AR రెహ్మాన్ గుడ్డివాడు.. ఫిరంగి విసిరిన క్వీన్ కంగన
ఇటీవల లెజెండరీ సంగీత దర్శకుడు, ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహ్మాన్ `మత వివక్ష` వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.;
ఇటీవల లెజెండరీ సంగీత దర్శకుడు, ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహ్మాన్ `మత వివక్ష` వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలలో దీనిపై బిగ్ డిబేట్ నడుస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా బాలీవుడ్ నటి- ఎంపీ కంగనా రనౌత్ సూటిగా ఏఆర్ రెహ్మాన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ముక్కనుమ పండగ (జనవరి 17) రోజున కంగన తన ఇన్‌స్టా వేదికగా రెహమాన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ఈ వివాదం పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఏఆర్ రెహ్మాన్ బాలీవుడ్‌లో `మతపరమైన వివక్ష` ఉందని, అందుకే తనకు అవకాశాలు తగ్గుతున్నాయనే అర్థం వచ్చేలా మాట్లాడారు. దీనిపై స్పందించిన క్వీన్ కంగనా సూటిగా రెహ్మాన్‌ను టార్గెట్ చేస్తూ ఘాటైన పోస్ట్ చేశారు. మీకంటే ద్వేషపూరితమైన వ్యక్తిని చూడలేదు! అంటూ కంగన ఫైరయ్యారు. ``నేను ఒక రాజకీయ పార్టీకి (బీజేపీ) మద్దతు ఇస్తున్నందున పరిశ్రమలో ఎంతో వివక్ష ఎదుర్కొంటున్నాను. కానీ మీకంటే ఎక్కువ పక్షపాతం చూపే, ద్వేషపూరితమైన వ్యక్తిని నేను ఇప్పటివరకు చూడలేదు`` అని కంగనా ఫైరయ్యారు.
తాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన `ఎమర్జెన్సీ` సినిమాకు రెహమాన్ ని సంప్రదిస్తే, తనకు సహకరించలేదని, నిర్ధయగా తిరస్కరించాడని కంగన ఆరోపించారు. తన సినిమాకు సంగీతం అందించాల్సిందిగా కోరుతూ కథ వినిపించడానికి రెహ్మాన్‌ను సంప్రదించానని, కానీ కనీసం తనను కలవడానికి కూడా నిరాకరించారని కంగనా వెల్లడించారు. ఆ సినిమా ఒక `ప్రొపగాండా` అని విమర్శిస్తూ, దానికి దూరంగా ఉన్నారని కంగన ఆరోపించారు.
అయితే ఎమర్జెన్సీ సినిమాను విమర్శకులు `మాస్టర్ పీస్` అని మెచ్చుకున్నారని, ప్రతిపక్ష నేతలు కూడా అభినందించారని.. కానీ రెహ్మాన్ మాత్రం తన ద్వేషంతో గుడ్డివాడైపోయారని ఆమె మండిపడ్డారు. ఇదే క్రమంలో ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాపై కూడా కంగనా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిర దర్శనం సమయంలో మసాబా గుప్తా తనకు చీర ఇవ్వడానికి నిరాకరించిందని, ఆ అవమానంతో తాను కారులోనే ఏడ్చానని కంగనా గుర్తు చేసుకున్నారు. రాజకీయ భావజాలం కారణంగా తనను దూరం పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది?
తాను సంగీతం అందించిన తాజా చిత్రం `చావా` గురించి మాట్లాడుతూ ఏ.ఆర్ రెహమాన్ `విభజనను ప్రేరేపించే సినిమా` అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే కంగనా ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇప్పుడు మత వివక్ష వ్యాఖ్యలు చేయగానే కంగన రెహ్మాన్‌పై డైరెక్ట్ ఎటాక్ స్టార్ట్ చేసారు. ప్రస్తుతం ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కంగనా చేసిన ఈ ఆరోపణలపై ఏఆర్ రెహమాన్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.