ఇక సర్దార్‌ను నమ్ముకోవాల్సిందేనా?
కోలీవుడ్ క్రేజీ స్టార్స్‌గా పేరు తెచ్చుకున్న సూర్య, కార్తి ఈ మధ్య రేసులో వెనకబడ్డారు. ఒక దశలో బ్లాక్ బస్టర్ మూవీస్‌ని అందించిన ఈ సోదరులు ఇప్పుడు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు.;
కోలీవుడ్ క్రేజీ స్టార్స్‌గా పేరు తెచ్చుకున్న సూర్య, కార్తి ఈ మధ్య రేసులో వెనకబడ్డారు. ఒక దశలో బ్లాక్ బస్టర్ మూవీస్‌ని అందించిన ఈ సోదరులు ఇప్పుడు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. భారీ ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సూర్య `జై భీమ్` తరువాత ఆ స్థాయిలో ప్రభావం చూపించలేకపోతున్నాడు. సోదరుడు తడబడుతున్నా తమ్ముడు కార్తి యాక్షన్ సినిమాలతో హిట్‌లని దక్కించుకుంటూ వచ్చాడు. కానీ ఈ మధ్య అన్న సూర్య తరహాలోనే `సర్దార్` తరువాత నుంచి ఆ స్థాయి సక్సెస్‌లని దక్కించుకోలేకపోతున్నాడు.
రీసెంట్‌గా కార్తి చేసిన `వావ వాతియార్` వివాదాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. జనవరి 14న సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా ఏమాత్రం ప్రభావన్ని చూపలేకపోయింది. రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీస్తే అందులో పది కోట్లు కూడా తిరిగి రాబట్టలేక షాక్ ఇచ్చింది. ఇందులో కార్తి ద్విపాత్రాభినయం చేశాడు. డీఎస్పీ రామేశ్వరన్‌గా, ప్రముఖ నటుడు, కన్నడ లెజెండ్ ఎంజీ రామచంద్రన్ అభిమానిగా ఇలా రెండు క్యారెక్టర్లలో ద్విపాత్రాభినయం చేసినా బలమైన స్టోరీ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.
దీంతో ఇప్పుడు అందరి చూపు `సర్దార్ 2`పై పడింది. 2022, అక్టోబర్ 21న విడుదలైన ఈ మూవీ కార్తి సినిమాల్లో భారీ విజయాన్ని సాధించింది. ఏజెంట్ సర్దార్‌గా, ఇన్‌స్పెక్టర్ విజయ్ ప్రకాష్‌గా రెండు పాత్రల్లో కార్తి అదరగొట్టాడు. మరీ ముఖ్యంగా సర్దార్ క్యారెక్టర్‌లో కార్తి పలికించిన నటన, ఆ క్యారెక్టర్‌ని రక్తి కట్టించిన తీరు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. కార్తి నటకు దర్శకుడు పీఎస్ మిత్రన్ మేకింగ్, టేకింగ్ కూడా తోడవ్వడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి `ఖైదీ` తరువాత కార్తి కెరీర్‌లో వంద కోట్లు సాధించిన సినిమాగా నిలిచింది.
కార్తి కేరీర్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాకు దాదాపు మూడేళ్ల విరామం తరువాత `సర్దార్`కు సీక్వెల్‌గా `సర్దార్ 2` రాబోతోంది. ఇందులోనూ కార్తి డ్యుయెల్ రోల్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. సర్దార్‌గా, ఏజెంట్ విజయ్ ప్రకాష్‌గా రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్లలో కార్తి కనిపించనున్నాడు. పీ.ఎస్. .మిత్రన్ డైరెక్ట్ చేస్తున్నీ మూవీకి సంబంధించిన ప్రొలాగ్ పేరుతో విడుదల చేసిన టీజర్ ఇప్పటికే విడుదలై సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
ఇందులో ఎస్.జె.సూర్య పవర్ ఫుల్ విలన్ బ్లాక్ డాగర్‌గా కనిపించబోతున్నాడు. మాళవికా మోహనన్, అషికా రంగనాథ్, రజీషా విజయన్ హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ మూవీలో మాళవిక మోహనన్, కార్తీలపై మిడ్ ఏయిర్‌లో చిత్రీకరించిన యాక్షన్ బ్లాక్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. ఇందు కోసం మాళవిక ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని ఈ ఫైట్‌లో పాల్గొందని తెలిసింది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని సమ్మర్‌లో ప్రేక్షకల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిపైనే కార్తి భారీ ఆశలు పెట్టుకున్నాడని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కార్తి నమ్మకాన్ని ఈ సారి కూడా దర్శకుడు పీఎస్ మిత్రన్ నిలబెడతాడా? అన్నది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.