గుసగుస: టాలీవుడ్ స్టార్లపై కమల్‌హాసన్ ఆసక్తి
విశ్వనటుడు కమల్ హాసన్ టాలీవుడ్ స్టార్లతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నారా? అంటే అవుననే సమాచారం.;
విశ్వనటుడు కమల్ హాసన్ టాలీవుడ్ స్టార్లతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నారా? అంటే అవుననే సమాచారం. ఆయన ఓవైపు నటుడిగా, మరోవైపు నిర్మాతగా కెరీర్ ని ప్రణాళికాబద్ధంగా నడిపిస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ విక్రమ్ సంచలన విజయం సాధించాక కమల్ గేమ్ ప్లాన్ పూర్తిగా మారిపోయింది. తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించేందుకు కమల్ ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే తన బ్యానర్ లో స్నేహితుడు రజనీకాంత్ కథానాయకుడిగా ఒక సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతలోనే శివకార్తికేయన్ తో కలిసి తన బ్యానర్ లో రెండో ప్రాజెక్టును లాంచ్ చేసారు. అమరన్ తో గొప్ప విజయం అందుకున్న శివకార్తికేయన్ తదుపరి కమల్ కి చెందిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో `సియోన్` అనే చిత్రంలో నటిస్తున్నాడు. శివకుమార్ మురుగేషన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌కి అద్భుత స్పందన వచ్చింది.
కమల్ ఇదే సమయంలో తన ప్రయత్నాలను మరింత విస్త్రత పరిచే దిశగా ఉన్నారు. రాజ్ కమల్ బ్యానర్ పోర్ట్ ఫోలియోను వేగంగా విస్తరిచేందుకు అతడు మునుముందు పలువురు పాన్ ఇండియా స్టార్లతో సినిమాలు తీయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. అంతేకాదు భారతదేశంలోని అన్ని సినీపరిశ్రమలు టాలీవుడ్ లో ఏం జరుగుతోందో ఆసక్తిగా గమనిస్తూ, టాలీవుడ్ స్టార్లతో సినిమాలు నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్న ఈ తరుణంలో, ఇప్పుడు కమల్ హాసన్ చూపు కూడా టాలీవుడ్ లోని పలువురు పాన్ ఇండియా హీరోలపై పడిందని తెలుస్తోంది.
`కల్కి 2898 AD` సమయంలో ప్రభాస్‌తో ఏర్పడిన సాన్నిహిత్యం వల్ల కమల్ హాసన్ ఒక ప్రాజెక్ట్ గురించి చర్చించారని కూడా గుసగుస వినిపించింది. పాన్ ఇండియాలో అదరగొడుతున్న అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్లతో కూడా భారీ మల్టీస్టారర్ సినిమాలను నిర్మించేందుకు కమల్ హాసన్ ఆసక్తి చూపుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ కాంబినేషన్స్ ఉండే అవకాశం ఉందని గుసగుస వినిపిస్తోంది.
కమల్ హాసన్ కి ఉన్న అసాధారణ చరిష్మా దృష్ట్యా స్టార్లు ఆయనతో కలిసి పని చేసేందుకు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటారు. అయితే నేడు పాన్ ఇండియా స్టార్లుగా పాపులరైన అరడజను తెలుగు స్టార్లు వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. భారతదేశంలోని బెస్ట్ డైరెక్టర్లతో మన స్టార్లకు కమిట్ మెంట్లు ఉన్నాయి. అందువల్ల కమల్ హాసన్ లాంటి నిర్మాతకు వెంటనే అవకాశం దొరకడం కష్టమే. అయితే మంచి స్క్రిప్టు ఏదైనా డిసైడ్ చేస్తుంది. ప్రభాస్ - కమల్ హాసన్ కాంబినేషన్‌లో కల్కి 2898 ఏడి కుదిరినట్టే, చరణ్- కమల్ హాసన్, ఎన్టీఆర్- కమల్ హాసన్, అల్లు అర్జున్ - కమల్ హాసన్ ప్రాజెక్టులు కుదరాలంటే మంచి స్క్రిప్టు కుదరాలి. దానిని కనుగొనే దర్శకరచయితలు అవసరం. ఇటీవల ప్రాంతీయ సినిమా గ్లోబల్ మార్కెట్ ని అందిపుచ్చుకున్న తీరు చూసాక దర్శకనిర్మాతల్లో చాలా ఉత్సాహం ఉంది.
కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటుడితో కలిసి పని చేస్తే చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్లకు అది ఎంతో గౌరవాన్ని పెంచుతుంది. అలాగే వారి నటనా నైపుణ్యాలను మరింత గొప్పగా విస్తరించుకునేందుకు ఇది దోహదపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కమల్ హాసన్ జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారాలు అందుకున్నారు. పుష్ప చిత్రంలోని నటనకు గాను అల్లు అర్జున్ కి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్లు జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించే గొప్ప ప్రదర్శనలు ఇచ్చారు. అందువల్ల ఈ కాంబినేషన్లు వర్కవుట్ కావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. స్క్రిప్టుల పరంగా ఎలాంటి ప్రయోగాలకు అయినా ఇప్పుడు ఆస్కారం ఉంది. మారిన ట్రెండ్ లో దర్శకరచయితలు ప్రయోగాత్మక స్క్రిప్టులతో కమల్ హాసన్ ని సంప్రదిస్తే దీనికి ఆస్కారం లేకపోలేదు.
నటనా కెరీర్ పరంగా చూస్తే, కమల్ హాసన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం KH 237 అనే పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రీకరణలో ఉంది. లోకేష్ కనగరాజ్ తో కలిసి విక్రమ్ 2, నాగ్ అశ్విన్ తో కలిసి కల్కి 2898 ఏడి సీక్వెల్ చిత్రాలు చేయాల్సి ఉంది.
గతాన్ని పరిశీలిస్తే, నిజానికి అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించడం కమల్ కి ఇప్పుడే కొత్త కాదు. గతంలో కమల్ హాసన్ తన బ్యానర్‌లో కేవలం తనే నటించడం కాకుండా ఇతర హీరోలకు కూడా అవకాశాలిచ్చారు. సత్యరాజ్ తో `కడమై కన్నియమ్ కట్టుపాడు` (1987) అనే చిత్రాన్ని నిర్మించారు. అర్జున్ ప్రధాన పాత్రలో కురుతిపునల్ (ద్రోహి - 1995) చిత్రాన్ని నిర్మించారు. మాధవన్ ప్రధాన పాత్రలో `నల దమయంతి` (2003) అనే చిత్రాన్ని రూపొందించారు. టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్, మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ లను కలుపుతూ ఈనాడు` (ఉన్నైపోల్ ఒరువన్) (2009) అనే ప్రయోగాత్మక చిత్రాన్ని కమల్ నిర్మించారు. విక్రమ్ కథానాయకుడిగా `కడారం కొండన్` (మిస్టర్ KK - 2019) కూడా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో తెరకెక్కింది. ఇక శివకార్తికేయన్ కథానాయకుడిగా కమల్ హాసన్ నిర్మించిన `అమరన్` (2024) సంచలన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద 400 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ కథానాయకుడిగా కమల్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే రజనీతో కలిసి నటించే ప్రాజెక్ట్ గురించి ప్రయత్నాలు సాగుతున్నాయి.
నిర్మాతగా కమల్ హాసన్ ప్రయాణం చాలా సాహసోపేతమైనది. రాజ పార్వై (1981), అపూర్వ సహోదరులు, తేవర్ మగన్, హే రామ్, విశ్వరూపం వంటి సాంకేతికంగా అత్యున్నత చిత్రాలను అందించారు. తేవర్ మగన్ సినిమాకి నిర్మాతగా జాతీయ అవార్డును అందుకున్నారు.