'కల్కి 2 ' రిలీజ్ ఎప్పుడు? స్పప్న ఏమన్నారంటే?

సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రతో పాటు మహాభారతానికి చెందిన కర్ణుడి పాత్రలో కూడా కనిపించనున్న సంగతి తెలిసిందే.;

Update: 2026-03-20 04:55 GMT

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి కల్కి 2పై పడింది. ఇప్పటికే తొలి భాగం షూటింగ్ సమయంలోనే సీక్వెల్‌ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు నిర్మాతలు అశ్వనీదత్, ప్రియాంక దత్, స్వప్న దత్ పలుమార్లు వెల్లడించారు.

రీసెంట్ గా సీక్వెల్‌ కు సంబంధించిన షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లి ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఆ షెడ్యూల్‌ లో కొద్ది రోజుల షూటింగ్ అనంతరం ప్రభాస్ సెట్లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రతో పాటు మహాభారతానికి చెందిన కర్ణుడి పాత్రలో కూడా కనిపించనున్న సంగతి తెలిసిందే.

ఇక విశ్వనటుడు కమల్ హాసన్ కూడా సీక్వెల్‌ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. తొలి భాగంలో కనిపించిన సుప్రీం యాస్కిన్ రోల్ ను మరింత విస్తరించేలా ఈసారి ఆయన పాత్ర ఉండబోతుందని సమాచారం. మార్చి తర్వాత ఆయన షూటింగ్‌ లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. తొలి భాగంలో సుమతి పాత్రలో నటించిన దీపికా పదుకొణె బదులు సీక్వెల్‌ లో ఎవరు నటిస్తారన్నది ఇంకా క్లారిటీ లేదు.

వైజయంతీ మూవీస్ బ్యానర్‌ పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సీక్వెల్ గా విజువల్ స్థాయిలో మరింత అద్భుతంగా ఉండబోతుందని సమాచారం. 2027లో ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ పై నిర్మాత స్వప్న దత్ చేసిన ఫన్నీ కామెంట్స్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.

హైదరాబాద్‌ లో నిన్న నిర్వహించిన గద్దర్ అవార్డుల కార్యక్రమంలో నిర్మాత ప్రియాంక దత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ ఆమెను కల్కి 2 విడుదలపై ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆ ప్రశ్నకు నవ్వుతూ స్పందించిన ప్రియాంక దత్.. 'అది తప్ప మరేదైనా అడిగితే బాగుండేది' అంటూ చమత్కరించారు. దీంతో వెంటనే స్పందించిన సుమ తన స్టైల్‌ లో జోక్ పేల్చారు.

నాగ్ అశ్విన్‌ ను ఎప్పుడు అడిగినా.. 'గ్రహాలు అన్నీ ఒకే చోటకు చేరినప్పుడు అని చెబుతారు' అంటూ నవ్వులు పూయించారు. ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత ప్రియాంక దత్ దంపతులే. దీంతో ఫన్నీ కన్వర్జేషన్ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణల్లో ఒకటిగా నిలిచింది. ఇక భారీ అంచనాల మధ్య రూపొందుతున్న కల్కి 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News