హీరో ఇమేజ్‌లకు సరిపోని దృశ్యం3 క్లైమాక్స్.. రివీల్ చేసిన జీతూ జోసెఫ్!
మలయాళ సినీ పరిశ్రమలో మరోసారి సంచలన విజయాన్ని నమోదు చేసిన సినిమా దృశ్యం3.
మలయాళ సినీ పరిశ్రమలో మరోసారి సంచలన విజయాన్ని నమోదు చేసిన సినిమా దృశ్యం3. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ.235 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి మలయాళ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్ట్ లో నాలుగో స్థానానికి చేరింది.
అయితే సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నప్పటికీ, గత రెండు భాగాల మాదిరిగా తెలుగు, కన్నడ భాషల్లో ఇది రీమేక్ కాకపోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఈ విషయంపై తాజాగా జీతూ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలుగులో వెంకటేష్ హీరోగా దృశ్యం, దృశ్యం2 సినిమాలు మంచి విజయాలు సాధించగా, కన్నడలో రవిచంద్రన్ నటించిన దృశ్య సిరీస్ కూడా ప్రేక్షకాదరణ పొందింది. దీంతో మూడో భాగం కూడా ఈ రెండు భాషల్లో రీమేక్ అవుతుందని చాలామంది భావించారు.
కానీ అలా జరగలేదు. దానికి ప్రధాన కారణంగా దృశ్యం3 క్లైమాక్స్ అని చెప్తున్నారు జీతూ. కథ ముగింపు మలయాళ ప్రేక్షకులకు బాగా పనిచేసినా, ఇతర భాషల స్టార్ హీరోల ఇమేజ్‌కు అది సరిపోదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా తెలుగు, కన్నడ పరిశ్రమల్లో హీరోలపై ఆడియన్స్ కు ఉన్న అంచనాలు, స్టార్ ఇమేజ్, వారి క్యారెక్టరైజేషన్స్ కారణంగా అదే ముగింపును యథాతథంగా అంగీకరించడం కష్టమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఈ రెండు భాషల్లో రీమేక్ ప్రయత్నాలు ముందుకు సాగలేదని చెప్పడం విశేషం.
అయితే హిందీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని జీతూ వెల్లడించారు. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హిందీ దృశ్యం3 కోసం రైట్స్ తీసుకున్న నిర్మాతలు కథలో కొన్ని మార్పులు చేసుకుంటామని మర్యాదపూర్వకంగా తమను సంప్రదించారని చెప్పారు. రైట్స్ కొనుగోలు చేసిన తర్వాత కథలో మార్పులు చేసే హక్కు వారికే ఉన్నప్పటికీ, ముందుగా తన అభిప్రాయం కోరడం సంతోషంగా అనిపించిందని పేర్కొన్నారు. క్లైమాక్స్‌ను హిందీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్చే దిశగా వారు అడుగులు వేస్తున్నారని, అందుకు తాను కూడా అంగీకరించినట్లు తెలిపారు.
ఇదే సమయంలో దృశ్యం4పై వస్తున్న ఊహాగానాలపై కూడా స్పందించిన జీతూ, ప్రస్తుతం నాలుగో భాగానికి సరిపడే కథ తన వద్ద లేదని స్పష్టం చేశారు. మూడో భాగం చివరలో చూపించిన పోస్ట్ క్రెడిట్ సీన్ కారణంగానే నాలుగో భాగంపై చర్చ మొదలైందని, అయితే అసాధారణమైన కథ ఆలోచన దొరికితేనే తదుపరి భాగాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే, దృశ్యం3 ఇతర భాషల్లో రీమేక్ కాకపోవడానికి కథ కాదు, క్లైమాక్స్ కాదు, స్టార్ హీరోల ఇమేజ్‌లే ప్రధాన కారణంగా మారడం ఆసక్తికర అంశంగా నిలిచింది.