కరణ్ జోహార్ ఇన్‌స్టా అన్‌ఫాలో గుట్టు విప్పాడు
బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ చేసిన ఓ పని ఉన్నట్టుండి చాలా సందేహాలకు తావిచ్చింది.
బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ చేసిన ఓ పని ఉన్నట్టుండి చాలా సందేహాలకు తావిచ్చింది. అసలింతకీ ఈయనకు ఏమైంది? అంటూ ఆరాలు కూడా మొదలయ్యాయి. అసలింతకీ కరణ్ ఏం చేసాడు? అంటే... ఇన్‌స్టాగ్రామ్‌లో షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, అలియా భట్, కత్రినా కైఫ్ వంటి టాప్ సెలబ్రిటీలను అన్‌ఫాలో చేసాడు. దీనిపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చెలరేగడమే గాకుండా వివాదాలు నడిచాయి. కరణ్ క్యాంప్‌లో విభేదాలు వచ్చాయంటూ కొందరు.. ఆయన నిర్మించిన `చాంద్ మేరా దిల్` బాక్సాఫీస్ పరాజయం వల్ల మైండ్ గేమ్‌లు ఆడుతున్నారంటూ మరికొందరు క్లిక్‌బైట్ కథనాలతో హల్‌చల్ చేశారు. ఈ నేపథ్యంలో తన అన్‌ఫాలో పర్వం వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెడుతూ కరణ్ జోహార్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
పరిశ్రమలోని తన సన్నిహితులతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేస్తూ కరణ్ జోహార్ తన ఇన్‌స్టా స్టోరీలో ఘాటుగా సమాధానమిచ్చారు. `ఇదొక డిజిటల్ డిటాక్స్ !. ఇన్‌స్టాలో అనవసరంగా గడిపే సమయాన్ని.. వృథా అయ్యే శక్తిని తగ్గించుకోవడానికే నేను అందరినీ అన్‌ఫాలో చేస్తున్నాను`` అని పేర్కొన్నారు. దీనిని ఒక జాతీయ స్థాయి వార్తగా మార్చవద్దని.. ఇలాంటి అనవసర విషయాలపై క్లిక్‌బైట్ కథనాలు రాయడం ఆపేయాలని మీడియాను, నెటిజన్లను కోరారు.
ప్రస్తుతం కరణ్ జోహార్ ఇన్‌స్టా ఖాతాలో `ఫాలోయింగ్` కౌంట్ కేవలం 74 కి పడిపోయింది. బాలీవుడ్ ముఠా మొత్తాన్ని పక్కన పెట్టినా ఆయన గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రాని మాత్రం ఇంకా ఫాలో అవుతుండటం విశేషం. అయితే ఇదంతా కేవలం సోషల్ మీడియాకు కాస్త దూరం జరిగి... మానసిక ప్రశాంతతను పొందడానికి ఒక సెలబ్రిటీ తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం మాత్రమేనని... దీని వెనుక ఎలాంటి సినిమాటిక్ డ్రామాలు కానీ... ఇండస్ట్రీ కోల్డ్ వార్స్ కానీ లేవని కరణ్ క్లారిటీ ఇచ్చారు.
వాస్తవానికి కరణ్ జోహార్ ఇటీవల లక్ష్య, అనన్యా పాండే జంటగా నిర్మించిన `చాంద్ మేరా దిల్` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మిశ్రమ సమీక్షలతో నిరాశాజనకమైన వసూళ్లను సాధించింది. ఒక పెద్ద ప్రాజెక్ట్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వనప్పుడు... దాని తదుపరి విమర్శల నుండి... సోషల్ మీడియా నెగిటివిటీ నుండి విరామం తీసుకోవడానికి ఇండస్ట్రీ ప్రముఖులు ఇలాంటి `డిజిటల్ డిటాక్స్` మార్గాలను ఎంచుకోవడం సహజమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే సెలబ్రిటీల చిన్న చిన్న సోషల్ మీడియా కదలికలను కూడా భూతద్దంలో చూపిస్తూ గాసిప్స్ సృష్టించే నేటి డిజిటల్ ట్రెండ్‌కు కరణ్ సమాధానం ఒక గట్టి కౌంటర్ అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఎవరు ఎవరిని ఫాలో అవుతున్నారు అనే అంశం కంటే వారి సృజనాత్మకత, సినిమాలపైనే ప్రేక్షకులు దృష్టి పెట్టాలనే సందేశాన్ని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.