మేడం ఎలక్షన్ తో బిజీ... సినిమా మళ్లీ వాయిదా
అందుకే ఎమర్జెన్సీ సినిమా మళ్లీ వాయిదా వేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తాజా చిత్రం 'ఎమర్జెన్సీ' విడుదలకు వరుసగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. గత ఏడాది చివర్లోనే కంగనా రనౌత్ తన ఎమర్జెన్సీ సినిమాను విడుదల చేయాలని భావించింది. కానీ అప్పటికి షూటింగ్ పూర్తి అవ్వక పోవడంతో పాటు, కొన్ని ఇతర కారణాల వల్ల సినిమాను ఈ ఏడాది జూన్ కు వాయిదా వేశారు.
ఇప్పటికే సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది అంటూ కొన్ని నెలల క్రితమే కంగనా తో పాటు ఇతర యూనిట్ సభ్యులు ప్రకటించారు. కానీ జూన్ లో కూడా సినిమా విడుదల అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. షూటింగ్ పార్ట్ ఇంకా పూర్తి అవ్వలేదని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి చాలా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
కంగనా ప్రస్తుతం ఎన్నికల హడావుడి లో ఉంది. ఎంపీగా కంగనా ఇటీవలే నామినేషన్ ను దాఖలు చేసింది. ఆమె హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంపీగా బరిలో నిలుస్తున్న నేపథ్యంలో ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయిస్తుంది. బీజేపీ తరపున ఈసారి కంగనా పార్లమెంట్ లో అడుగు పెట్టడం ఖాయం అంటూ ఆమె సన్నిహితులు అంటున్నారు.
ఆమెకు ఉన్న సినీ ఇమేజ్ తో పాటు మోదీ చరిష్మా కలిసి వస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు. గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో ఏ మాత్రం ఛాన్స్ తీసుకోవద్దు అనే ఉద్దేశ్యంతో కంగనా దాదాపు రెండు నెలలుగా నియోజకవర్గంలో తిష్ట వేసింది.
రాజకీయాలతో బిజీగా ఉన్న కారణంగానే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేయాల్సిన ఎమర్జెన్సీని కంగనా పూర్తి చేయలేదు. ఈ సినిమాకు ఆమె దర్శకత్వం వహించడంతో పాటు లీడ్ రోల్ ను పోషిస్తున్న విషయం తెల్సిందే. ఆమె లేకుండా సినిమా ఒక్క అడుగు కూడా ముందుకు పడే పరిస్థితి లేదు.
అందుకే ఎమర్జెన్సీ సినిమా మళ్లీ వాయిదా వేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఈసారి ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సినిమా కొత్త తేదీ ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఎంపీగా కంగనా గెలిస్తే వరుసగా ఆమె నుంచి సినిమాలు వస్తాయా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎమర్జెన్సీ సినిమా ఎన్నికల ముందు వచ్చి ఉంటే బీజేపీ కి కచ్చితంగా మంచి జరిగి ఉండేది అనేది కొందరి అభిప్రాయం. కంగనా ముందస్తు ప్లాన్ ప్రకారం ఈ ఎన్నికలకు రెండు నెలల ముందే సినిమా విడుదల అవ్వాలి. కానీ అది సాధ్యం కాలేదు. ఎమర్జెన్సీ సినిమా విడుదల సమయంలో ఎన్ని వివాదాలు చుట్టూ ముడుతాయో చూడాలి.