కోలీవుడ్, టాలీవుడ్ కాదు.. మనది 'ఇండియన్ సినిమా': కమల్ హాసన్

తన‌ గురువు.. మార్గదర్శి అయిన ద‌ర్శ‌క‌దిగ్గ‌జం సింగీతం శ్రీనివాసరావు గురించి కమల్ హాసన్ ఎంతో గౌరవంగా మాట్లాడారు.;

Update: 2026-03-20 04:33 GMT

కోలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేదు.. ఇప్పుడు మ‌న‌ది ఒకే ఒక్క ఇండియ‌న్ సినిమా అని వ్యాఖ్యానించారు విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్. గద్దర్ అవార్డ్స్ వేడుకలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమను ప్రాంతీయ సరిహద్దుల్లో చూడకూడదని పిలుపునిచ్చారు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లేదా శాండల్‌వుడ్ వంటి విభజనలు ఇకపై ఉండకూడదని.. మనమంతా కలిసి `ఇండియన్ సినిమా`గా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సరిహద్దులను చెరిపివేసి అందరినీ ఏకం చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన అభినందించారు. రేపటి తరానికి భారతీయ సినిమాను ఒక గొప్ప ఊరేగింపులా తీసుకువెళ్లడంలో తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

తన‌ గురువు.. మార్గదర్శి అయిన ద‌ర్శ‌క‌దిగ్గ‌జం సింగీతం శ్రీనివాసరావు గురించి కమల్ హాసన్ ఎంతో గౌరవంగా మాట్లాడారు. సింగీతంతో తనకు 50 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉందని.. ఆయన తన తండ్రి పేరు (శ్రీనివాసన్)ను గుర్తు చేస్తార‌ని .. తాను కలిసిన అత్యంత `యంగెస్ట్ సీనియర్` అని కొనియాడారు. `సొమ్మొకడిది సోకొకడిది` సినిమా సమయంలో ఆయన చేసిన కష్టానికి ఫలితంగా తనకు గౌరవం దక్కిందని గుర్తు చేసుకుంటూ.. అప్పట్లోనే గద్దర్ గారు కూడా ఆ సినిమాలో పనిచేయడం ఒక మధుర జ్ఞాపకమని పేర్కొన్నారు.

మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని కమల్ హాసన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. చిరంజీవి గారు నాకు సోదరుడి వంటి వారు. మేమిద్దరం 70వ దశకంలోనే హీరోలుగా ఎదిగాము అని తెలిపారు. రాజకీయాల్లో చిరంజీవి తనకు సీనియర్ అని, అయితే సినిమా రంగంలో మాత్రం తనే సీనియర్ (చిరంజీవి జూనియర్) అని సరదాగా వ్యాఖ్యానించారు. వీరిద్దరి మధ్య ఉన్న ఈ పరస్పర గౌరవం వేదికపై ఉన్న వారందరినీ ఆకట్టుకుంది.

ప్రజా యుద్ధనౌక గద్దర్ పై తనకున్న అభిమానాన్ని కమల్ హాసన్ చాటుకున్నారు. గద్దర్ కి ఉన్న మిలియన్ల మంది అభిమానుల్లో తాను కూడా ఒకడినని ఆయన గర్వంగా చెప్పుకున్నారు. గద్దర్ పేరుతో అవార్డులను నెలకొల్పడం ద్వారా ఒక విప్లవ కవిని, కళాకారుడిని గౌరవించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 45 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చిన రోజులను గుర్తు చేసుకుంటూ.. ఈ పురస్కారం కళాకారులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.

హైదరాబాద్‌తో తనకున్న ప్రత్యేక బంధాన్ని కమల్ హాసన్ మరోసారి గుర్తు చేసుకున్నారు. తాను 16 ఏళ్ల వయసులో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇక్కడికే వచ్చానని.. మ‌ద్రాసులో తనతో ఉన్న సినీ కుటుంబం కేవలం ఇల్లు మారి హైదరాబాద్‌కు వచ్చిందని.. పరిశ్రమ మాత్రం ఒక్కటేనని ఆయన అభివర్ణించారు. నంది అవార్డులను తిరిగి పునరుద్ధరించడం.. గద్దర్ అవార్డులను ప్రవేశపెట్టడం వంటి చర్యలు సినిమా పరిశ్రమకు కొత్త ఊపిరి పోస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News