ఆ నలుగురు భామ‌ల‌కు ఇదే చివ‌రి ఛాన్స్!

పరిశ్రమలో విజయం సాధించడం ఎంత కీలకమో? ఆ విజయాన్ని సుదీర్ఘ కాలం పాటు నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం.

Update: 2026-09-11 13:30 GMT

పరిశ్రమలో విజయం సాధించడం ఎంత కీలకమో? ఆ విజయాన్ని సుదీర్ఘ కాలం పాటు నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. కెరీర్‌లో హెచ్చుతగ్గులు సహజమే అయినా? వరుస ప్లాప్‌లు .. సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న నలుగురు నటీమణులు ఐశ్వర్య రాజేష్, కృతి శెట్టి, శ్రీనిధి శెట్టి, ఫరియా అబ్దుల్లా కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టేందుకు అప్ క‌మింగ్ ప్రాజెక్టులపైనే ఆశలు పెట్టుకున్నారు. టాలీవుడ్‌లో ఉనికిని కాపాడుకోవడానికి ఈ భామలకు రాబోయే చిత్రాలే చివరి అవకాశంగా క‌నిపిస్తున్నాయి.

ఐశ్వర్య రాజేష్‌కి `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రం తర్వాత ఆ స్థాయి విజయం దక్కలేదు. తమిళంలో వరుస అవకాశాలు వ‌స్తున్నా? తెలుగులో మాత్రం అమ్మ‌డి గ్రాఫ్ మందగించింది. ప్రస్తుతం హీరో సుమంత్ సరసన న‌టిస్తోన్న `మహేంద్రగిరి వారాహి` చిత్రంపైనే అమ్మ‌డు ఆశలు పెట్టుకుంది. ఆధ్యాత్మికంశాల నేపథ్యంతో రూపుది ద్దుకుంటున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ హిట్టయితేనే ఐశ్వర్యకి టాలీవుడ్‌లో మళ్లీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

`ఉప్పెన` చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్ డమ్ తెచ్చుకున్న కృతి శెట్టికి ఆ తర్వాత వరుస ప్లాప్‌లు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. చేతిలో టాలీవుడ్ సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న ఈ బ్యూటీకి వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న‌ సంక్రాంతి చిత్రం అతిపెద్ద ఊరటగా నిలిచింది. జనవరి 12న విడుదల కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ గనక బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ అయితే కృతి శెట్టి తెలుగులో రీ-ఎంట్రీ ఇవ్వడానికి.. స్టార్ డమ్‌ను నిలబెట్టుకోవడానికి మార్గం సుగమం అవుతుంది.

`కేజీఎఫ్` తో సంచలన విజయం ఆ తర్వాత `హిట్ 3` చిత్రాలతో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ శ్రీనిధి శెట్టికి ఆ తర్వాత ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. ప్రతిష్టాత్మక చిత్రాల్లో న‌టించినా? టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు అందకపోవడంతో అమ్మ‌డు ప్రస్తుతం నటిస్తున్న `ఆదర్శ కుటుంబం` చిత్రంపైనే పూర్తిగా దృష్టి సారించింది. కుటుంబ కథాంశంతో వస్తున్న ఈ సినిమా విజయంపైనే తెలుగు కెరీర్ ఆధారపడి ఉంది.

`జాతి రత్నాలు` చిత్రంతో చిట్టి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫరియా అబ్దుల్లా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నా? ఆ తర్వాత ఆ స్థాయి హిట్ మాత్రం ఖాతాలో పడలేదు. ప్రస్తుతం యంగ్ హీరో సందీప్ కిషన్‌తో కలిసి న‌టిస్తోన్న‌ నూతన చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తేనే ఫరియాకి టాలీవుడ్‌లో మరిన్ని ప్రాజెక్టులు లభించే అవకాశం ఉంది.

మొత్తానికి టాలీవుడ్‌లో పోటీ నెలకొన్న సమయంలో నలుగురు కథానాయికలు నటిస్తున్న ఈ చిత్రాలు వారి కెరీర్‌కు అత్యంత కీలకమైన మలుపుగా మారనున్నాయి. గ్లామర్, నటన పరంగా తమను తాము నిరూపించుకున్నా? బాక్సా ఫీస్ విజయం లేకపోతే పరిశ్రమలో నిలదొక్కుకోవడం కష్టమనేది చేదు నిజం. రాబోయే చిత్రాలతో ఈ భామలు గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇవ్వాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News