'బాహుబలి శివలింగం సీన్ గుర్తుంది కదా!'.. సూర్య మూవీపై కార్తీ హైప్..
కార్తీ చెప్పిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. తాను ప్రస్తుతం హైదరాబాద్ లోనే తన మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నానని, అందుకే అన్నయ్య కోసం ప్రత్యేకంగా ఈవెంట్ కు వచ్చానని తెలిపారు.;
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఆ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించారు. మే 14న ఆ చిత్రం థియేటర్లలో విడుదల కానుండగా.. హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మూవీపై మరింత అంచనాలు పెంచింది. ముఖ్యంగా హీరో కార్తీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
కరుప్పు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైన కార్తీ.. తన అన్న సూర్యపై ప్రశంసల వర్షం కురిపించారు. వీరభద్రుడు కంప్లీట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ అని, అయితే అందులో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే ఎమోషన్స్ కూడా ఉంటాయని తెలిపారు. ఇలాంటి రోల్ అన్నయ్య తప్ప మరెవ్వరూ చేయలేరంటూ సూర్య యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.
సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ గురించి చెప్పిన కార్తీ వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 'బాహుబలిలో ప్రభాస్ శివలింగాన్ని మోసుకెళ్లే సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాగే ఎంత పెద్ద బాధ్యతైనా భుజాలపై మోయగల నటుడు సూర్య. దేవుడు పూనినట్టుగా కనిపించే మాస్ పాత్రను అన్నయ్య అద్భుతంగా చేశారు' అని చెప్పారు. సూర్య కనిపించే తీరు థియేటర్లలో అభిమానులకు పండగలా ఉంటుందని పేర్కొన్నారు.
కార్తీ చెప్పిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. తాను ప్రస్తుతం హైదరాబాద్ లోనే తన మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నానని, అందుకే అన్నయ్య కోసం ప్రత్యేకంగా ఈవెంట్ కు వచ్చానని తెలిపారు. రోలెక్స్ కు హాయ్ చెబుదామని వచ్చానంటూ ఫన్ చేశారు. అంతేకాదు.. వీరభద్రుడు సినిమాను తాను తెలుగు వెర్షన్ లోనే థియేటర్ లో చూసే ప్లాన్ లో ఉన్నానని వెల్లడించారు.
అయితే కరుప్పు మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆర్జే బాలాజీ మార్క్ కామెడీ, సూర్య మాస్ యాక్షన్, త్రిష పాత్ర చుట్టూ తిరిగే ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా సూర్య గత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో.. వీరభద్రుడు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ మూవీ అవుతుందా అనే చర్చ కూడా నడుస్తోంది.
తెలుగులో ఆ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తుండటం మరో ప్రత్యేకత. తమిళంతో పాటు తెలుగులో కూడా సూర్యకు మంచి మార్కెట్ ఉండటంతో.. మేకర్స్ తెలుగు ప్రమోషన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగానే హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఏదేమైనా ఇప్పుడు కార్తీ చేసిన వ్యాఖ్యలు వీరభద్రుడుపై మరింత హైప్ తీసుకొచ్చాయి. సూర్యను పవర్ ఫుల్ మాస్ అవతార్ లో మరోసారి చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు, ఆడియెన్స్ కు ఆ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో అంతా వేచి చూడాలి.