రణబాలి.. సైరా వైపా? ఆర్ఆర్ఆర్ వైపా?
టీజర్లో విజువల్స్.. డైలాగ్స్.. బీజీఎం.. విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్.. అన్ని కూడా సినిమాపై అంచనాలు పెంచేలాగే ఉన్నాయి.
విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో రూపొందుతున్న ‘రణబాలి’ సినిమా నుంచి ఇటీవలే టీజర్ లాంచ్ చేశారు. దానికి చాలా వరకు పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. కొందరు పనిగట్టుకుని టీజర్‌ను టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు కానీ.. సగటు ప్రేక్షకుల్లో మాత్రం సినిమా మీద పాజిటివ్ ఒపీనియనే కలిగించింది టీజర్. టీజర్లో విజువల్స్.. డైలాగ్స్.. బీజీఎం.. విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్.. అన్ని కూడా సినిమాపై అంచనాలు పెంచేలాగే ఉన్నాయి. కాకపోతే కథాంశం విషయంలో మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. ఇది వాస్తవ గాథలా ప్రొజెక్ట్ చేస్తోంది చిత్ర బృందం.
రణబాలి అనే అన్ సంగ్ హీరో నిజంగానే చరిత్రలో ఉన్నాడని.. తన కథనే సినిమాలో చూపిస్తున్నామని యూనిట్ వర్గాలు అంటున్నాయి. కానీ చరిత్రలో అయితే ఈ క్యారెక్టర్ మరీ పాపులర్ అయినట్లేమీ కనిపించడం లేదు. కల్పిత గాథలు తీయడానికి, వాస్తవ కథలను చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. నిజ జీవిత కథలను తెరపైకి తీసుకొస్తే.. ఇదంతా నిజంగా జరిగింది అనిపించేట్లు ఉండాలి.
ఒక రాయలసీమ యోధుడు.. బ్రిటిష్ వారిని ఊచకోత కోశాడని.. పదులు, వందల సంఖ్యలో బ్రిటిష్ సైన్యాన్ని మట్టుబెట్టాడని.. వారి మీద వీరోచితంగా పోరాడాడని అంటే జనాలు అంత సులువుగా నమ్మరు. ఇంతకుముందు ‘సైరా’ సినిమా విషయంలో ఏం జరిగిందో గుర్తుండే ఉంటుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్ప యోధుడే అయినా.. సినిమాలో ఆ పాత్రను, జరిగిన విషయాలను మరీ ఎగ్జాజరేట్ చేసి చూపించడంతో ఆ సినిమా అథెంటిగ్గా అనిపించలేదు. భారీ స్థాయిలో యుద్ధ సన్నివేశాలను చూపించి.. వేల మంది బ్రిటిష్ సైన్యాన్ని ఉయ్యాలవాడ తన బృందంతో కలిసి చంపేసినట్లు చూపించడంతో అతిశయోక్తిలా అనిపించి ఆ సినిమా పట్ల ప్రేక్షకులు పెదవి విరిచారు.
అదే సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రాజమౌళి తెలివిగా.. చరిత్రలోంచి ఇద్దరు వీరుల పాత్రలను తీసుకుని.. మిగతా అంతా కల్పన జోడించి సినిమా తీశాడు. ఇది ఫిక్షన్ అని చెప్పడంతో వాస్తవంగా ఏం జరిగిందని ఆలోచించకుండా.. లాజిక్స్ పట్టించుకోకుండా సినిమా చూసి ఆదరించారు జనం. మరి ‘రణబాలి’ టీం ఈ రెండు చిత్రాల్లో దేని బాటలో సాగుతుందన్నది ఆసక్తికరం. రియల్ స్టోరీ అని చెప్పిన అతిశయోక్తులు జోడిస్తే జనాలకు వేరే ఫీలింగ్ కలుగుతుంది. అలా కాకుండా కల్పిత కథ అని చెప్పి.. చరిత్రతో ముడిపెట్టకుండా కల్పనలు జోడించి, ఎగ్జాజరేషన్లు ఉన్నా ఇబ్బంది ఉండదు.