ముంబై ఆఫీస్ కోసం యంగ్ హీరో భారీ పెట్టుబడి
ముంబై ఔటర్ లో రియల్ ఎస్టేట్ వేగంగా అభివృద్ధి చెందడానికి సెలబ్రిటీ పెట్టుబడులు కూడా ఒక కారణం.;
ముంబై ఔటర్ లో రియల్ ఎస్టేట్ వేగంగా అభివృద్ధి చెందడానికి సెలబ్రిటీ పెట్టుబడులు కూడా ఒక కారణం. కోట్లాది రూపాయల పారితోషికాలు అందుకుంటూ వాటిని రియల్ వెంచర్లలో పెట్టుబడులు పెడుతున్న స్టార్లు, ఈ వ్యాపారంలో భారీగా లాభాలార్జిస్తున్నారు. వారి జీవన శైలికి తగ్గట్టు లావిష్ గా ఆఫీస్ స్పేసెస్ ని కూడా కొనుగోలు చేస్తున్నారు.
అమితాబ్- అభిషేక్ జోడీతో పాటు వివేక్ ఒబెరాయ్, సోనాక్షి, సోనమ్ కపూర్, శ్రద్ధా కపూర్ లాంటి స్టార్లు రియల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పుడు అదే బాటలో యువహీరో కార్తీక్ ఆర్యన్ రియల్ ఎస్టేట్ లో భారీ పెట్టుబడులు పెడుతున్నారని సమాచారం. అతడు తన తల్లిదండ్రులతో కలిసి ముంబై విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నాడు. ముంబై అలీబాగ్‌లో 2,000 చదరపు అడుగుల ప్లాట్‌ను రూ. 2 కోట్లకు కొనుగోలు చేసారని వార్తలు వచ్చిన 20 రోజుల తర్వాత ఇప్పుడు అంధేరి వెస్ట్‌లో రూ. 13 కోట్ల విలువైన ఆఫీస్ స్పేస్‌ని కొనుగోలు చేశాడు. స్క్వేర్ యార్డ్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ లావాదేవీ సెప్టెంబర్ 2025లో పూర్తయింది.
అంధేరి వెస్ట్ లో `సిగ్నేచర్ బై లోటస్` భవనంలో 1,905 చదరపు అడుగుల కార్పెట్ ప్రాంతంతో మొత్తం 2,095 చ.అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయం ఉంది. మూడు పార్కింగ్ స్థలాలు కూడా రిజిస్టర్ అయ్యాయి. స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ కోసం భారీగానే ఖర్చు చేసాడని తెలుస్తోంది. ఈ ప్రాంతం నుంచి రోడ్, రైల్, విమానయాన కనెక్టివిటీ అద్భుతంగా ఉంది. అందుకే ఇక్కడ రియల్ వెంచర్లకు హైడిమాండ్ ఉందని కూడా తెలుస్తోంది. అలీభాగ్ లోధాలో ఫ్లాట్ కొనుగోలు చేసిన తర్వాత ఆర్యన్ వెంటనే ఈ భారీ ఆఫీస్ స్థలాన్ని కొనుగోలు చేయడం చర్చగా మారింది.
భారతదేశంలోని అరుదైన ప్రామిస్సింగ్ స్టార్లలో కార్తీక్ ఆర్యన్ ఒకరు. అతడు కరోనా క్రైసిస్ లోను విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. భూల్ భులయా 2 బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో అతడి స్థాయి మరింత పెరిగింది. ఆ తర్వాత వచ్చిన `సత్యప్రేమ్ కి కథ` కూడా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ప్రస్తుతం అతడు శ్రీలీలతో కలిసి ఓ మ్యూజికల్ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నాడు.