టాప్ స్టోరి: ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విలన్స్ హవా
సహజంగా వికలాంగుడు లేదా బదిరుడు హీరో అయితే ఎలా ఉంటుందో ఇటీవలి కొన్ని సినిమాల్లో చూసాం. చెవులు వినిపించని చిట్టిబాబుగా `రంగస్థలం`లో రామ్ చరణ్ నటనను మర్చిపోలేం.;
సహజంగా వికలాంగుడు లేదా బదిరుడు హీరో అయితే ఎలా ఉంటుందో ఇటీవలి కొన్ని సినిమాల్లో చూసాం. చెవులు వినిపించని చిట్టిబాబుగా `రంగస్థలం`లో రామ్ చరణ్ నటనను మర్చిపోలేం. రాజా ది గ్రేట్ లో రవితేజ అంధుడిగా కనిపించాడు. నీవెవరో, అంధగాడు లాంటి చిత్రాల్లో ఆది పినిశెట్టి, రాజ్ తరుణ్ కూడా అంధ పాత్రల్లో నటించి మెప్పించారు. ఊపిరి చిత్రంలో కింగ్ నాగార్జున వీల్ చైర్ కి అంకితమైన లైఫ్ టైమ్ వికలాంగుడిగా అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఇలాంటి మరెన్నో పాత్రల్లో మన తెలుగు హీరోలు మెప్పించారు.
కానీ అందుకు భిన్నంగా విలన్లు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పాత్రల్లో నటిస్తే ఎలా ఉంటుందో ఇటీవల మన దర్శకులు తెరపై ఆవిష్కరిస్తున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి `బాహుబలి` చిత్రంలో వీరాధివీరుల పాత్రలను ఆవిష్కరించడంలోనే కాదు, పుట్టుకతోనే ఒక చేయి పని చేయని వికలాంగుడిగా బిజ్జల దేవుడి (నాజర్) పాత్రను క్రియేట్ చేసాడు. నాజర్ ఈ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించారు. బాహుబలిలో కట్టప్ప పాత్రకే కాదు బిజ్జల దేవుడి పాత్రకు మంచి గుర్తింపు దక్కడంపై సీనియర్ నటుడు నాజర్ చాలా ఆనందం వ్యక్తం చేసారు. ఆ తర్వాత మన దర్శకులు వరుసగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పాత్రలతో విలనీలు చేయిస్తున్నారు.
బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన `కల్కి 2898 ఏడి` చిత్రంలో కమల్ హాసన్ పాత్ర పూర్తి ప్రయోగాత్మకమైనది. పూర్తిగా శరీరం లేని పాక్షికంగా అవయవాలతో కనిపించే సుప్రీం యాస్కిన్ పాత్ర భారతదేశ సినిమా హిస్టరీలోనే ఒక అసాధారణ ప్రయోగం. కమల్ హాసన్ కనిపించేది పరిమిత సమయమే అయినా అతడు ప్రేక్షకుడి మస్తిష్కంపై మాయాజాలం సృష్టించాడు. కల్కి 2898 AD ఒక డిస్టోపియన్ భవిష్యత్తులో సాగే కథాంశం. అక్కడ సుప్రీం యాస్కిన్ (కమల్ హాసన్) తన ప్రపంచాన్ని - కాంప్లెక్స్‌ను నియంత్రిస్తాడు. రూపం అన్నదే లేని వాడిగా యాస్కిన్ పాత్ర పరిచయం, ఎస్టాబ్లిష్ మెంట్ ఎంతో అందంగా కుదిరింది. ఇక కల్కి పార్ట్ 2లో అతడి నటవిశ్వరూపాన్ని చూస్తారని నాగ్ అశ్విన్ బృందం లీకులు ఇచ్చింది. తదుపరి ప్రభాస్ కాల్షీట్లు అందుబాటులోకి రాగానే నాగ్ అశ్విన్ ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ సినిమాని తెరకెక్కిస్తారు. ఏది ఏమైనా విలక్షణ నటుడు కమల్ హాసన్ ఒక వికలాంగుడిగా అవయవ సౌష్టవం లేనివాడిగా అద్భుత ఆహార్యంతో రక్తి కట్టించారు. దీనికోసం ప్రోస్థటిక్స్ ఎలా ఉపయోగించారో మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే కమల్ హాసన్ పాత్ర చాలా ఇతర సినిమాలు తెరకెక్కించే దర్శకులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇప్పుడు మహేష్- రాజమౌళి మూవీలో కుంభ పాత్ర పరిచయంతో ఈ విషయంపై చాలా క్లారిటీ వచ్చింది. ఈ ఫిక్షన్ చిత్రంలో కఠోరమైన విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంపిక సాహసోపేతమైనది. పైగా అతడిని పోలియో సమస్యతో కాళ్లు చేతులు పని చేయని వాడిగా.. ఒక మెషీన్ ద్వారా తనను తాను ఆపరేట్ చేసుకునే వాడిగా రాజమౌళి ఆవిష్కరిస్తున్నారు. పృథ్వీరాజ్ పాత్ర `కుంభ` లుక్ రిలీజ్ కాగానే ఈ లుక్ పై సినీప్రముఖులు ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. ఈ పాత్రలో తన సోదరుడిని చూడటానికి వేచి ఉండలేనని వ్యాఖ్యానించాడు. అతడి లుక్‌పై ఒబెరాయ్ ప్రశంసలు కురిపించాడు. ఫారెస్ట్ అడ్వెంచర్ కాన్సెప్ట్ తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ పాత్రను చూడగానే `అవతార్` లో విలన్ పాత్రధారి గుర్తుకు రాకుండా ఉండడు. అంతరిక్షం నుంచి పండోరా గ్రహంపైకి ఊడిపడే ప్రమాదకర విలన్ గా నటుడు మైల్స్ నటవిశ్వరూపం చూపించాడు. పూర్తిగా రోబోటిక్ మెషీన్స్ తో అవతార్ గ్రహంపై దండయాత్ర నేపథ్యంలో కథాంశం, విలన్ పాత్ర రక్తి కట్టిస్తాయి. అయితే రాజమౌళి రూపొందిస్తున్న ఎస్.ఎస్.ఎం.బి 29లో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర వికలాంగుడి లుక్ తో దానికి పూర్తి భిన్నంగా ఉండబోతోందని అర్థమవుతోంది.