చివరికి కరణ్ జోహార్‌కి కూడా భక్తి పవర్ ఎలా ఉంటుంటో తెలిసొచ్చింది!
రాజమౌళి ప్రతిష్ఠాత్మక `వారణాసి` ప్రాజెక్ట్, నితీష్ తివారి `రామాయణం` వంటి భారీ చిత్రాలు మాత్రమే కాకుండా.. పలువురు ప్రముఖ మేకర్స్ ఆధ్యాత్మిక అంశాలతో కూడిన కథలపై దృష్టి సారించారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం భక్తిరస, పౌరాణిక చిత్రాల వెల్లువ స్పష్టంగా కనిపిస్తోంది. దేవుడు లేదా ఆధ్యాత్మిక నేపథ్యంతో వచ్చే సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో పెద్ద పెద్ద నిర్మాతలు, దర్శకులు ఈ జోనర్ వైపు మొగ్గు చూపుతున్నారు. రాజమౌళి ప్రతిష్ఠాత్మక `వారణాసి` ప్రాజెక్ట్, నితీష్ తివారి `రామాయణం` వంటి భారీ చిత్రాలు మాత్రమే కాకుండా.. పలువురు ప్రముఖ మేకర్స్ ఆధ్యాత్మిక అంశాలతో కూడిన కథలపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే, బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌కి కూడా భక్తి సినిమాల పవర్ ఏంటో చివరికి తెలిసొచ్చింది.
దాదాపు మూడు దశాబ్దాలుగా మోడ్రన్ రొమాంటిక్ సినిమాలు.. ఫ్యామిలీ డ్రామాలు.. లార్జర్ ద్యాన్ లైఫ్ కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించిన కరణ్ జోహార్ ఇప్పుడు పూర్తిగా తన రూట్ మార్చారు. తన సొంత బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై `రాధా కృష్ణ` దివ్య ప్రేమకథ ఆధారంగా ఒక భారీ పౌరాణిక-భక్తిరస (హిస్టారికల్-దేవోషనల్) చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎప్పుడూ మోడ్రన్ లవ్ స్టోరీలను ఆవిష్కరించే కరణ్ తొలిసారిగా భారతీయ ఇతిహాసాల నుంచి రూపుదిద్దుకునే అత్యంత పవిత్రమైన ప్రేమకథను ఎంచుకోవడం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ చిత్రం శ్రీకృష్ణుడి జననం నుండి కంస వధ వరకు సాగే సుదీర్ఘమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆవిష్కరించనుంది. అయితే ఈ కథనం మధ్యలో రాధాకృష్ణుల అమర ప్రేమకథను ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కించబోతున్నారు. ఆ దివ్యమైన కథలోని భావోద్వేగాలు, ప్రణయం, డ్రామా, ట్రాజెడీ ఏమాత్రం దెబ్బతినకుండా, ఆధ్యాత్మిక మూలాలను కాపాడుతూనే అత్యంత దార్శనికతతో. భారీ విజువల్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి సచిన్ రవి దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడలో రక్షిత్ శెట్టి కథానాయకుడిగా వచ్చిన ఫాంటసీ కామిడీ హిట్ `అవనే శ్రీమన్నారాయణ` చిత్రంతో దర్శకుడిగా తన మార్క్ చూపించిన సచిన్ రవి, `కిరిక్ పార్టీ`, `ఉలిదవరు కందతే` వంటి అనేక విజయవంతమైన చిత్రాలకు ఎడిటర్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఈ `రాధా కృష్ణ` ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకుని ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.
ఇటీవలే ధర్మ ప్రొడక్షన్స్‌లో మెజారిటీ వాటాను సీరం ఇనిస్టిట్యూట్ అధినేత ఆదార్ పూనావాలాకు విక్రయించిన సంగతి తెలిసిందే. పూనావాలా భాగస్వామ్యం, ఆర్థిక అండదండలతో కరణ్ జోహార్ ఇప్పుడు నిర్మాణ శైలిలో రకరకాల ప్రయోగాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఒకప్పుడు కేవలం కార్పొరేట్ ట్రెండీ సినిమాలే నిర్మించే ధర్మ ప్రొడక్షన్స్.. ఇప్పుడు భారతీయ సంస్కృతి, భక్తిరస చిత్రాల వైపు అడుగులు వేస్తుండటం మారుతున్న భారతీయ సినీ ట్రెండ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.