ఆటో రిక్షాలో అనామకుడిగా పోయేవాడిని: కమల్ హాసన్
భారతీయ సినిమా చరిత్రలో అత్యుత్తమ కథానాయకుల్లో కమల్ హాసన్ ఒకరు. బాలీవుడ్ మేటి కథానాయకులకు సైతం ఆయన పోటీనిచ్చారు ఆరోజుల్లో;
భారతీయ సినిమా చరిత్రలో అత్యుత్తమ కథానాయకుల్లో కమల్ హాసన్ ఒకరు. బాలీవుడ్ మేటి కథానాయకులకు సైతం ఆయన పోటీనిచ్చారు ఆరోజుల్లో. నిజానికి బాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా ఉండాల్సిన కమల్ కొన్ని కారణాల వల్ల కేవలం సౌత్ కి పరిమితమవ్వాల్సి వచ్చింది. కానీ ఆయన ఖ్యాతి బాలీవుడ్ ని మించి. అతడు విశ్వనటుడిగా తనను తాను ఆవిష్కరించుకున్నాడు. అన్ని పరిశ్రమల్లో గౌరవం అందుకున్నాడు.
ఇటీవల `కల్కి 2898 ఏడి`లో అద్భుత నట ప్రదర్శనతో కట్టి పడేసిన కమల్ హాసన్ తదుపరి మణిరత్నం దర్శకత్వంలో `థగ్ లైఫ్` అనే ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ లోగానే కమల్ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభ రోజుల గురించి ఆసక్తికర విషయాలను మాట్లాడారు.
తన యవ్వనంలో ఒక మంగలి షాపులో క్షురకుడిగా పని చేసానని కమల్ హాసన్ తెలిపారు. నేను దినపత్రికల్లో సినిమా వార్తలు చదవడం, సినిమాలు చూడటంతోనే ఎక్కువ సమయం వృధా చేస్తున్నానని నా తల్లి అనేది. కాబట్టి ఆమెను అవమానించేందుకు నేను మంగలి షాపులో క్షురకుడిగా మారాను అని గుర్తు చేసుకున్నారు. తన తల్లిపై ఉద్యమం నడిపించేందుకు ఇలా చేసానని కమల్ అన్నాడు. నిజానికి నాకు గురువు బాలచందర్ అని మీరు అనుకుంటారు. కానీ అంతకుముందే నాకు బార్బర్ షాప్ లో గురువు ఉన్నాడని కమల్ అన్నారు.
19 వయసులో తన గురువు బాలచందర్ తో దర్శకుడు కావాలని కలలు కన్నానని కమల్ చెప్పారట. కానీ బాలచందర్ తనలో ఇంకేదో చూశారు. ``నువ్వు దర్శకుడివైతే జీవితాంతం ఆటో రిక్షాల్లో తిరుగుతూనే ఉంటావు`` అని గురూజీ అన్నారు. ఆటో నడపడం మర్చిపోమన్నారు.. నేను ఆయన సలహా తీసుకోకపోతే బహుశా ఏదో ఒక ఆటోలో వెళుతూ చనిపోయేవాడిని! అని కూడా కమల్ నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు. నాకంటే ప్రతిభావంతులైన నా స్నేహితులు చాలామంది వీధుల్లో మరణించారని కమల్ విచారంగా అన్నాడు. నేను బాలచందర్‌కు కృతజ్ఞుడను. నేను ఆయన సూచించిన దారిలో వెళ్ళగలిగాను. నెరవేరని కలలతో మరణిస్తే.. ఆ ఆటో రిక్షాలో మృతదేహం ఉందని ఎవరికీ తెలియదు అని కూడా కమల్ అన్నారు.