కంగనా ఎంపీ కావడంతో కాజల్‌కి ఛాన్స్‌...?

తాజాగా కన్నప్ప సినిమా ప్రమోషన్‌లో భాగంగా పార్వతి దేవి పాత్రను మొదట కంగనా రనౌత్‌కి ఆఫర్‌ చేసినట్లు చెప్పుకొచ్చారు.;

Update: 2025-06-12 13:09 GMT

సినిమా ఇండస్ట్రీలో కాజల్‌ అగర్వాల్‌ అడుగు పెట్టి రెండు దశాబ్దాలు కావస్తుంది. ఇప్పటి వరకు ఆమె ఎన్నో సూపర్‌ హిట్‌లను అందుకుంది. ఎంతో మంది సీనియర్‌, యంగ్‌ స్టార్‌ హీరోల సినిమాల్లో నటించింది. హీరోయిన్‌గా స్టార్‌ హీరోల సినిమాల్లో నటించిన కాజల్‌ అగర్వాల్‌ లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో కూడా నటించిన విషయం తెల్సిందే. కరోనా సమయంలో పెళ్లి చేసుకుని, ఇప్పుడు తల్లిగా కూడా మారిన కాజల్ అగర్వాల్‌ గతంలో మాదిరిగా బిజీగా సినిమా ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్‌గా బిజీగా ఉండాలని కోరుకున్న కాజల్‌ అగర్వాల్‌కి అది సాధ్యం కావడం లేదు. అరుదుగా మాత్రమే సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. కొన్ని సినిమాల్లో పెద్దగా ప్రాముఖ్యత లేని ఆఫర్లు వస్తున్నాయి, కొన్ని క్రేజీ సినిమాల్లో మెయిన్‌ లీడ్‌గా కాకుండా సపోర్టింగ్‌ రోల్స్ లో నటించే అవకాశాలు వస్తున్నాయి.

సాధారణంగా హీరోయిన్స్ దశాబ్ద కాలం కంటే ఎక్కువ సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ కాజల్‌ అగర్వాల్‌ దాదాపుగా 15 ఏళ్ల పాటు బిజీగా సినిమాలు చేసింది. ఈ మధ్య కాలంలో ఈమె జోరు తగ్గింది. అయితే ఈమెకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో పెద్ద సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించే అవకాశాలు దక్కుతున్నాయి. కనుక వచ్చిన ఏ ఒక్క పాత్రను వదిలి పెట్టకుండా ప్రతి ఆఫర్ ను సద్వినియోగం చేసుకునేందుకు గాను కాజల్‌ అగర్వాల్‌ ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా కాజల్‌ అగర్వాల్‌ 'కన్నప్ప' సినిమాలో నటించింది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించి నిర్మించిన ఈ భారీ బడ్జెట్‌ సినిమాలో కాజల్‌ అగర్వాల్, పార్వతిదేవి పాత్రలో నటించింది.

తాజాగా కన్నప్ప సినిమా ప్రమోషన్‌లో భాగంగా పార్వతి దేవి పాత్రను మొదట కంగనా రనౌత్‌కి ఆఫర్‌ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆమె సరిగ్గా ఆ సమయంలోనే పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిచిన కారణంగా కన్నప్ప సినిమాకు నో చెప్పిందట. పార్వతి దేవి పాత్రకు కంగనా అయితే బాగుండు అని భావిస్తున్న సమయంలో ఆమె నో చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో కాజల్‌ అగర్వాల్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. కాజల్‌ అగర్వాల్‌ పాత్ర కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. అయినా కూడా అత్యంత కీలకమైన పాత్రగా తెలుస్తోంది. పార్వతిదేవి పాత్రకు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో కాజల్ అగర్వాల్‌ను నటింపజేసినట్లు మంచు విష్ణు ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.

కన్నప్ప సినిమా ప్రమోషన్‌ లో భాగంగా కాజల్‌ అగర్వాల్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొంది. అంతే కాకుండా మంచి కథలను రెడీ చేస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం తల్లిగా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నట్లు పేర్కొంది. నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచన ఉన్నట్లు పేర్కొంది. కన్నప్ప సినిమా తరహాలోనే ముఖ్యమైన పాత్రల్లో నటించే అవకాశాలు వస్తే నటించేందుకు సిద్ధం అంది. హీరోయిన్‌ పాత్రలు మాత్రమే చేయాలి అనే పట్టింపు కాజల్‌ అగర్వాల్‌ లో కనిపించడం లేదు. కనుక ఆమె సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టినట్లే అని, ముందు ముందు ఆమె నుంచి మరిన్ని క్యారెక్టర్‌లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags:    

Similar News