ట్రేడ్ మార్క్ హక్కుల కోసం అగ్ర‌నిర్మాత పాకులాట‌

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ తన వ్యాపార వ్యూహాల్లో కీలక మార్పులు చేసుకుంటున్నారు.

Update: 2026-10-12 03:50 GMT

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ తన వ్యాపార వ్యూహాల్లో కీలక మార్పులు చేసుకుంటున్నారు. ఏ షో లేదా సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయినా.. దాని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (IP) లేదా ట్రేడ్ మార్క్ హక్కులు తమ వద్ద లేకపోతే ఆశించిన లాభాలు పూర్తిగా దక్కవనే నిజాన్ని ఆయన గ్రహించారు. అందుకే ఇతరుల ప్లాట్‌ఫారమ్‌లకు ఆధారపడకుండా... పూర్తిగా తన సొంత బ్యానర్‌పైనే రాజులా వెలగాలని ఆయన భావిస్తున్నారు.

పాపులర్ సెలబ్రిటీ టాక్ షో `కాఫీ విత్ కరణ్` 9వ సీజన్‌తో పూర్తిగా ముగియనుందని కరణ్ జోహార్ స్వయంగా స్పష్టం చేశారు. జియోహాట్‌స్టార్ వేదికగా ప్రసారం కానున్న ఈ చివరి సీజన్‌లో షారూఖ్ ఖాన్, ఆర్యన్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ వంటి అగ్రశ్రేణి నటులు గెస్టులుగా విచ్చేసి సందడి చేయనున్నారు.

అయితే ఈ షో ముగిసినంత మాత్రాన కరణ్ జోహార్ టాక్ షోల రంగానికి పూర్తిగా గుడ్‌బై చెప్పడం లేదని తాజా క‌థ‌నాలు స్పష్టం చేస్తున్నాయి. `కాఫీ విత్ కరణ్` ట్రేడ్‌మార్క్ హక్కులు జియోహాట్‌స్టార్ సంస్థ వద్దే ఉండటంతో అత‌డు త‌న వ్యూహాన్ని మార్చుకుంటున్నారు అంతే. భవిష్యత్తులో వచ్చే లాభాలు, హక్కులు పూర్తిగా తన చేతుల్లోనే ఉండేలా తన సొంత బ్యానర్‌పైనే సరికొత్త గాసిప్ టాక్ షోను ప్లాన్ చేస్తున్నారు.

ఈ కొత్త షో విషయంలో కరణ్ జోహార్ ఒక భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేసే బదులు మొదట ఈ షోను యూట్యూబ్‌లో లాంచ్ చేసి బలమైన ప్రేక్షకులను (ఆడియన్స్) క్రియేట్ చేసుకోవాలని భావిస్తున్నారు. యూట్యూబ్‌లో మంచి ఆదరణ దక్కించుకున్న తర్వాత.. ప్రముఖ ఓటీటీ స్ట్రీమర్లు దానిని కొనుగోలు చేసేలా పక్కా వ్యాపార ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.

మొత్తానికి ఒక ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన `కాఫీ విత్ కరణ్` ఎండ్‌ అవుతున్నా కానీ.... అదే గ్లామర్, హై-వోల్టేజ్ గాసిప్స్‌తో కూడిన మరో కొత్త షోతో కరణ్ జోహార్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సొంత హక్కులతో ఆయన చేయబోతున్న ఈ కొత్త ప్రయోగం ఏ మేరకు విజయం సాధిస్తుందనేది ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News