అంతా తూచ్ అంటూ గాలి తీసేసిన పైర్ బ్రాండ్!
దీనిపై కంగనా స్పందించింది. తాను ఇప్పటి వరకు దిల్జిత్ దోసాంజ్‌ను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవనే లేదని తెలిపింది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్- పంజాబీ స్టార్ సింగర్ కమ్ యాక్టర్ దిల్జిత్ దోసాంజ్ మధ్య గతంలో జరిగిన సోషల్ మీడియా యుద్ధం మర్చిపోలేనిది. ముఖ్యంగా రైతుల ఉద్యమం సమయంలో ఇద్దరి మధ్య ఎక్స్ వేదికగా నడిచిన మాటల తూటాలు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాయి. అయితే తాజాగా కంగనా రనౌత్ ఇద్దరి సంబంధంపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాలను, నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తమ మధ్య ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదంటూ సరికొత్త చర్చకు తెరలేపారు. ఇంటర్నెట్‌ను ఊపేసిన ఆ వివాదం తర్వాత ఇద్దరు ఎప్పుడైనా ముఖాముఖి కలుసుకున్నారా? అనే సందేహం చాలా మందిలో ఉంది.
దీనిపై కంగనా స్పందించింది. తాను ఇప్పటి వరకు దిల్జిత్ దోసాంజ్‌ను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవనే లేదని తెలిపింది. కేవలం వర్చువల్ గాఇజరిగిన ఒక సంఘటన ఆధారంగా ప్రజలు తమను ఒకరికొకరు బద్ధ శత్రువులుగా చూస్తున్నారని.. కానీ వాస్తవానికి తామిద్దరం ఎప్పుడూ ఒకరినొకరు కలుసుకోలేదని కంగన వెల్లడించడం గమనార్హం. అలాగే దిల్జిత్‌తో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని, తామిద్దరం ఒకరికొకరు వ్యతిరేకం కాదని కంగనా పేర్కొన్నారు. జాతీయ .. సామాజిక అంశంపై ఇద్దరు వ్యక్తులకు భిన్నమైన అభిప్రాయాలు ఉండటం సహజమని, దాన్ని శత్రుత్వంగా భావించకూడదని అభిప్రాయపడ్డారు.
ఆనాడు సోషల్ మీడియాలో జరిగిన చర్చ కేవలం సైద్ధాం తిక పరమైనదే తప్ప.. అందులో ఎలాంటి వ్యక్తిగత ద్వేషాలు లేవని కంగన క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ తాజా ప్రకటన సెలబ్రిటీల డిజిటల్ జీవితాలకు, వారి నిజ జీవితాలకు మధ్య ఉండే వ్యత్యాసాన్నిమరోసారి స్పష్టం చేస్తోంది. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నంత మాత్రాన వారు వ్యక్తిగత జీవితంలో కూడా శత్రువులుగా మారిపోతారనే మీడియా, ఇంటర్నెట్ భ్రమలను కంగనా వ్యాఖ్యలు పటాపంచలు చేశాయి. ఆన్‌లైన్ వేదికలపై క్రియేట్ అయ్యే హైప్ .. నెగటివిటీ నిజ జీవితంలో ఉండే సంబంధాల కంటే చాలా భిన్నంగా ఉంటుందని ఈ ఉదంతం నిరూపిస్తోంది.
గతంలో ఇద్దరి అభిమానులు సోషల్ మీడియాలో గ్రూపులుగా విడిపోయి పరస్పరం ట్రోల్స్ చేసుకున్నారు. తాజాగా కంగనా స్వయంగా `మా మధ్య ఏమీ లేదు` అని ప్రకటించడంతో ఆ వివాదానికి దాదాపు తెరపడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయంగా, సామాజికంగా ఎప్పుడూ దూకుడుగా ఉండే కంగనా ఈ విషయంలో ఇంత సానుకూ లంగా స్పందించడం మారిన కంగన ఆలోచనా శైలికి నిదర్శనంగా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రిటీల మధ్య వచ్చే వివాదాలు ఎంత వేగంగా పుడతాయో? అంతే వేగంగా కరిగిపోతాయని చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. కంగనా రనౌత్ చేసిన తాజా కామెంట్లపై దిల్జిత్ దోసాంజ్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరం.