సంచలన బ్యూటీ నటనలో రాటు దేలిన విధానం!
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటిగా, విమర్శకుల ప్రశంసలు అందుకున్న కంగనా రనౌత్ తన సినీ ప్రస్థానంలోని ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నారు.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటిగా, విమర్శకుల ప్రశంసలు అందుకున్న కంగనా రనౌత్ తన సినీ ప్రస్థానంలోని ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో తాను పోషించిన పాత్రల స్వభావంపై అమ్మడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా మానసిక ఒత్తిడి.. ఆందోళన .. ఆత్మహత్యా సదృశ్య ధోరణులు కలిగిన సంక్లిష్టమైన పాత్రలే తనకు లభించాయన్నారు. అయితే వాటన్నింటినీ అధిగమించి వైవిధ్యమైన పాత్రలతో ఎలా ఎదిగారో ఆమె వివరించారు. కంగనా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన `గ్యాంగ్‌స్టర్`, అటుపై నటించిన `వో లమ్హే`, `ఫ్యాషన్` వంటి చిత్రాలలో ఆమె పాత్రలు ఎంతో భావోద్వేగంగా..మానసిక సంఘర్షణతో కూడినవే.
అప్పట్లో చిత్ర పరిశ్రమ తనను అలాంటి తీవ్రమైన..పాత్రలకే పరిమితం చేయడంతో? భవిష్యత్ లో కూడా అలాంటి పాత్రలే చేయాలనే ఆందోళన చెందినట్లు గుర్తు చేసింది. యువ నటిగా అంతటి బరువైన పాత్రల్లో మానసిక ఒత్తిడిని తట్టుకోవడం ఆ సమయంలో ఎంతో సవాలుతో కూడుకున్న విషయమని కంగనా అభి ప్రాయపడ్డారు. అయితే 2014లో విడుదలైన `క్వీన్` చిత్రం తన కెరీర్‌ను మలుపు తిప్పిందన్నారు. అంతవరకు డిప్రెసివ్ పాత్రలలో చూసిన ప్రేక్షకులు `రాణి` అనే ఒక మధ్యతరగతి అమాయక పంజాబీ అమ్మాయి పాత్రలో తనను చూసి ఎంతగానో ఆదరించారని గుర్తు చేసుకున్నారు.
ఈ చిత్రం తనపై ఉన్న పాత ముద్రను చెరిపేసిందని.. గంభీరమైన పాత్రలే కాకుండా హాస్యాన్ని నింపే పాత్రలను కూడా తాను అద్భుతంగా చేయగలనని పరిశ్రమకు నిరూపించడానికి `క్వీన్` ఒక వేదికగా నిలిచిందన్నారు. తన నటనా ప్రస్థానంలో ఎదురైన ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకున్నానన్నారు. అయితే ప్రారంభంలో చేసిన సంక్లిష్ట పాత్రలు తనలోని నటిని రాటుదేల్చాయని మానవ మనస్తత్వాలలోని విభిన్న కోణాలను అర్థం చేసుకోవడానికి అవి ఎంతగానో తోడ్పడ్డాయన్నారు. ఆ అనుభవమే తదుపరి కాలంలో `తను వెడ్స్ మను`, `మణికర్ణిక` వంటి విభిన్న జోనర్ల చిత్రాలలో నటించేందుకు మానసిక బలాన్ని, పరిణతిని ఇచ్చిందన్నారు.
ప్రస్తుతం కంగనా రనౌత్ నటిగానే కాకుండా సినిమా నిర్మాణంలోనూ..రాజకీయాలలోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. ఎన్నో వివాదాలు, ఆటంకాలు ఎదురైనప్పటికీ తనదైన శైలిలో చిత్రాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. గతంలో ఎదుర్కొన్న ఒత్తిళ్లే ఇప్పుడు సమాజంలో .. కెరీర్‌లో వచ్చే ఎలాంటి సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కంగనా నటిస్తోన్న `భారత్ భాగ్య విధాత` చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.