డ్రాగ‌న్‌: పైకి న‌రహంత‌కుడులా క‌నిపించినా ఎన్టీఆర్ పాత్ర‌లో ట్విస్ట్ ఇదే!

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.. కేజీఎఫ్‌ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న 'డ్రాగన్' చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలేర్ప‌డిన సంగ‌తి తెలిసిందే.

Update: 2026-05-21 17:54 GMT

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.. కేజీఎఫ్‌ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న'డ్రాగన్' చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలేర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ వెబ్ లో సునామీ స్పీడ్ తో దూసుకువెళ్లింది. తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు సంబంధించిన పలు సంచలన విషయాలను షేర్ చేస్తూ ఎన్టీఆర్ పాత్ర‌లోని ఒక షేడ్ గురించి ప్ర‌త్యేకించి నొక్కి చెప్పారు.

ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత కాస్ట్‌లీ విలన్‌గా ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశామని తమలో తాము జోక్ చేసుకుంటూ ఉంటామని నీల్ వెల్లడించారు. తాను ఇప్పటివరకు రాసిన పాత్రలన్నింటిలోనూ తారక్ పోషిస్తున్న పాత్ర అత్యంత డార్క్ - నెగెటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ అంతటి భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో ఇలాంటి ఒక ప్రయోగాత్మక, రిస్కీ పాత్రను చేయడానికి ఒప్పుకోవడం చాలా గొప్ప విషయమని కొనియాడారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను 'లూగర్ - ది అసస్సిన్ ఇన్ చీఫ్' అనే పేరుతో ఒక హంతకుడిగా పరిచయం చేయడం వెనుక త‌న‌కు చాలా స్పష్టత ఉందని.. ప్రేక్షకులను తప్పుదోవ పట్టించకూడదనే అలా చేశామని నీల్ తెలిపారు. 'లూగర్' అనేది ఒక రకమైన పిస్టల్ లేదా గన్ పేరు నుండి తీసుకున్నామని.. దీనికి సినిమాలో ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఈ సినిమా ముగింపు సీన్‌ను లాక్ చేసిన తర్వాత... ఆ పాయింట్‌కు హీరో క్యారెక్టరైజేషన్‌ను సరిగ్గా జస్టిఫై చేయడానికి తనకు దాదాపు 3 సంవత్సరాల సమయం పట్టిందని అన్నారు. కేజీఎఫ్ (రాకీ), సలార్ (దేవా), డ్రాగన్ (లూగర్) లతో కూడిన తన గ్రే-షేడ్స్ (మారల్లీ కాంప్లెక్స్) క్యారెక్టర్ల ట్ర‌యాల‌జీలో ఇదే చివరి చిత్రమని ప్రశాంత్ నీల్ అధికారికంగా ప్రకటించారు.

ఈ మూడు కథలు కూడా భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాలంలోనే మొదలవుతాయని.. ఆ కాలంలో సామ్రాజ్యాలు స్థాపించడానికి ఉన్న అవకాశాలు తనను బాగా ఆకర్షించాయని డైరెక్టర్ చెప్పారు. అయితే తన గత చిత్రాల్లా కాకుండా.. ఈ సినిమా ముంబై, కోల్‌కతా వంటి నిజమైన నగరాల నేపథ్యంలో ఒక అరాచక (డిస్టోపియన్) వాతావరణంలో సాగుతుందని తెలిపారు. బ్రిటీషర్లు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లే సమయంలో.. ఆ తర్వాత సాగిన ఓపియం (నల్లమందు), హెరాయిన్ డ్రగ్స్ వ్యాపారాల బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ నడుస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్‌కు డ్రామా -కథా ఎమోషన్లపై అద్భుతమైన పట్టు ఉందని, `మహాభారతంలో అసలైన విజేత శకుని` అని ఎన్టీఆర్ చెప్పిన మాట తనను బాగా ఆలోచింపజేసిందని గుర్తుచేసుకున్నారు.

ఈ అసస్సిన్ పాత్ర కోసం ఎన్టీఆర్ ఎంతో అంకితభావంతో ప‌ని చేసార‌ని, పాత్ర పర్ఫెక్షన్ కోసం తారక్ చాలా కష్టపడ్డారని కొనియాడారు. ఈ సినిమాలో కేవలం హీరో మాత్రమే కాకుండా అనిల్ కపూర్, రుక్మిణీ వసంత్ వంటి ప్రతి ఒక్క పాత్రకూ ఒక బలమైన బ్యాక్ స్టోరీ ఉంటుందని.. పాత్రలే కథను ముందుకు నడిపిస్తాయని చెప్పారు. అలాగే, విజువల్స్ పరంగా తన గత చిత్రాలలా కెమెరాను విపరీతంగా తిప్పకుండా.. ఈసారి చాలా లేజీగా వాడుతూ నటీనటుల పర్ఫార్మెన్స్‌ను క్యాప్చర్ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చానని నీల్ తెలిపారు.

ఇంటర్వ్యూ ముగింపులో ప్రశాంత్ నీల్ ప్రేక్షకులకు ఒక ఊహించని పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. `డ్రాగన్` గ్లింప్స్ చూసి ఇదొక డార్క్ గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే పొరపాటని హెచ్చరించారు. పైకి నెగెటివ్ షేడ్స్, డ్రగ్స్ మాఫియా, హంతకుడి పాత్రలా కనిపించినా.. అంతిమంగా తాము ఇండియన్ స్క్రీన్‌పై అత్యంత అద్భుతమైన దేశభక్తి చిత్రాన్ని చూపించబోతున్నామని స్పష్టం చేశారు. ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ డిస్టోపియన్ యాక్షన్‌కు.. ఎన్టీఆర్ నటనకు తోడు ఈ `దేశభక్తి` అనే కోణం తోడవడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానానికి చేరుకున్నాయి.

Tags:    

Similar News