మోడ్రన్ వర్క్‌ప్లేస్‌ పై కంగనా ప్రశ్న… వర్కింగ్ మదర్స్‌కు సపోర్ట్ ఎక్కడ?

ప్రముఖ బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ మహిళల హక్కులు, వర్క్‌ప్లేస్ (పని ప్రదేశాలు) వాతావరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-06-11 02:45 GMT

ప్రముఖ బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ మహిళల హక్కులు, వర్క్‌ప్లేస్ (పని ప్రదేశాలు) వాతావరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫీసుల్లో పనిచేసే తల్లులకు అనుకూలమైన వాతావరణం ఉండాలని ఆమె గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఆధునిక కార్యాలయాలలో ప్రార్థనల కొరకు ప్రత్యేక గదులు కేటాయిస్తున్నప్పుడు, చిన్న పిల్లలను చూసుకోవడానికి 'చైల్డ్‌కేర్ స్పేసెస్' ఎందుకు ఏర్పాటు చేయడం లేదంటూ ఆమె వేసిన ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. వర్కింగ్ మదర్స్‌ పడే ఇబ్బందులపై ఆమె తనదైన శైలిలో స్పందించారు. ఆ వివరాలు చూద్దాం..

కెరీర్, కుటుంబం మధ్య నలిగిపోతున్న మహిళలు:

సమాజంలో మహిళలు కెరీర్‌లో ఎదగాలని కోరుకుంటున్నా, సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల వెనకబడిపోతున్నారని కంగనా అభిప్రాయపడ్డారు. ఆఫీసులు పిల్లలకు అనుకూలంగా లేకపోవడం వల్లే చాలా మంది మహిళలు పెళ్లి, పిల్లలు కాగానే ఉద్యోగాలను వదిలేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సరైన మద్దతు దొరక్కపోతే మహిళలు తమ కుటుంబం లేదా కెరీర్.. ఈ రెండింటిలో ఏదో ఒకదానిని మాత్రమే ఎంచుకోవాల్సిన దుస్థితి వస్తోందని, ఈ పద్ధతి మారాలని ఆమె వాదించారు.

నర్సుల కష్టాలపై కంగనా ఆవేదన:

సినిమాలు, రాజకీయాలనే కాకుండా సమాజంలోని వివిధ వర్గాల సమస్యలపై కంగనా రనౌత్ స్పందిస్తూ ఉంటారు. ఇటీవల ఆమె మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ముఖ్యంగా నర్సులు ఎదుర్కొంటున్న సవాళ్లపై తీవ్రంగా మాట్లాడారు. హాస్పిటల్స్‌లో రాత్రింబగళ్లు ప్రాణాలకు తెగించి రోగులకు సేవలు అందించే నర్సులకు తగిన గుర్తింపు, సరైన జీతం లభించడం లేదని ఆమె అన్నారు. ఇక వారి సేవలను కేవలం ఆర్థిక లావాదేవీల కోణంలో చూడటం కరెక్ట్ కాదని హితవు పలికారు.

అదృశ్య శ్రామిక శక్తికి గుర్తింపు ఇవ్వాలి:

ఆసుపత్రులలో కేవలం డాక్టర్లు, నర్సులు మాత్రమే కాదు, ఇంకా ఎంతో మంది కష్టపడుతుంటారని కంగనా గుర్తుచేశారు. వార్డ్ బాయ్స్, ఆయాలు, వాచ్‌మెన్ వంటి వారిని ఆమె ‘అదృశ్య శ్రామిక శక్తి’ గా అభివర్ణించారు. ఇక వీరు బయటకు కనిపించకపోయినా వీరి సేవలు ఎంతో కీలకమైనవని నొక్కిచెప్పారు. ఇక ప్రతి ఒక్కరి శ్రమకు సమాన గౌరవం, సరైన వేతనం అందినప్పుడే నిజమైన మార్పు వస్తుందని ఆమె స్పష్టం చేశారు.

మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న ఈ రోజుల్లో, వర్క్‌ప్లేస్‌లలో కూడా వారికి తగిన వసతులు కల్పించాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్లపై ఉంది. కంగనా రనౌత్ అడిగినట్లుగా, వర్కింగ్ మదర్స్ కోసం ఆఫీసుల్లో చిన్న పిల్లల కేర్ సెంటర్స్ ఏర్పాటు చేస్తే వారు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పని చేసుకోగలుగుతారు. అప్పుడే మహిళా సాధికారతకు నిజమైన అర్థం దక్కుతుంది. మరి కంగనా లేవనెత్తిన ఈ పాయింట్‌పై మోడ్రన్ ఆఫీసులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.

Tags:    

Similar News