వెండితెరపై 'రామాయణ' వైభవం: రాజమౌళిలో ఎందుకు అంత అసంతృప్తి?

తెలుగు చిత్రసీమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినీ ప్రస్థానం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రఖ్యాత `ఎంపైర్` పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసారు.

Update: 2026-10-12 03:29 GMT

తెలుగు చిత్రసీమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినీ ప్రస్థానం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రఖ్యాత `ఎంపైర్` పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసారు. ఇప్పటివరకూ ప‌లు భాషల్లో వచ్చిన రామాయణ ఆధారిత చిత్రాలు ఈ అద్భుత‌మైన పురాణేతిహాసానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయాయనేది తన అభిప్రాయమని రాజ‌మౌళి అసంతృప్తిని వ్య‌క్త‌ప‌రిచారు. ఆ పురాణంలో దాగి ఉన్న అసలైన ఆధ్యాత్మిక, విజువల్ వైభవాన్ని వెండితెరపై ఆవిష్కరించాలనే తన కల నెరవేరే సమయం ఆసన్నమైందని.. వారణాసి చిత్రం తన సినీ ప్రయాణంలోనే ఒక అద్భుత మైలురాయిగా నిలవబోతోందని ప్రకటించారు.

ఇప్పటివరకూ తానెన్ని ఘనవిజయాలు సాధించినా.. సెట్స్ పైకి వెళ్లే ప్రతి కొత్త ప్రాజెక్ట్‌ను తన మొదటి సినిమాగానే భావిస్తానని రాజమౌళి పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం పొందుతున్న `వారణాసి` చిత్రంలో రామాయణానికి సంబంధించిన ఒక కీలకమైన ఘట్టాన్ని అత్యంత భారీగా తెరకెక్కించే అవకాశం తనకు లభించిందని తెలిపారు. భారతీయ చిత్రసీమలో ఇప్పటివరకు చూడని విజువల్ గ్రాండియర్ కాన్సెప్ట్‌తో పాటు, పాత్రల మధ్య ఉండే గాఢమైన భావోద్వేగాలను (ఎమోషన్స్) కూడా అంతే శక్తివంతంగా ఆవిష్కరించడం ద్వారా ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించబోతున్నట్లు వెల్లడించారు.

రామాయణ ఘట్టాన్ని విజువల్‌గా ఏ స్కేల్‌లో చూపించాలనే విషయంలో తనకు తానుగా ఒక పెద్ద సవాలును విసురుకున్నానని... ఇప్పుడు ఆ ఆశయం నిజరూపం దాల్చుతుండటం ఎంతో సంతృప్తిని ఇస్తోందని ఆయన అన్నారు. కేవలం భారీ గ్రాఫిక్స్ మాత్రమే కాకుండా.. భారతీయ సంస్కృతికి అద్దం పట్టే కథాబలాన్ని ప్రపంచ ప్రేక్షకులకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాజమౌళి స్పష్టం చేశారు. ఈ క్రమంలో `వారణాసి` ద్వారా భారతీయ చలనచిత్ర రంగానికి రాజమౌళి మరో విజువల్ వండర్‌ను కానుకగా ఇవ్వబోతున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రామాయణం ఆధారంగా లేదా దాని అనుబంధ కథలతో ఇప్పటివరకు దాదాపు 80కి పైగా చలనచిత్రాలు నిర్మితమయ్యాయి. వీటిలో అత్యధికంగా తెలుగులో సుమారు 20కి పైగా చిత్రాలు రూపొంది అగ్రస్థానంలో నిలిచాయి; ఎన్.టి.రామారావు లవకుశ, సీతారామ కళ్యాణం వంటి క్లాసిక్స్ నుండి బాపు శ్రీరామరాజ్యం, ఇటీవల వచ్చిన `ఆదిపురుష్` వరకు తెలుగులో ప‌లు అద్భుతమైన పౌరాణిక కావ్యాలు తెరకెక్కాయి. ఇక హిందీలో సుమారు 25కి పైగా సినిమాలు రాగా, దాదాసాహెబ్ ఫాల్కే `లంకా దహన్` (1917), మహాత్మా గాంధీ చూసిన ఏకైక సినిమా `రామ్ రాజ్య` (1943)లతో పాటు `భ‌జరంగబలి`, యానిమేషన్ చిత్రాలు .. `సింగం ఎగైన్` వంటి ఆధునిక వెర్ష‌న్ లు విశేష ఆదరణ పొందాయి.

దక్షిణాదిలోని ఇతర భాషల విషయానికి వస్తే, ...తమిళంలో సుమారు 10 నుండి 15 సినిమాలు నేరుగానూ, డబ్బింగ్ రూపంలోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. శివాజీ గణేషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన `సంపూర్ణ రామాయణం` (1958) ... మణిరత్నం `రావణన్` (2010) లలో రామాయ‌ణ ఎపిసోడ్స్ ప్రధానమైనవి. కన్నడలో సుమారు 8 నుండి 10 చిత్రాలు నిర్మించబడగా, ఈ చిత్రసీమలో వచ్చిన మొట్టమొదటి టాకీ సినిమా `సతీ సులోచన` (1934) .. రాజ్ కుమార్ `భూకైలాస` రామాయణ నేపథ్యంతోనే ప్రాణం పోసుకున్నాయి. మలయాళంలో సుమారు 5 నుండి 8 సినిమాలు రాగా, ప్రేమ్ నజీర్ `సీత‌` (1960) ... జాతీయ అవార్డు పొందిన జి. అరవిందన్ సమాంతర చిత్రం `కాంచన సీత` (1977) వంటి ప్రయోగాత్మక చిత్రాలు అత్యంత అరుదైన‌ మైలురాళ్ళుగా నిలిచాయి.

Tags:    

Similar News