విడాకులపై కొత్త థియరీ!.. జునైద్ ఖాన్ కామెంట్స్ హాట్ టాపిక్!

సాధారణంగా విడాకులు అంటే గొడవలు, కోర్టులు, ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం చూస్తుంటాం. కానీ అమీర్ ఖాన్ కుటుంబం విషయంలో సీన్ రివర్స్.

Update: 2026-05-14 09:30 GMT

సాధారణంగా విడాకులు అంటే గొడవలు, కోర్టులు, ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం చూస్తుంటాం. కానీ అమీర్ ఖాన్ కుటుంబం విషయంలో సీన్ రివర్స్. భార్యాభర్తలుగా విడిపోయినా, తల్లిదండ్రులుగా ఎలా కలిసి ఉండాలో వారు నిరూపించారు. తాజాగా జునైద్ ఖాన్ తన పేరెంట్స్ విడాకుల గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విడాకులు అంటే బంధం ముగిసిపోవడం కాదు, అది కేవలం ఒక కొత్త రూపం తీసుకోవడమే అని జునైద్ మాటల తో మనకు అర్ధం అవుతుంది..

19 ఏళ్ల వరకు తెలియని రహస్యం:

జునైద్ ఖాన్ తాజగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక షాకింగ్ విషయం చెప్పాడు. అతనికి 19 ఏళ్లు వచ్చేవరకు తన తల్లిదండ్రులు ఒక విషయంలో విభేదిస్తారని కూడా అతనికి తెలియదట. సాధారణంగా ఇంట్లో చిన్న గొడవ జరిగినా పిల్లలకు తెలిసిపోతుంది. కానీ అమీర్, రీనా దత్ తమ మధ్య ఉన్న విభేదాలను పిల్లల ముందు అస్సలు రానివ్వలేదు. ఇక 19 ఏళ్ల వయసులో వారు మొదటిసారి గొడవ పడటం చూసి జునైద్ ఆశ్చర్యపోయాడట.

ఒకే మాట.. ఒకే బాట:

భార్యాభర్తలుగా విడిపోయిన తర్వాత కూడా పిల్లల పెంచే విషయంలో వారు పాటించిన క్రమశిక్షణ అమోఘం. తల్లి ఒక మాట, తండ్రి ఒక మాట చెప్పి పిల్లలను కన్ఫ్యూజ్ చేయలేదు. ఇక జునైద్, ఇరా ఖాన్‌ల విషయంలో వారు ఎప్పుడూ 'యునైటెడ్ ఫ్రంట్'గానే నిలబడ్డారు. అందుకే విడాకులు వారి మానసిక స్థితిపై పెద్దగా ప్రభావం చూపలేదని జునైద్ చాలా మెచ్యూర్డ్‌గా చెప్పాడు.

100 మీటర్ల దూరంలోనే మరో ప్రపంచం:

అమీర్ ఖాన్ కుటుంబం విడిపోయినా విడిపోనట్టే ఉంటుంది. వీరంతా కేవలం 100 మీటర్ల పరిధిలోనే నివసిస్తుండటం విశేషం. దీనివల్ల జునైద్‌కు తన తల్లి రీనా దత్ దగ్గర ఉన్నా, అటు తండ్రి అమీర్, ఆయన రెండో భార్య కిరణ్ రావు, అలాగే ప్రస్తుతం అమీర్ తో ఉన్న గౌరీ స్ప్రట్‌లతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక ఇక్కడ అందరూ ఒకే కుటుంబంలా కలిసి మెలిసి ఉండటం ఈ కాలంలో చాలా అరుదైన విషయం.

అమ్మ కంటే ఫ్రెండ్ లాగే:

కిరణ్ రావు గురించి మాట్లాడుతూ జునైద్ ఆమెను చాలా 'స్వీట్ అండ్ వార్మ్' పర్సన్ అని కొనియాడాడు. మొదట్లో ఆమెను 'కిరణ్ ఆంటీ' అని పిలిచేవాడట, కానీ ఆమె అభ్యర్థన మేరకు ఇప్పుడు పేరుతోనే పిలుస్తున్నట్లు చెప్పాడు. అలాగే అమీర్ ప్రస్తుత స్నేహితురాలు గౌరీ గురించి కూడా చాలా పాజిటివ్‌గా స్పందించాడు. పెద్దలందరూ మెచ్యూర్డ్‌గా ప్రవర్తించడం వల్లే మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని జునైద్ క్లారిటీ ఇచ్చాడు.

"ఇద్దరు మంచి వ్యక్తులు కలిసున్నంత మాత్రాన మంచి జంటగా ఉండకపోవచ్చు" అని జునైద్ చెప్పిన మాట విడాకులపై ఉన్న పాత ఆలోచనలను మారుస్తోంది. ఇక కలిసి వుండి బాధపడటం కంటే, విడిపోయి ఎవరికి వారు ప్రశాంతంగా ఉంటూ పిల్లలకు ఆదర్శంగా నిలవడం గొప్ప విషయం. అమీర్ ఖాన్ ఫ్యామిలీ ఈ విషయంలో ఒక పర్ఫెక్ట్ 'మోడ్రన్ ఫ్యామిలీ' అనిపించుకుంటోంది.

Tags:    

Similar News