ఇండియన్ Vs హాలీవుడ్ యాక్షన్: అసలు తేడా చెప్పిన విద్యుత్ జామ్‌వాల్
ఇండియన్ - హాలీవుడ్ యాక్షన్ చిత్రాల మధ్య వ్యత్యాసం ప్రతిభ కాదు. కేవలం సమయం మాత్రమేనని నటుడు విద్యుత్ జామ్‌వాల్ అభిప్రాయపడ్డారు.
ఇండియన్ - హాలీవుడ్ యాక్షన్ చిత్రాల మధ్య వ్యత్యాసం ప్రతిభ కాదు. కేవలం సమయం మాత్రమేనని నటుడు విద్యుత్ జామ్‌వాల్ అభిప్రాయపడ్డారు. తాను ప్రతిష్ఠాత్మకంగా నటిస్తున్న హాలీవుడ్ చిత్రం `స్ట్రీట్ ఫైటర్` విడుదల కానున్న నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులకు కొదవ లేదన్నారు. కానీ హాలీవుడ్‌తో పోలిస్తే మన దగ్గర సరైన సమయం, వనరులు లభించకపోవడమే ప్రధాన తేడా అన్నారు.
ఈ సందర్భంగా యాక్షన్ చిత్రాల మేకింగ్ విధానాన్ని వివరించారు. భారత్‌లో పది రోజుల్లో చిత్రీకరించే యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్‌లో నాలుగు నెలల పాటు నిరూపితంగా ప్లాన్ చేసి తీస్తారని విద్యుత్ తెలిపారు. సమయం తీసుకొని నాణ్యతకు పెద్దపీట వేస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో రాజమౌళి తెరకెక్కించిన `బాహుబలి` చిత్రం నిరూపించిందని ఉదాహరణగా పేర్కొన్నారు. మన దేశంలో కూడా సమయాన్ని కేటాయించి ప్రాజెక్ట్‌లు రూపుదిద్దుకుంటే హాలీవుడ్ స్థాయి విజువల్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ సాధించడం సులభమేనని అభిప్రాయపడ్డారు.
వీడియో గేమ్ ఆధారంగా రూపొందుతున్న `స్ట్రీట్ ఫైటర్` సినిమాతో విద్యుత్ జామ్‌వాల్ హాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన `ధాల్సిమ్` అనే యోగి , కలరిపయట్టు యోధిక్యారెక్టర్‌లో కనిపిస్తారు. ఇది భారతీయ సాంప్రదాయ మార్షల్ ఆర్ట్స్‌ను ప్రపంచ వేదికపై ప్రతిబింబించే మంచి అవకాశం అని ఈ పాత్ర కోసం దర్శకుడు తనను స్వయంగా ఎంపిక చేసుకున్నారని విద్యుత్ తెలిపారు. ఈ చిత్రంలో జాసన్ మోమోవా, రోమన్ రెయిన్స్, 50 సెంట్ వంటి ప్రముఖ హాలీవుడ్ నటులతో కలిసి విద్యుత్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
హాలీవుడ్ ప్రొడక్షన్ అనుభవాలను పంచుకున్నారు. అక్కడి చిత్ర పరిశ్రమలో ప్రణాళికలు , లీగల్ నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయన్నారు. నటుల భద్రతకు సంబంధించి బీమా చట్టాలు పక్కాగా అమలు కావడం వల్ల షూటింగ్ సమయంలో పూర్తి క్రమశిక్షణ కనిపిస్తుందన్నారు. తన జీవితంలో హాలీవుడ్‌కు వెళ్లాలని ప్రత్యేకంగా ప్లాన్ చేయలేదని తెలుగు, తమిళ చిత్రాల్లో నటించినట్లే ఇదీ తన నటనా ప్రయాణంలో మరో సహజమైన అడుగు మాత్రమేనన్నారు.
చిన్నప్పటి నుంచి యాక్షన్ జానర్ అంటేనే ఎంతో ఇష్టమని, సినిమా నిడివితో సంబంధం లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో నటించడానికే ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని విద్యుత్ వెల్లడించారు. అమితాబ్ బచ్చన్, జాకీ చాన్స్, బ్రూస్ లీ వంటి దిగ్గజాలను తాను యాక్షన్ ఐకాన్లుగా భావిస్తానన్నారు. ప్రతికూలతలను దాటుకుంటూ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విద్యుత్, భవిష్యత్తులో కూడా యాక్షన్ సినిమాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తానన్నారు.
హిందీ చిత్ర పరిశ్రమలో మరో యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఓ భారీ యాక్షన్ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు విద్యుత్ జామ్‌వాల్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇద్దరికీ తగ్గ సరైన దర్శకుడి అన్వేషణలో ఉన్నట్లు తెలిపారు. విద్యుత్ నటించిన హాలీవుడ్ డెబ్యూ మూవీ `స్ట్రీట్ ఫైటర్` ఆంగ్లంతో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 16న విడుదలవుతుంది.