మరో అద్భుతానికి తెరలేపనున్న రిషబ్‌శెట్టి!
ఇక హిందీలో `ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి మహారాజ్`తో పాటు మరో రెండు మూడు క్రేజీ ప్రాజెక్ట్‌లకు రెడీ అవుతున్నాడు.;
`కాంతార` మూవీతో సైలెంట్‌గా బరిలోకి దిగి కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచిన హీరో రిషబ్ శెట్టి. విలన్‌గా కెరీర్ ప్రారంభించిన రిషబ్ అనూహ్యంగా `కాంతార` మూవీతో పాన్ ఇండియా స్టార్‌ల జాబితాలో చేరిన విషయం తెలిసిందే. కేవలం మౌత్ టాక్‌తో ఐదు భాషల్లోనూ ఈ సినిమాతో సంచలన విజయాన్ని సొంత చేసుకున్నాడు. హీరోగా, దర్శకుడిగా ప్రశంసలు, జాతీయ స్థాయిలో అవార్డుల్ని సైతం దక్కించుకుని కన్నడ నాట మోస్ట్ వాంటెడ్ స్టార్‌గా మారాడు.
గత ఏడాది దీనికి ప్రీక్వెల్‌గా రూపొందిన `కాంతార చాప్టర్ 1`తోనూ అంతకు మించిన బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకుని దేశ వ్యాప్తంగా ప్రేక్షకులతో పాటు మేకర్స్‌ని ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న రిషబ్ శెట్టి ..ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న `జై హనుమాన్`లో టైటిల్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. ఇందులో లార్డ్ హనుమాన్‌గా కనిపించి సర్‌ప్రైజ్ చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇక హిందీలో `ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి మహారాజ్`తో పాటు మరో రెండు మూడు క్రేజీ ప్రాజెక్ట్‌లకు రెడీ అవుతున్నాడు. అయితే `కాంతార`తో అద్భుతాన్ని సృష్టించిన రిషబ్‌శెట్టి త్వరలో మరో అద్భుతానికి తెరలేపనున్నాడని తెలుస్తోంది. మలయాళ ఫేమస్ రచయిత, స్క్రీన్‌ప్లే రైటర్ ఎంటీ. వాసుదేవన్ నాయర్ రచించిన పాపులర్ నవల `రండమూళం` ఆధారంగా సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. `రంగమూళం` మహాభారతాన్ని ఆధారం చేసుకుని భీముని నేపథ్యంలో సాగుతుంది.
దీంతో ఇదే కథని తెరపైకి తీసుకురావాలనే ప్లాన్‌లో రిషబ్ ఉన్నట్టుగా ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. గతంలో ఈ ఫేమస్ నవల ఆధారంగా మణిరత్నం ఓ భారీ మూవీని తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. ఎంతకూ ముందుకు వెళ్లకపోవడంతో ఎం.టీ వాసుదేవన్ నాయర్ తనకు రైట్స్ ఇవ్వనని చెప్పారట. ఆ సమయంలో ఈ కథకు రిషబ్‌శెట్టి న్యాయం చేస్తాడని మణిరత్నం చెప్పాడట. అప్పటి నుంచి రిషబ్‌ని కలవాలని ప్రయత్నాలు చేశారట. ఫైనల్‌గా కలవాలని అనుకున్న సమయంలో వాసుదేవన్ నాయర్ కు ఆరోగ్య సమస్యలు తలెత్తడం, ఆయన హాస్పిటల్‌లో చేరడంతో అది కుదరలేదని తెలిసింది.
రిషబ్‌ని కలవకుండానే ఆయన 2024 డిసెంబర్ 25న మృతి చెందారు. చనిపోతూ సినిమా బాధ్యతల్ని వాసుదేవన్ నాయర్ తన కూతురు అశ్వతి వి. నాయర్‌కు అప్పగించారట. తండ్రి కోరిక మేరకు ఆమె రిషబ్‌శెట్టితో కలిసి ఈ నవలని తెరపైకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే కోజ్‌కోడ్‌లోని వాసుదేవన్ నాయర్ ఫ్యామిలీని రిషబ్ కలవనున్నాడని, వారితో కలిసి జాయింగ్ వెంచర్‌గా `రండమూళం` నవలని తెరపైకి తీసుకురానున్నారని, ఇందులో భీముడిగా రిషబ్ నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.