'బ‌ల‌గం' బ్లాక్ బ‌స్ట‌ర్ కానీ.. త‌న‌కేమైంది?

`గంగోత్రి`లో వ‌ల్లంకి పిట్ట పాట‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుని పాపుల‌ర్ అయిన కావ్య క‌ల్యాణ్ రామ్ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ `మ‌సూద‌`తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.;

Update: 2025-06-26 19:30 GMT

టాలీవుడ్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక‌ర‌ణాలు మారిపోతున్నాయి. ప్రేక్ష‌కులు ఓటీటీల ప్ర‌భావంతో థియేట‌ర్ల‌కు రావ‌డానికి పెద్ద‌గా ఆస‌క్తిని చూపించ‌డం లేదు. దీంతో స్టార్‌ల‌ని ప‌క్క‌న పెడితే మిగ‌తా ఆర్టిస్ట్‌లు, హీరోయిన్‌ల పరిస్థితి కొంత గంద‌ర‌గోళంగా త‌యార‌యింది. ఎవ‌రు ఎప్పుడు ఏ సినిమాతో, ఏ సిరీస్‌లో ప్రేక్ష‌కుల ముందుకొస్తారో.. అవ‌కాశాలు లేక ఎప్పుడు క‌నుమ‌రుగువుతారో తెలియ‌డం లేదు. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటోంది కావ్య క‌ల్యాణ్ రామ్‌.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప‌ద‌కొండు సినిమాల్లో న‌టించిన ట్రాక్ రికార్డ్ త‌న సొంతం. `గంగోత్రి`లో వ‌ల్లంకి పిట్ట పాట‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుని పాపుల‌ర్ అయిన కావ్య క‌ల్యాణ్ రామ్ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ `మ‌సూద‌`తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తిరువీర్‌, సంగీత, బాంధ‌వీ శ్రీ‌ధ‌ర్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని సాధించిన హీరోయిన్‌గా తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్సెస్‌ని అందించింది. దీని త‌రువాత క‌మెడియ‌న్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు ఫ్యామిలీ వార‌సులు హ‌ర్షిత్‌రెడ్డి, హ‌ర్షితా రెడ్డి నిర్మించిన `బ‌లగం`లో న‌టించింది.

ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ మూవీ ఏ స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర‌లేదు. మ‌ళ్లీ ప‌ల్లెల్లోని జ‌నం భారీ సంఖ్య‌లో థియేట‌ర్ల‌కు ప‌రుగులు తీసేలా చేసి అల‌నాటి రోజుల్ని గుర్తు చేసింది. ప‌ల్లె ప‌ల్లెన, సిటీల్లోనూ ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారి ద‌ర్శ‌కుడు వేణు, చిత్ర బృందంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. చిన్న బ‌డ్జెట్‌తో మ‌న‌సుకు హ‌త్తుకునే భావోద్వేగాల స‌మాహారంగా తెర‌కెక్కిన ఈ సినిమా న‌టుడిగా ప్రియ‌ద‌ర్శికి, హీరోయిన్‌గా కావ్య క‌ళ్యాణ్‌రామ్‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది.

ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత ప్రియ‌ద‌ర్శి హీరోగా బిజీ అయిపోయాడు. వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. త‌న‌ని దృష్టిలో పెట్టుకుని ద‌ర్శ‌కులు క‌థ‌లు రాస్తూ స‌రికొత్త క‌థ‌ల‌ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. అయితే 'బ‌ల‌గం'లో హీరోయిన్‌గా న‌టించిన‌ కావ్య క‌ల్యాణ్ రామ్ కెరీర్ మాత్రం ఇందుకు భిన్నంగా సాగుతోంది. ఈ మూవీ త‌రువాత కావ్య 'ఉస్తాద్‌`తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. 2023లో విడుద‌లైన ఈ సినిమా డిజాస్ట‌ర్ అనిపించుకుంది. అక్క‌డి నుంచి ఇంత వ‌ర‌కు కావ్య క‌ల్యాణ్‌రామ్ నుంచి మ‌రో సినిమా రాలేదు. ఆమె సినిమా చేసి దాదాపు రెండేళ్ల‌వుతోంది. త‌ను కావాల‌నే గ్యాప్ తీసుకుందా? లేక ప్ర‌స్తుత ప‌రిస్థితుల కార‌ణంగా త‌న‌కు అవ‌కాశాలు రావ‌డం లేదా అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

Tags:    

Similar News