KH x RK : రజనీ- కమల్ పారితోషికంలో దిగొచ్చారా?
స్నేహంలోనే కాదు, పారితోషికాలు పంచుకోవడంలోను స్నేహితులు కమల్ హాసన్, రజనీకాంత్ సమానంగా ఆలోచిస్తున్నారా? అంటే అవుననే తమిళ మీడియాలో కథనాలొస్తున్నాయి.;
స్నేహంలోనే కాదు, పారితోషికాలు పంచుకోవడంలోను స్నేహితులు కమల్ హాసన్, రజనీకాంత్ సమానంగా ఆలోచిస్తున్నారా? అంటే అవుననే తమిళ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఈ సూపర్ సీనియర్లు నటిస్తున్న KH x RK చిత్రానికి సమాన పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్ మనవడు, తమిళ హీరో ఉదయనిది స్టాలిన్ కుమారుడు అయిన ఇన్బన్ స్టాలిన్ కేవలం 21 ఏళ్ల వయసుకే సినీనిర్మాతగా మారాడు. ఇన్బన్ మరోవైపు నటుడిగాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు.. ఇప్పుడు ఏకంగా కమల్ - రజనీకాంత్ కాంబినేషన్ సినిమాని నిర్మిస్తూ చర్చల్లోకొచ్చాడు...
రెడ్ జియాంట్ మూవీస్ కొత్త సీఈవోగా బాధ్యతలు తీసుకున్న వెంటనే అగ్ర హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నాడు. ఈ యువకుడు రజనీకాంత్, కమల్ హాసన్ లకు ఎంతో గౌరవప్రదమైన పారితోషికాలు ఆఫర్ చేసాడంటూ కోలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే.. రజనీకాంత్ -కమల్ హాసన్ భారతీయ చలనచిత్ర రంగానికి రెండు కళ్లు. దాదాపు 48 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపించబోతుండటం ఇండస్ట్రీలోనే అతిపెద్ద సంచలనం. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఒక చారిత్రక సామాజిక-రాజకీయ కలయికగా కనిపిస్తోందనే చర్చ సాగుతోంది.
దిగ్గజ హీరోల పారితోషికాలు, ఈ సినిమా వెనుక ఉన్న ఆసక్తికర విషయాల్లోకి వెళితే.. ఈ సినిమాలో వీరిద్దరికీ ఇచ్చే పారితోషికం గురించి సోషల్ మీడియాలో రెండు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం.. వీరిద్దరూ స్నేహానికి విలువనిస్తూ సమానమైన పారితోషికం తీసుకోవడానికి మొగ్గు చూపినట్లు సమాచారం. అది ఒక్కొక్కరికి సుమారు రూ.70 కోట్ల నుంచి రూ.75 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.
అయితే కొన్ని తమిళ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్, మార్కెట్ దృష్ట్యా.. పారితోషికం కంటే కూడా లాభాల్లో వాటా ఉండే అవకాశం ఉంది. సినిమా బడ్జెట్ రూ.500 కోట్లు దాటే అవకాశం ఉన్నందున రజనీ రేంజ్ పారితోషికం రూ.200 కోట్లు దాటే అవకాశం ఉందని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఇద్దరు లెజెండ్స్ తెరపై సమాన ప్రాధాన్యతతో కనిపిస్తారనేది వాస్తవం.
పారితోషికాల్లో తగ్గడం సాధ్యమా?
అయితే రజనీకాంత్, కమల్ హాసన్ పారితోషికాలు 100 కోట్లు మించిపోయాయని చాలా కాలంగా కథనాలొస్తున్నాయి. రజనీకాంత్ అత్యధికంగా 220కోట్లు పైగా వసూలు చేసారని కథనాలొచ్చాయి. అయితే ఇప్పుడు 70 కోట్లకు ఎలా పడిపోయారు? అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. అయితే బడ్జెట్ అదుపు కోసమే ఒక ప్లాన్ ఉంది. ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నప్పుడు కేవలం పారితోషికాలకే వందల కోట్లు పెట్టాలి. ఇది ఒకే నిర్మాత భరించడం కష్టం. అందుకే స్టార్లకు 70కోట్ల పారితోషికం ఫిక్స్ చేసి లాభాల్లో వాటాలను కట్టబెట్టారని తెలుస్తోంది.
48 ఏళ్ల తర్వాత..
ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి `జైలర్` ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తుస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. వీరిద్దరూ చివరిగా 1979లో `అల్లావుద్దీనుమ్ అల్బుత విలక్కుమ్` చిత్రంలో కలిసి నటించారు. మళ్ళీ దాదాపు 48ఏళ్లకు ఈ అద్భుతం జరగబోతోంది.
సీఎం మనవడు 21 ఏళ్లకే భారీ అడుగు:
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ మనవడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కుమారుడైన `ఇన్బన్ స్టాలిన్` ఇటీవల నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. అతడు కేవలం 21 ఏళ్ల వయసులోనే `రెడ్ జియాంట్ మూవీస్` సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఉదయనిధి స్టాలిన్ రాజకీయాల్లో బిజీ కావడంతో.. ఫ్యామిలీ లెగసీని ఇన్బన్ ముందుకు తీసుకెళ్తున్నారు. కమల్ - రజనీల కాంబినేషన్ సెట్ చేయడం ద్వారా తన కెరీర్‌ను గ్రాండ్ లెవల్‌లో మొదలుపెట్టారు. ఇన్బన్ కేవలం నిర్మాతగానే కాదు.. నటనలోను శిక్షణ తీసుకుంటున్నారని.. త్వరలోనే మారి సెల్వరాజ్ వంటి దర్శకులతో సినిమా చేసే అవకాశం ఉందని టాక్.