CM చంద్రబాబు బయోపిక్‌పై అతడికి ఎందుకంత ఆసక్తి?
సినీరాజకీయ రంగ ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు లేదా క్రీడాకారుల స్ఫూర్తివంతమైన జీవితకథల్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.;
ఇటీవల బయోపిక్‌లపై ఉత్సాహం అంతకంతకు పెరుగుతోందే కానీ తరగడం లేదు. సినీరాజకీయ రంగ ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు లేదా క్రీడాకారుల స్ఫూర్తివంతమైన జీవితకథల్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈరోజు కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ విజయవాడలోని కనక దుర్గమ్మను సందర్శించారు. అమ్మవారి దర్శనం అనంతరం శివరాజ్ కుమార్ (శివన్నగా కన్నడలో సుప్రసిద్ధుడు) మీడియాతో మాట్లాడిన విషయాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
శివరాజ్ కుమార్ తనకు ప్రముఖుల జీవిత కథలపై ఉన్న ఆసక్తిని వెల్లడించారు. ఆయన ప్రస్తుతం తెలుగు రాజకీయ నాయకుడు గుమ్మడి నర్సయ్య జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. రాజకీయాల్లో నైతిక విలువలను కాపాడిన వ్యక్తిగా నటించడం తనకు సంతోషంగా ఉందని అన్నారు.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్ లో నటించడానికి ఆసక్తిగా ఉన్నానని ఆయన ప్రకటించారు. ఎవరైనా దర్శకుడు సిఎన్‌బి జీవితకథతో తన వద్దకు వస్తే తాను ఆసక్తిగా ఉన్నానని అన్నారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నటవారసుడిగా శివరాజ్ కుమార్ కి కర్నాటకలో అసాధారణ ఫాలోయింగ్ ఉంది. అతడు తెలుగు సినీపరిశ్రమలో తన ఉనికిని చాటుకునేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉన్నాడు. ఇప్పుడు చరణ్ - బుచ్చిబాబు సినిమాలో తన పాత్రతో తెలుగు రాష్ట్రాల్లోను నిరూపించుకునేందుకు శివన్న చాలా శ్రమిస్తున్నారు. చంద్రబాబు బయోపిక్ లో అవకాశం వస్తే, అది తెలుగు నాట శివరాజ్ కుమార్ కు మరింత మైలేజ్ పెంచుతుందనడంలో సందేహం లేదు.
అయితే శివరాజ్ కుమార్ కోరుకున్న విధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కథతో ఏ దర్శకుడు ముందుకు వస్తాడు? బహుశా బాలయ్య - చంద్రబాబులకు అత్యంత సన్నిహితంగా ఉండే బోయపాటి మాత్రమే జస్టిఫై చేసే స్క్రిప్టును అందించగలరు. శివన్న కోరికను నెరవేరుస్తూ పాన్ ఇండియాలో ఒక బయోపిక్ ని తెరకెక్కించే అరుదైన అవకాశాన్ని ఎవరు దక్కించుకుంటారో వేచి చూడాలి. సి.ఎన్.బి పై ఇప్పటివరకూ బయోపిక్ రాలేదు. అతడి పాత్రను వివాదాస్పద ఆర్జీవీ పొలిటికల్ ఎజెండా సినిమాలో ఉపయోగించుకున్నా కానీ, ఆ సినిమా బయోపిక్ కేటగిరీలో లేదు. అందువల్ల ఒక నిజ జీవిత కథను, నిజాలతో తెరకెక్కించే దమ్ము ఎవరికి ఉందో అలాంటి దర్శకుడు సినిమా తీసినప్పుడు మాత్రమే ప్రజలు ఇళ్ల నుంచి కదిలి థియేటర్లకు రాగలరు. అలా కాకుండా ఎన్టీఆర్ బయోపిక్ తరహాలో హేతుబద్ధత లేకుండా తెరకెక్కించినప్పుడు ఫలితాన్ని ముందే ప్రజలు ఊహించగలరు. ప్రజలకు ముందే తెలిసిన సెలబ్రిటీ కథను నిజాయితీగా తెరకెక్కించినప్పుడు మాత్రమే జనం థియేటర్లకు వస్తారని ప్రూవ్ అయింది గనుక దీనిని పరిగణించాకే ప్రాజెక్టుకు తెర తీయాల్సి ఉంటుంది.
శివరాజ్ కుమార్ తదుపరి రామ్ చరణ్ `పెద్ది`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్‌కి ధీటుగా పోటీపడే పాత్రలో అతడు అవకాశం అందుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. పెద్ది రిలీజ్ తర్వాత శివరాజ్ కుమార్ కి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు పెరిగేందుకు అవకాశం ఉంది.