కల్కి సీక్వెల్ లో జేడీ చక్రవర్తి ఉన్నారా? అసలు నిజమేంటి?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అయిందో తెలిసిందే.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అయిందో తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ అందుకుని భారీ వసూళ్లు సాధించింది. ఆ విజయంతో ఇప్పుడు అందరి దృష్టి సీక్వెల్ పై పడింది.
మొదటి భాగం క్లైమాక్స్ ఆసక్తికరంగా ముగియడంతో, కథ ఇకపై ఎటు దిశగా సాగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. ముఖ్యంగా కర్ణుడి పాత్రతో ముగిసిన ఎండింగ్ కారణంగా సీక్వెల్ లో పురాణాలకు మరింత ప్రాధాన్యం ఉండొచ్చనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీక్వెల్ పై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. దీంతో రోజుకొక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇదిలా ఉండగా.. కల్కి పార్ట్-2 షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఫస్ట్ షెడ్యూల్ ను ప్రభాస్ లేకుండానే హైదరాబాద్ లో మేకర్స్ నిర్వహించినట్టు సమాచారం. ఆ షెడ్యూల్ లో ముఖ్యంగా బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ పాల్గొని కీలక సన్నివేశాల చిత్రీకరణలో భాగమయ్యారని తెలుస్తోంది. ఆయన పాత్రకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సీన్స్ ను చిత్రీకరించినట్టు టాక్ వినిపిస్తోంది.
అదే సమయంలో మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, అమితాబ్ బచ్చన్ తో పాటు స్టార్ యాక్టర్ జేడీ చక్రవర్తి ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లో పాల్గొన్నారని ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఆయన పాత్రపై ఆసక్తికరమైన ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ఆయన ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ లో భాగం కాలేదని, షూటింగ్ లో కూడా పాల్గొనలేదని సమాచారం.
మరోవైపు, ప్రభాస్ త్వరలోనే కల్కి పార్ట్-2 సెట్స్ లోకి అడుగుపెట్టనున్నారని సమాచారం. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈసారి మరింత భారీ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్లు, విజువల్ ఎఫెక్ట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొదటి భాగం కంటే రెండో భాగాన్ని విజువల్స్ పరంగా మరింత గ్రాండ్ గా తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. లోకనాయకుడు కమల్ హాసన్ సీక్వెల్ లో ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనుండడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. సీక్వెల్ కు కర్ణ 3102 బీసీ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మొదటి భాగంలో కర్ణుడి పాత్రకు ఇచ్చిన ఇంపార్టెన్స్ తో రెండో భాగం మొత్తం ఆ రోల్ చుట్టూనే తిరిగే అవకాశం ఉందని వినికిడి. ఏదేమైనా కల్కి సీక్వెల్ పై వస్తున్న ప్రతి అప్డేట్ సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది.