స్టార్ హీరో డైరెక్షన్.. ప్రియురాలే మ్యూజిక్ డైరెక్టర్
తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి వ్యక్తిగత వ్యవహారంపై గత కొన్ని నెలలుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరుగుతోందో తెలిసిందే.
తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి వ్యక్తిగత వ్యవహారంపై గత కొన్ని నెలలుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరుగుతోందో తెలిసిందే. తన భార్య ఆర్తి నుంచి విడిపోయిన అతను.. కనీషా అనే సింగర్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఐతే ఆర్తితో విడాకుల కేసు కోర్టులో నడుస్తుండగా.. ఇరువురూ పరస్పర ఆరోపణలతో మీడియాకెక్కడం చర్చనీయాంశమైంది.
రవి కొన్ని నెలల ముందు ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర ఆవేశానికి లోనవుతూ.. భార్యతో గొడవ తేలే వరకు సినిమాల్లో నటించనన్నాడు. మరోవైపు సోషల్ మీడియాలో ట్రోల్స్‌తో విసుగెత్తిపోయిన కనీషా తాను రవి నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. కానీ తర్వాత ఇద్దరూ నిర్ణయం మార్చుకున్నారు. రవి సినిమాల్లో కొనసాగుతున్నాడు. కనీషా అతడితోనే ఉంటోంది.
ఐతే ఇప్పుడు వీళ్లిద్దరూ ప్రొఫెషనల్‌గానూ కలిసి పని చేయబోతున్నారు. రవి మోహన్ ప్రస్తుతం ఎన్ ఆర్డినరీ మ్యాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో కమెడియన్ యోగిబాబు హీరోగా నటిస్తుండడం విశేషం. ఒక స్టార్ హీరో కమెడియన్ని హీరోగా పెట్టి సినిమా తీయడం అరుదు. ఈ విభిన్న ప్రయత్నానికి కనీషా కూడా తనవంతు సహకారం అందిస్తోంది. ఈ చిత్రానికి ఆమే సంగీత దర్శకురాలిగా పని చేస్తుండడం విశేషం.
కనీషా సింగర్‌గా పాపులరే కానీ సంగీత దర్శకురాలిగా అనుభవం లేదు. అయినా తన బాయ్‌ఫ్రెండ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎత్తింది. రవి దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌ను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత తనపై పడిందని, అందుకే తానే ఆ బాధ్యత తీసుకున్నానని కనీషా తెలిపింది. ఈ చిత్రాన్ని రవి మోహన్ స్టూడియోస్ బేనర్ మీద రవినే స్వయంగా నిర్మిస్తుండడం గమనార్హం. అతను బ్రో కోడ్ సహా పలు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. తెలుగులో మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న వడ్డీ కాసులవాడు చిత్రంలో రవి వేంకటేశ్వరస్వామి పాత్రలో కనిపించనుండడం విశేషం.