కత్రిన‌-కృతి-దీపిక‌.. ఎవ‌రు బెస్ట్ బిజినెస్ ఉమెన్?

క‌త్రిన కైఫ్ - కే బ్యూటీ, కృతి స‌నోన్ - హైఫ‌న్, మ‌సాబా గుప్తా- ల‌వ్ చైల్డ్ మ‌సాబా, దీపిక ప‌దుకొనే - 82°E వంటి కంపెనీల‌ను ప్రారంభించారు.;

Update: 2025-12-02 03:15 GMT

సౌంద‌ర్య ఉత్ప‌త్తుల రంగంలో ప‌లువురు అగ్ర క‌థానాయిక‌లు పెట్టుబ‌డులు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌డిచిన కొన్నేళ్ల‌లో వ్య‌వ‌స్థాప‌కులుగా మారిన ప‌లువురు క‌థానాయిక‌లు ఈ రంగంలో లాభాలు ఆర్జిస్తున్నారా? లేదా? అన్న‌ది తెలుసుకోవాల‌నే కుతూహాలం అభిమానుల్లో ఉంది.

క‌త్రిన కైఫ్ - కే బ్యూటీ, కృతి స‌నోన్ - హైఫ‌న్, మ‌సాబా గుప్తా- ల‌వ్ చైల్డ్ మ‌సాబా, దీపిక ప‌దుకొనే - 82°E వంటి కంపెనీల‌ను ప్రారంభించారు. అయితే అన్ని ఛ‌ర్మ సౌంద‌ర్య ఉత్ప‌త్తులు ఒకేలా ప్ర‌జాద‌ర‌ణ పొంద‌వు. ఈ రంగంలో కొంద‌రు మాత్ర‌మే విజ‌యాలు సాధిస్తార‌ని నిరూప‌ణ అయింది. అంతేకాదు, ఇత‌రుల‌తో పోలిస్తే క‌త్రిన కైఫ్ `కే బ్యూటీ` సౌంద‌ర్య(మేక‌ప్) ఉత్ప‌త్తుల రంగంలో అద్భుత విజ‌యం సాధించింది. అదే స‌మ‌యంలో దీపిక ప‌దుకొనే వ్యాపారం పూర్తిగా కిందికి ప‌డిపోయి న‌ష్టాల బాట‌ను ప‌ట్టింది. ఉత్ప‌త్తుల ధ‌ర‌లు చుక్క‌ల్ని తాక‌డంతో వీటిని కొనేందుకు ఎవ‌రూ ఆసక్తిని చూప‌లేదు. కృతి స‌నోన్, మ‌సాబా గుప్తా త‌మ వ్యాపారాల‌ను స‌జావుగానే సాగిస్తున్నా, ఆశించినంత మెరుగుద‌ల‌ను న‌మోదు చేయ‌లేదు.

తాజా స‌మాచారం మేర‌కు.. క‌త్రిన కైఫ్ - కే బ్యూటీ .. అందాన్ని మెరుగు ప‌రిచే ఉత్ప‌త్తుల‌లో చ‌క్క‌ని డిమాండ్ తో మార్కెట్లో ఎదుగుతోంది. ఈ బ్రాండ్ 2019లో కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ప్రారంభ‌మైంది. భారతదేశం అంతటా చాలా వ్యాపారాలు దెబ్బతిన్నా కానీ, కే బ్యూటీ ఆన్‌లైన్ అమ్మకపు మోడల్ లో పెద్ద విజ‌యం సాధించింది. ఈ ఉత్ప‌త్తి బ‌ల‌మైన అమ్మ‌కాల‌తో మార్కెట్లో స్థిర‌మైన‌ స్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ బ్రాండ్ గత సంవత్సరం నుండి స్థూల అమ్మకాలలో 46 శాతం పెరుగుదలను నమోదు చేసింది. కత్రినా బ్రాండ్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 240 కోట్ల జీఎంవీ (స్థూల వస్తువుల విలువ)ని నమోదు చేసింది. 2026 నాటికి బ్రాండ్ స్థూల అమ్మకాలు రూ. 350 కోట్లకు చేరుకుంటాయి. జీఎంవీ అంటే డిస్కౌంట్లు, రిటర్న్‌లు వంటి త‌గ్గింపుల త‌ర్వాత ఉత్ప‌త్తి విలువ‌. ఇది ఖర్చులను తొలగించిన తర్వాత కంపెనీ వాస్తవ ఆదాయాన్ని చూపిస్తుంది. కత్రినా సెప్టెంబర్‌లో యూకే మార్కెట్లో తన ఉత్ప‌త్తి అమ్మ‌కాల‌ను ప్రారంభించింది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో బలమైన ఉనికిని కలిగి ఉంది.

క‌త్రిన త‌న బ్రాండ్ స‌రైన‌దో కాదో త‌నే స్వ‌యంగా చెక్ చేస్తుంది. త‌న ముఖంపై తానే మొద‌టి ఉత్ప‌త్తిని ముందుగా ప్ర‌యోగిస్తాన‌ని చెప్పింది. ఈ ఉత్ప‌త్తి సున్నిత‌మైన ముఖంపై ఎంత‌వ‌ర‌కూ సేఫ్ అనేది నేనే చెక్ చేస్తాను. ఎంత సుదీర్ఘ కాలం ప‌ని చేస్తుంది? వేడి వాతావ‌ర‌ణంలో ఎలాంటి రియాక్ష‌న్లు ఇస్తుంది? వంటి విష‌యాల‌ను స్వ‌యంగా చెక్ చేస్తాన‌ని క‌త్రిన చెప్పింది. ఈ నిజాయితీ, నిర్బీతి కే బ్యూటీ ఉత్ప‌త్తిపై న‌మ్మ‌కాన్ని పెంచాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

కే బ్యూటీ తో పోలిస్తే ఇతర సెలబ్రిటీ బ్రాండ్ల పరిస్థితి ఇలా ఉంది. దీపికా పదుకొనే నైకా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నా కానీ, త‌న సొంత స్కిన్‌కేర్ లేబుల్ 82°E ని స‌క్సెస్ చేయ‌డంలో విఫ‌ల‌మైంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ. 12.3 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. కృతి సనన్ స్కిన్‌కేర్ బ్రాండ్ హైఫన్ విలువ రూ. 207.5 కోట్లు. త‌న సంస్థ భారీ అభివృద్ధిని న‌మోదు చేసింద‌ని కృతి పేర్కొంది. డిజైనర్ మసాబా గుప్తా `లవ్‌చైల్డ్ మసాబా` అమ్మ‌కాల‌లో బలమైన పనితీరును కనబరిచింది. 2025లో రూ. 115 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. అయితే మార్కెట్లో ఎంత పోటీ ఉన్నా క‌త్రిన కే-బ్యూటీకి ఎదురే లేద‌ని నిరూప‌ణ అయింది.

Tags:    

Similar News