బాహుబలిని మించిన సినిమా మళ్లీ ఆయనే ప్రకటించాలా?
భారతీయ చలనచిత్ర పరిశ్రమని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఏకైక పేరు ఎస్.ఎస్. రాజమౌళి.
భారతీయ చలనచిత్ర పరిశ్రమని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఏకైక పేరు ఎస్.ఎస్. రాజమౌళి. `బాహుబలి` చిత్రంతో టాలీవుడ్ స్థాయిని గ్లోబల్ మార్కెట్‌కు పరిచయం చేసి అటుపై `ఆర్ఆర్ఆర్` తో ఆస్కార్ అవార్డును సాధించి ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాశారు జక్కన్న. అయితే `బాహుబలి` వచ్చి దశాబ్దం గడిచినా? ఇప్పటికీ ఆ రేంజ్ భారీ బడ్జెట్, విజువల్ వండర్ అనౌన్స్మెంట్ చేయడానికి మరే ఇతర దర్శకుడు .. నిర్మాత ముందుకు రాలేకపోతున్నారు. ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
`బాహుబలి` సృష్టించిన సునామీ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా ఇండియన్ మేకర్స్‌కు గ్లోబల్ ఆశలను పరిచయం చేసింది ఆ సినిమానే. అటుపై పలువురు ప్రముఖ దర్శకులు, బడా నిర్మాతలు పాన్-ఇండియా రేంజ్లో భారీ చిత్రాలను ప్రకటించినా? బాహుబలి రేంజ్ మేజిక్‌ను, ఆ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేయడంలో ఎక్కడికక్కడ తడబడుతున్నారు. బాహుబలిని మించిన సినిమా ..ఆ స్థాయి ప్రకటన మళ్లీ రాజమౌళి మాత్రమే చేయగలరని.. మిగతా వారంతా ఆ సాహసం చేసేందుకు వెనకడుగు వేస్తున్నారని స్వయంగా పలువురు ప్రముఖ నిర్మాతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
దీనికి ప్రధాన కారణం రాజమౌళికున్న అంకితభావం, రిస్క్ తీసుకునే తత్వమే. ఒక సినిమా కోసం సంవత్సరాల తరబడి శ్రమించడం, ప్రతీ ఫ్రేమ్‌ను ఎంతో పకడ్బందీగా చెక్కడం జక్కన్న శైలి. వందల కోట్ల బడ్జెట్, భారీ విజువల్ ఎఫెక్ట్స్ దానికి తగిన బలమైన ఎమోషన్స్ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ ఆడియన్స్‌ను థియేటర్లలో కట్టిపడేసే దమ్ము రాజమౌళికే ఉందని టాలీవుడ్ మేకర్స్ నమ్ముతున్నారు. సాధారణంగా ఒక ఫ్లాప్ వస్తే కుంగిపోయే పరిశ్రమలో విజయాల తర్వాత కూడా అదే కసిని కొనసాగించడం రాజమౌళికే చెల్లింది.
ప్రస్తుతం రాజమౌళి మహేశ్ తో ఓ గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి-మహేశ్ కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీలో అంచనాలు తారాస్థాయికి చేరాయి. హాలీవుడ్ రేంజ్లో ఇండియానా జోన్స్ తరహా యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతున్న ఈ సినిమాపైనే అందరి కళ్లు ఉన్నాయి. `బాహుబలి`, `ఆర్ఆర్ఆర్` రికార్డులను ఈ సినిమా ఏ మేరకు తిరగరాస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. సినిమా తీయడమే కాకుండా దాన్ని మార్కెట్ చేసే విధానంలో రాజమౌళి వేసే ప్రతి అడుగు ఒక పాఠం లాంటిది.
ఇతర దర్శకులు ..నిర్మాతలు బాహుబలి రేంజ్ ప్రాజెక్ట్‌లను ప్రకటించక పోవడానికి ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఓ కారణం. వందల కోట్లు పెట్టుబడి పెట్టి.. ప్రతి ఒక్కరినీ మెప్పించేలా స్క్రిప్ట్ సిద్ధం చేయడం చిన్న విషయం కాదు. ఒక్క తప్పు జరిగినా భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు సైతం కొత్త ప్రయోగాలు చేయడానికి జంకుతున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఆ రిస్క్‌ను తన భుజాన వేసుకుని బాక్సాఫీస్ వద్ద సరికొత్త బెంచ్ మార్క్‌లను క్రియేట్ చేస్తూ వస్తున్నారు.
అందుకే `బాహుబలి`ని మించిన సినిమా ఎప్పుడు వస్తుంది? అంటే దానికి ఒకే ఒక్క సమాధానం రాజమౌళి నుంచి వచ్చే తదుపరి ప్రకటన మాత్రమే. ఇండస్ట్రీలో ఎంతమంది కొత్త దర్శకులు వచ్చినా?ఎంత టెక్నాలజీ మారినా? బాక్సాఫీస్‌ను షేక్ చేసే ఆ పవర్ఫుల్ అనౌన్స్మెంట్ చేసే సత్తా ఒక్క రాజమౌళికే ఉందని మరోసారి రుజువు అవుతోంది. జక్కన్న నుంచి రాబోయే గ్లోబల్ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా బాటను ఎలా మారుస్తుందో చూడాలి.