కన్నప్ప @రాష్ట్రపతి భవన్: తెలుగు సినిమాకు మరో గౌరవం!

పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన భక్తిరస చిత్రంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నప్ప ఇప్పుడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.;

Update: 2025-07-16 13:45 GMT

పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన భక్తిరస చిత్రంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నప్ప ఇప్పుడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించి, డా. ఎం. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం తాజాగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించబడింది. ఇది తెలుగు సినిమా చరిత్రలో ఒక అరుదైన ఘట్టంగా నిలిచింది. ఈ ప్రత్యేక ప్రదర్శన ద్వారా ‘కన్నప్ప’ సినిమా మళ్ళీ జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది.

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ స్క్రీనింగ్‌కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వారంతా శివ భక్తుడైన భక్త కన్నప్ప కథను ఎంతో భక్తిశ్రద్ధలతో ఆస్వాదించారు. ఈ చిత్రంలోని కథన శైలి, విజువల్స్, భావోద్వేగాలు వారిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చివరి 40 నిమిషాల సినిమా అనుభవం నిజంగా చక్కటి ఆధ్యాత్మిక ప్రయాణంలా అనిపించిందని వారు అభిప్రాయపడ్డారు.

ఈ స్క్రీనింగ్ తర్వాత పలువురు ప్రముఖులు కన్నప్ప గురించి ప్రశంసలతో ముంచెత్తారు. సినిమాకున్న ఆధ్యాత్మికత, సాంకేతిక నైపుణ్యం, భావోద్వేగాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని అన్నారు. ఇక విష్ణు మంచు నటనపై ప్రత్యేక ప్రశంసలు వచ్చాయి. ఆయన స్క్రీన్ మీద చూపిన డెడికేషన్, ప్రెజెన్స్, ఎమోషనల్ డెప్త్ అందర్నీ ఆకట్టుకుందని పలువురు అభిప్రాయపడ్డారు.

విష్ణు మంచు నటన ఇప్పటికే విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటోంది. ఆయన పాత్రలో ఒదిగిపోయిన తీరు, పాత్ర పట్ల తీసుకున్న నిబద్ధత అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలుచోట్ల ప్రత్యేక షోలు, స్పిరిచువల్ సమాజాల అభినందనలు సినిమాకు మరింత గుర్తింపు తీసుకువస్తున్నాయి. అలాగే విజయవాడలో అఘోరాలతో కలిసి వీక్షించిన షో కూడా ఇటీవలే చర్చనీయాంశమైంది.

ఈ సినిమా ప్రత్యేకత రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించబడడమే కాదు, ఇది భక్తి ప్రధానమైన తెలుగు చిత్రాలకు జాతీయ స్థాయిలో గౌరవం దక్కించిందనే విశేషం. భవిష్యత్తులో తెలుగు సినిమాకు, భక్తి చిత్రాల నిర్మాణానికి ఇది కొత్త మార్గాన్ని చూపించనుంది. మోహన్ బాబు నిర్మాణ విలువలు, విష్ణు నటన, దర్శకుడి ప్రతిభ అన్నీ కలిసి కన్నప్పను ఒక స్పెషల్ సినిమాగా నిలబెట్టాయి. మొత్తానికి, రాష్ట్రపతి భవన్ స్క్రీనింగ్‌తో కన్నప్ప తన ప్రయాణంలో మరో గొప్ప రికార్డ్ ను అందుకుంది.

Tags:    

Similar News