మెగాస్టార్ ఇంటికి నందమూరి - అల్లు ఇరుగు పొరుగు!

ఈ ప్రాంతానికి ఉన్న మరో భౌగోళిక విశేషం ఏమిటంటే.. మెగాస్టార్ ఇంటికి కేవలం 500 మీటర్ల దూరంలోనే షూటింగులకు ప్రసిద్ధి చెందిన `బూత్ బంగ్లా` ఉండటం.;

Update: 2026-04-23 04:11 GMT

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతం ఇప్పుడు టాలీవుడ్ అగ్ర తారల నివాసాలకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నివాసం ఉంటున్న ప్రాంతం చుట్టూ ఇప్పుడు మరికొందరు స్టార్ హీరోలు తమ సొంత గృహాలను నిర్మించుకుంటూ సందడి చేస్తున్నారు. ఇటీవలి వార్తల ప్రకారం.. చిరంజీవి ఇంటికి అత్యంత సమీపంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక విలాసవంతమైన సొంత ఇంటిని నిర్మించుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఈ పరిసరాల్లో కేవలం మెగా హీరోలే కాకుండా.. నందమూరి హీరోలు కూడా తమ సొంత‌ బంగ్లాలను నిర్మించుకోవడమే అసలు విశేషం. చిరంజీవి ఇంటికి దగ్గరలోనే అల్లు అర్జున్ సుమారు 4000 గజాల భారీ స్థలంలో తన అభిరుచికి తగ్గట్టుగా కొత్త ఇంటిని కట్టుకున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. అదే సమయంలో నటసింహా నందమూరి బాలకృష్ణ కూడా అదే ప్రాంతంలో ఒక విశాలమైన స్థలంలో ఇంటి నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. గతంలో కె.బి.ఆర్ పార్క్ వద్ద ఆయనకు నివాసం ఉండేది.. అయితే మెట్రో అభివృద్ధి కారణంగా ఆ నిర్మాణాన్ని తొలగించాల్సి రావడంతో ఇప్పుడు చిరు ఇంటికి సమీపంలోనే తన కొత్త నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.

మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ క్రేజీ ఫేజ్ 3 ఏరియాలోనే ఉండబోతుండటం గమనార్హం. ఎన్టీఆర్‌కు ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నా కానీ... చిరంజీవి ఇంటికి అతి సమీపంలో తన అభిరుచికి అనుగుణంగా మరో భారీ విలాసవంతమైన నివాసాన్ని నిర్మించుకుంటున్నట్లు సమాచారం. దీనివల్ల `ఆర్.ఆర్.ఆర్` స్టార్లు, ప్రాణ స్నేహితులు అయిన‌ రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఒకే వీధిలో ఇరుగు పొరుగు వారు కాబోతున్నారు.

ఈ ప్రాంతానికి ఉన్న మరో భౌగోళిక విశేషం ఏమిటంటే.. మెగాస్టార్ ఇంటికి కేవలం 500 మీటర్ల దూరంలోనే షూటింగులకు ప్రసిద్ధి చెందిన `బూత్ బంగ్లా` ఉండటం. ఇది యాథృచ్ఛికమే అయినా సినీ ప్రముఖులకు ఇది ఎంతో అనుకూలమైన ప్రదేశం. అలాగే ఈ పరిసరాల్లోనే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన ప్రభుత్వ శిక్షణా కళాశాల కూడా కొలువై ఉంది.

స్టార్ హీరోలంతా ఇలా ఒకే చోట నివాసాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల జూబ్లీహిల్స్ లోని ఈ ప్రాంతం టాలీవుడ్ పవర్ సెంటర్‌గా మారిపోతోంది. ఒకవైపు చిరంజీవి, మరోవైపు బాలకృష్ణ, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి అగ్ర తారలందరూ ఇరుగు పొరుగు వారు కావడం అభిమానులకు ఆసక్తిని కలిగిస్తోంది. సినీ దిగ్గజాల ఇళ్ల‌న్నీ ఒకే చోట కేంద్రీకృతమవ్వడం ఆ ప్రాంత రియల్ ఎస్టేట్ విలువను కూడా భారీగా పెంచుతుంద‌న‌డంలో సందేహం లేదు.

సినీ రంగంలోని అగ్ర నటులందరూ తమ నివాసాలను ఒకే క్లస్టర్‌లో ఏర్పాటు చేసుకోవడం వల్ల.. వారి వ్యక్తిగత భద్రత ..అభిమానుల నియంత్రణ పరంగా భవిష్యత్తులో స్థానిక పోలీసు యంత్రాంగం జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News