ఆ విషయంలో ఖాన్‌లను కొట్టేసిన కమల్ హాసన్
విశ్వనటుడు కమల్ హాసన్ ఏజ్ లెస్ హీరోగా ఇప్పటికీ ఎనర్జీతో కనిపిస్తున్నారు. ఇటీవల విక్రమ్, కల్కి 2898 ఏడి, థగ్ లైఫ్ వంటి చిత్రాలలో విజృంభించి నటించాడు.;
విశ్వనటుడు కమల్ హాసన్ ఏజ్ లెస్ హీరోగా ఇప్పటికీ ఎనర్జీతో కనిపిస్తున్నారు. ఇటీవల విక్రమ్, కల్కి 2898 ఏడి, థగ్ లైఫ్ వంటి చిత్రాలలో విజృంభించి నటించాడు. కల్కి 2898 ఏడి సీక్వెల్ సహా మునుముందు రాబోతున్న సినిమాల్లో అతడి నట విశ్వరూపం చూసేందుకు అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
అయితే ఆయన ఈ ఏజ్ లోను ఇంత ఫిట్ గా ఎలా ఉండగలడు? అభిమానుల బుర్రల్ని తొలిచేస్తున్న ప్రశ్న ఇది. దీనికి జవాబు తెలుసుకోవడం సులువే. కానీ దానిని ఆచరించడం ఎంత కష్టమో అంచనా వేయాలి. నిజానికి భారతీయ సినిమా తోపులం అని చెప్పుకునే ఖాన్‌ల కంటే కమల్ హాసన్ ఫిట్ గా కనిపించడం ఆశ్చర్యకరం. ఖాన్ ల కంటే 10 ఏళ్లు పెద్దవాడైనా ఇప్పటికీ ఎనర్జిటిక్ హీరోగా కనిపించడం వెనక ఆయన క్రమశిక్షణను గుర్తించాలి. ఇప్పటికీ పర్ఫెక్ట్ యోగా, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసే హీరో అతడు. నిరంతరం జిమ్ కి వెళతారు. ఆ తర్వాత ధ్యానం అస్సలు విడిచిపెట్టరు.
ఉదయం జిమ్ లో దినచర్య ప్రారంభమవుతుంది. క్రంచెస్, వెయిట్ లిఫ్టింగ్, షోల్డర్ వ్యాయామాలు సహా 1-2 గంటల పాటు జిమ్ చేస్తాడు. షూటింగుల్లో ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా అతడు కసరత్తులు ఆపడు. స్థిరంగా ఉండటానికి ఎల్లప్పుడూ శారీరక శ్రమ చేస్తాడు. ఇక ఆహారంతో సమతుల్యత అతడు ఫిట్ గా ఉండటానికి సహకరిస్తుంది. మొత్తం శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కమల్ హాసన్ ప్రతిరోజూ 30 నిమిషాలు యోగా సాధన చేస్తాడు. మానసిక దృఢత్వం కోసం ధ్యానం విడిచిపెట్టడు. ధ్యానం అతనికి స్పష్టత, ప్రశాంతతను ఇస్తుంది. నిరంతర యవ్వన శక్తి వస్తుంది. కమల్ హాసన్ ఉదయం నడకను ఇష్టపడతాడు. అతడు షేపవుట్ అవ్వకుండా ఉండటానికి క్రమం తప్పకుండా 14 కి.మీ నడుస్తారు.
వీటన్నిటితో పాటు సమతుల ఆహారం తీసుకుంటాడు. భోజనంలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అతను ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, ఆల్కహాల్‌ను తీసుకోడు. తేలికైన ఆరోగ్యకరమైన భోజనం ఇష్టపడతాడు. అల్పాహారం, తృణధాన్యాలు, పండ్లతో ప్రోటీన్ డైట్ తీసుకుంటాడు. అయితే రాత్రి భోజనం జీర్ణక్రియ మొత్తం సలువుగా జరిగేలా జాగ్రత్త పడతాడు. క్రమం తప్పకుండా జిమ్, యోగా, ధ్యానంతో పాటు ఆహార నియమాలను పాటించడం, నీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కమల్ హాసన్ ఇప్పటికీ ఫిట్ గా ఉన్నారు. ఏజ్ లెస్ హీరోగా అతడు ఎప్పటికీ హృదయాలను గెలుచుకుంటున్నారు. కల్కి 2898 ఏడి సీక్వెల్ లో కమల్ హాసన్ విశ్వరూపం చూడబోతున్నామని అందరూ భావిస్తున్నారు. ఈరోజు కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా అశ్వనిదత్ బృందం మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ `కల్కి 2898 ఏడి` గురించిన ఏదైనా విషయం చెబుతారేమో చూడాలి.