలెక్కుతుందనే ఆసక్తి పెరిగింది. కొత్తగా వినిపిస్తున్న ప్రాజెక్ట్ అదేనా, మరొకటా అనేది ఇంకా బయటకు రాలేదు.

ప్రస్తుతం వెంకటేష్‌తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో కల్యాణ్ రామ్ నటిస్తున్నారు. 2027 సంక్రాంతికి ప్లాన్ చేసిన ఈ మల్టీస్టారర్ షూటింగ్ ఇప్పటికే మొదలైంది. 'పటాస్' తర్వాత అనిల్‌తో మళ్లీ పని చేస్తుండటం ఆయనకు మంచి అవకాశం. పైగా వెంకటేష్‌తో కలిసి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయడం వల్ల ఇప్పటివరకు పెద్దగా ప్రయత్నించని కామెడీ జోన్‌లోనూ కనిపించనున్నారు. అయితే ఇది మల్టీస్టారర్ కావడంతో తర్వాత వచ్చే సోలో సినిమా ఎంపిక కూడా ముఖ్యం.

కల్యాణ్ రామ్‌కు నిర్మాతగా కూడా బాధ్యతలు ఉండటం మరో అంశం. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై సొంత సినిమాలతో పాటు భారీ ప్రాజెక్టులను హ్యాండిల్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఒకేసారి ఎక్కువ సినిమాలు మొదలుపెట్టడం కంటే స్క్రిప్ట్, బడ్జెట్, షూటింగ్ షెడ్యూల్స్ పక్కాగా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. లేటెస్ట్ గా వినిపిస్తున్న దర్శకుడి పేరు, నిర్మాణ సంస్థ, కథ జానర్‌పై ఇంకా వివరాలు బయటకు రాలేదు. ఇక ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

Tags:    

Similar News